Begin typing your search above and press return to search.

‘ఇంటెలిజెంట్’ రిస్క్ పెద్దదే

By:  Tupaki Desk   |   29 Jan 2018 11:30 PM GMT
‘ఇంటెలిజెంట్’ రిస్క్ పెద్దదే
X
ఒకప్పుడు వివి వినాయక్ అంటే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఒక్క ఆది సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ని అమాంతం ఎక్కడికో తీసుకెళ్ళిన ఘనత వినాయక్ కే దక్కుతుంది. ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయట పడడానికి తారక్ కు కొన్నేళ్ళు పట్టింది. అంత విజయం సాధించిన మూవీ అది. కాని అదే సినిమా వినాయక్ ప్రతిభను ఒకరకంగా అణిచేసింది అనే చెప్పాలి. దిల్ లాంటి ప్రేమకథను డీల్ చేసిన వినాయక్ ఆ తర్వాత పూర్తిగా మాస్ బ్రాండ్ కి అంకితం అయిపోయాడు. మారిన అభిరుచుల్లో అలాంటి సినిమాలు అంతగా వర్క్ అవుట్ కావడం లేదు. పోనీ కొత్తగా ట్రై చేద్దామని అఖిల్ చేస్తే అది కాస్త కొత్త కుర్రాడికి భయం పుట్టించి రెండేళ్ళు గ్యాప్ తీసుకునేలా చేసింది. ఖైది నెంబర్ 150తో ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టాడు కాని క్రెడిట్ మొత్తం చిరు ఖాతాలోకి వెళ్లిపోయింది.

ఇప్పుడు సాయి ధరం తేజ్ కు ఇంటెలిజెంట్ హిట్ కావడం చాలా అవసరం. జవాన్, విన్నర్, తిక్క ఇలా వరస బెట్టి దెబ్బలు పడటంతో అర్జెంటుగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన రిస్క్ లో ఉన్నాడు. దానికి తోడు వరుణ్ తేజ్ తొలిప్రేమ కూడా అదే రోజు రిలీజ్ ఉండటం కూడా కొంత ఇబ్బంది పెడుతోంది. వరుణ్ ఫిదా బ్లాక్ బస్టర్ తో ఊపుమీదున్నాడు. మోహన్ బాబు గాయత్రి కూడా అదే రోజు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇంత పోటీని ఇంటెలిజెంట్ ఎదురుకోవాలి అంటే రెగ్యులర్ కంటెంట్ ఉంటే మాత్రం సరిపోదు.

టీజర్ కూడా మరీ గొప్ప రెస్పాన్స్ ఏమి తెచ్చుకోలేదు. ట్రైలర్ వచ్చాక ఏమైనా కొత్తగా కనిపిస్తుందేమో చూడాలి. నాయక్ కు కథ మాటలు రాసిన ఆకుల శివనే దీనికి కూడా రచన చేయటం వల్లనో ఏమో కొన్ని పోలికలు ఆ సినిమాకు దీనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైవిధ్యంతో ఉంటూనే మాస్ ని కనక మెప్పించగలిగితే సుప్రీమ్ తరహాలో సేఫ్ గా బయటపడటంతో పాటు ఇమేజ్ ను కూడా పెంచుకోవచ్చు. మరి 30 కోట్ల బడ్జెట్ తో ఇంత రిస్క్ మోస్తున్న వినాయక్ - తేజులు ఇందులో విజయం సాధించేది లేనిది వచ్చే శుక్రవారం తేలిపోతుంది.