Begin typing your search above and press return to search.

ఇలా వచ్చి అలా మాయమవుతున్న విలన్లు!

By:  Tupaki Desk   |   26 May 2021 2:30 PM GMT
ఇలా వచ్చి అలా మాయమవుతున్న విలన్లు!
X
ఏ సినిమాలోనైనా హీరో .. హీరోయిన్ ఉండటం సహజమే. అయితే ఆ సినిమా ఆసక్తికరంగా .. రసవత్తరంగా ఉండాలంటే మాత్రం విలన్ ఉండాల్సిందే. హీరో ఆశయానికో .. ఆనందానికో అతను అడ్డుపడుతూ ఉంటేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేయగలుగుతారు. విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే అంతగా హీరో సత్తా తెలుస్తుంది. సరైన విలన్ లేకపోతే హీరోయిజం తేలిపోతుంది. అభిమానులు నిరాశకు లోనవుతారు. అందువల్లనే హీరోకి గల క్రేజ్ ను బట్టి విలన్స్ ను ఎంపిక చేస్తూ ఉంటారు.

ప్రేక్షకులు తెరపై విలనిజం చూస్తూ ఎంతగా తిట్టుకుంటే అంతగా ఆ విలనిజం పండినట్టు .. ఆ విలన్ అంత బాగా చేసినట్టు. అలా తెలుగు తెరపై హీరోలకి కుదురు లేకుండా .. హీరోయిన్ కి కునుకుపట్టకుండా చేసిన విలన్లు చాలామందినే ఉన్నారు. తమదైన బాడీ లాంగ్వేజ్ తో వాళ్లు భయపెట్టారు .. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో కంగారు పెట్టేశారు. అయితే అలాంటి విలన్లలో ముఖేశ్ రుషి .. ఆశిష్ విద్యార్ధి .. ప్రదీప్ రావత్ .. సోనూ సూద్ వంటి కొంతమంది మాత్రమే కొంతకాలం పాటు నిలబడిగలిగారు.

ఇక వివేక్ ఒబెరాయ్ .. అరుణ్ విజయ్ .. రవికిషన్ .. ఎస్.జె.సూర్య .. అరవింద స్వామి .. దేవ్ గిల్ .. రాహుల్ దేవ్ వంటి విలన్లు భయంకరమైన విలనిజం చూపించినా, వరుసగా అవకాశాలను అందుకోలేకపోయారు. ఎప్పటికప్పుడు కొత్త విలన్లను పరిచయం చేయాలనే ట్రెండ్ అందుకు కారణమైందని చెప్పుకోవాలి. అందువల్లనే ఇప్పుడు వస్తున్న విలన్లు ఒకటి రెండు సినిమాలకి మించి కనిపించడం లేదు. ఇక ప్రకాశ్ రాజ్ .. జగపతిబాబు .. రావు రమేశ్ .. సంపత్ రాజ్ వంటివారు విలనిజంతో పాటు, ఇతర పాత్రల్లోను మెప్పిస్తుండటం వలన, ఇంకా బిజీగానే ఉన్నారు.