Begin typing your search above and press return to search.

అభిమానులే తిర‌స్క‌రించిన డిజాస్ట‌ర్ కి అంత టీఆర్పీనా?

By:  Tupaki Desk   |   5 Jun 2020 6:00 AM GMT
అభిమానులే తిర‌స్క‌రించిన డిజాస్ట‌ర్ కి అంత టీఆర్పీనా?
X
మ‌హ‌మ్మారీ పాఠాలు కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా ఎగ్జిబిట‌ర్ పాలిట ఇది శాపంగా మారింది. ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెరుచుకునే స‌న్నివేశం క‌నిపించ‌డం లేదు. రోజురోజుకి తెలుగు రాష్ట్రాలు స‌హా దేశంలో వైర‌స్ ప్ర‌భావం పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. దీని ప‌ర్య‌వ‌సానం వినోద‌ప‌రిశ్ర‌మ‌పైనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఓవైపు థియేట‌ర్ వ్య‌వ‌స్థ కిందికిందికి దిగ‌జారిపోతుంటే.. మ‌రోవైపు బుల్లితెర‌- ఓటీటీ- డిజిట‌ల్ మాత్రం ఆకాశంలోకి లేస్తోంది.

థియేట‌ర్ల‌కు వెళ్లే అవ‌కాశం లేక‌పోవ‌డంతో జ‌నాలంతా ఇళ్ల‌లోనే సినిమాలు చూస్తున్నారు. బుల్లితెర‌పై పూర్తిగా ఆధార‌ప‌డిపోయారు. టీవీల్లో వ‌చ్చిన ప్ర‌తి సినిమా చూసేయ‌డం.. డిజిట‌ల్లో ఏది స్ట్రీమింగ్ అవుతోందో వెతుక్కోవ‌డం అల‌వాటుగా మారింది. ప‌ర్య‌వ‌సానంగా బుల్లితెర‌కు టీఆర్పీలు అదిరిపోతున్నాయి. ఓటీటీలు స్కైలోకి లేస్తున్నాయి. స‌రిగ్గా ఇదే పాయింట్ 2019 సంక్రాంతి డిజాస్ట‌ర్ మూవీ `విన‌య విధేయ రామా`కు పెద్ద ప్ల‌స్ గా మారింది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి తెర‌కెక్కించిన ఊర‌మాస్ మూవీ ఇది. క్రిటిక్స్ చీవాట్ల‌తో పాటు.. కామ‌న్ ఆడియెన్ తిర‌స్కారానికి గురైన ఈ డిజాస్ట‌ర్ మూవీ లేటెస్ట్ టీఆర్పీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

`వినయ విద్యా రామ` ఒక‌ర‌కంగా అరుదైన‌ ఘనతను సాధించింది. అది కూడా బుల్లితెర టీఆర్పీలో. ఆశ్చర్యకరంగా ఈ చిత్రం 7.97 టీఆర్పీ రేటింగ్ పొందింది. ఇది ఎవరూ ఊహించ‌నిది. ఇప్ప‌టికే ప‌లుమార్లు స్టార్ మాలో ఈ మూవీని జ‌నం చూసేశారు. అయినా ఇప్పుడు లాక్ డౌన్ వేళ మ‌రోసారి మునుప‌టి కంటే విశేష ఆద‌ర‌ణ ద‌క్కింది. అయితే ఇదంతా సినిమాలో కంటెంట్ గొప్ప‌త‌నం అనుకుంటే పొర‌పాటే. రామ్ చ‌ర‌ణ్ కి ఉన్న అసాధార‌ణ ఫాలోయింగ్ తో అప్ప‌ట్లో 50శాతం రిక‌వ‌రీ సాధించిన ఈ చెత్త సినిమా(అభిమానులే డిసైడ్ చేశారు).. ఇప్పుడు బుల్లితెర టీఆర్పీల్లో స‌క్సెస్ కావ‌డానికి కార‌ణం మాత్రం కొవిడ్ 19 లాక్ డౌన్ ప‌ర్య‌వ‌సానం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.