Begin typing your search above and press return to search.

మహేష్‌ కోసం కథ తయారు చేస్తున్నా

By:  Tupaki Desk   |   6 Nov 2015 11:30 AM GMT
మహేష్‌ కోసం కథ తయారు చేస్తున్నా
X
సూపర్‌ స్టార్‌ మ‌హేష్ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఛ‌రిష్మా ఉన్న సెన్సేష‌న‌ల్ హీరో. శ్రీ‌మంతుడు చిత్రంతో తెలుగు సినిమా రికార్డులన్నీ తిర‌గ‌రాశాడు. సోష‌ల్ సినిమాతో 100 కోట్ల క్లబ్‌ లో ప్ర‌వేశించిన మొద‌టి హీరో ప్రిన్స్‌. ఓవ‌ర్సీస్‌ లోనూ బాక్సాఫీస్ కింగ్‌. బాహుబ‌లి త‌ర్వాత 100 కోట్ల క్ల‌బ్ సినిమా ని ఇచ్చింది మ‌హేష్ ఒక్క‌డే. అందుకే ఇప్పుడున్న స్టార్ డైరెక్ట‌ర్లంతా మ‌హేష్‌ తో ప‌నిచేయ‌డం కోసం పోటీప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి బాహుబ‌లి 2 త‌ర్వాత మ‌హేష్‌ తో సినిమా తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే క‌థ రెడీ చేసేందుకు క‌స‌ర‌త్తు సాగుతోంది.

అయితే నేను కూడా పోటీలో ఉన్నా అంటూ సెన్సేష‌న‌ల్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ లైన్‌ లోకి వ‌చ్చాడు. ఇప్ప‌టికే మ‌హేష్ తో సినిమా కోసం క‌థ రెడీ చేస్తున్నా అని ఇదివ‌ర‌కే చెప్పాడు. అత‌డితో సినిమా చేస్తే భారీ సినిమానే చేయాలి అని గ‌తంలో అన్నాడు. ఇప్పుడు అధికారికంగా మ‌రోసారి త‌న ఆస‌క్తిని బైటికే చెప్పేశాడు.. ''మ‌హేష్‌ తో సినిమా తీయ‌డానికి నేను రెడీ. ప్రిన్స్‌తో ఆ సంగ‌తి మాట్లాడాను. నేను వెయిట్ చేస్తా. మంచి క‌థ‌తో రండి అని మ‌హేష్ అన్నారు. ప్ర‌స్తుతం క‌థ త‌యారు చేసే ప‌నిలో ఉన్నా..'' అంటూ వినాయ‌క్ చెప్పారు. ''ఒక‌వేళ మహేష్‌ తో సినిమా చేస్తే 100 కోట్ల సినిమానే చేయాలి. పెద్ద సినిమానే ప్లాన్ చేయాలి. అందుకోస‌మే వేచి చూస్తున్నా'' అని అన్నాడు.

ఈ ప‌రిణామాలు చూస్తుంటే రాజ‌మౌళితో పోటీకి విన‌య్ తెర‌తీసిన‌ట్టే. ఇటీవ‌లి కాలంలో మెగాస్టార్ 150వ సినిమా కోసం పూరిజగ‌న్నాథ్‌ - వినాయ‌క్ పోటీప‌డ్డారు. ఇప్పుడు ప్రిన్స్ కోసం వినాయ‌క్‌ - రాజ‌మౌళి పోటీకి దిగుతున్నార‌న్న‌మాట! రేసులో బాహుబ‌లి ఎవ‌రో ?