Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'వీఐపీ-2’

By:  Tupaki Desk   |   26 Aug 2017 10:38 AM GMT
మూవీ రివ్యూ: వీఐపీ-2’
X
చిత్రం : ‘వీఐపీ-2’

నటీనటులు: ధనుష్ - అమలా పాల్ - కాజోల్ - సముద్రఖని - శరవణ సుబ్బయ్య - వివేక్ - బాలాజీ తదితరులు
సంగీతం: సీన్ రోల్డాన్
ఛాయాగ్రహణం: సమీర్ తాహిర్
నిర్మాత: కలైపులి థాను
కథ: ధనుష్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సౌందర్య రజినీకాంత్

తెలుగులో మార్కెట్ సంపాదించుకోవాలని సుదీర్ఘ కాలంగా ప్రయత్నం చేసి చేసి.. చివరికి రెండేళ్ల కిందట ‘రఘువరన్ బీటెక్’ సినిమాతో ఆ కల నెరవేర్చుకున్నాడు ధనుష్. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఆ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. థియేటర్లలోనే కాదు.. టీవీల్లోనూ ఆ సినిమా సూపర్ హిట్టయింది. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కింది. తమిళంలో రెండు వారాల కిందటే రిలీజైన ఈ చిత్రం.. తెలుగులో చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

తనకు ఉద్యోగం ఇచ్చిన అనిత కన్ స్ట్రక్షన్స్ లోనే పని చేస్తూ ఆ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతూ.. బెస్ట్ ఇంజినీర్ గా అవార్డు కూడా అందుకుంటాడు రఘువరన్ (ధనుష్). ఐతే అప్పుడే రఘువరన్ గురించి తెలుసుకున్న వసుంధర (కాజోల్) సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ అయిన తన కంపెనీలో అతణ్ని చేరమంటుంది. కానీ అందుకు రఘువరన్ ఒప్పుకోడు. దీంతో అతడిపై ఆమె కక్ష కడుతుంది. రఘువరన్ పని చేసే కంపెనీ నుంచి అతను వెళ్లిపోవాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. అతను బయటికి వచ్చాక నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాల్ని కూడా వసుంధర దెబ్బ తీస్తుంది. ఆ పరిస్థితుల్లో రఘువరన్ ఏం చేశాడు.. వసుంధరపై ఎలా పోరాడాడు.. ఆమెపై ఎలా గెలిచాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘రఘువరన్ బీటెక్’కు ఏవైతే బలమయ్యాయో.. దాని సీక్వెల్ కు అవే బలహీనతలవడమే చిత్రం. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా చూస్తుంటే ఇదేంటి మళ్లీ ‘హ్యాపీడేస్’ చూస్తున్నట్లే ఉందే అనిపించినట్లుగా ‘వీఐపీ-2’ చూస్తుంటే.. మళ్లీ ‘రఘువరన్ బీటెక్’ చూస్తున్నట్లే ఉందే అనిపిస్తుంది. ‘రఘువరన్ బీటెక్’ చూస్తున్నపుడు ఎంతో కొత్తగా అనిపించి.. అందులోని వినోదానికి.. ఎమోషన్లకు బాగా కనెక్టయిపోతాం. కానీ ‘వీఐపీ-2’ను అదే ఫార్మాట్లో నడిపిస్తూ.. అదే తరహాలో ఎంటర్టైన్మెంట్.. ఎమోషన్లను పండించే ప్రయత్నం చేశారు. ఇదంతా తొలి భాగంలోనే చూసేశాం కదా.. మళ్లీ ఇదే చూపిస్తున్నారేంటి అనిపిస్తుంది.

‘రఘువరన్ బీటెక్’తో పోలికలు పక్కన పెట్టేసి మామూలుగా చూసినా.. ‘వీఐపీ-2’ అంత కిక్కివ్వదు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్లు జెన్యూన్ గా అనిపించవు. అలాగే హీరోకు.. కాజోల్ కు మధ్య పోరాటం కూడా అంత పకడ్బందీగా లేదు. కేవలం ‘రఘువరన్ బీటెక్’ తాలూకు సక్సెస్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలా ఇది కనిపిస్తుంది తప్పితే ‘వీఐపీ-2’లో విషయం తక్కువ. దాదాపుగా ‘రఘువరన్ బీటెక్’ ఫార్మాట్లోనే సాగిపోతుంది ‘వీఐపీ-2’. ప్రథమార్ధంలో ప్రధానంగా కుటుంబ నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ మీద దృష్టిపెట్టారు. తొలి భాగంలో తండ్రి అతడికి యాంటీగా ఉండి.. తల్లి స్నేహితురాలిలా ఉండి అతడికి మద్దతుగా నిలిస్తే.. ఇందులో తండ్రి అతడికి స్నేహితుడిలా మారిపోతాడు. తండ్రి స్థానంలోకి భార్య వస్తుంది. ఆమెకు.. అతడికి మధ్య డిష్యుం డిష్యుం నడుస్తుంటుంది. ఈ గిల్లికజ్జాల మీదే కొంత కథను నడిపించారు. ఐతే తొలి భాగంలో మాదిరి ఎమోషనల్ కనెక్ట్ ఏమీ లేకపోవడంతో ఇది ఓ మోస్తరుగా అనిపిస్తుంది.

మిగతా కథ అంతా రఘువరన్ కు.. వసుంధరకు మధ్య జరిగే పోరు మీదే సాగుతుంది. ‘వీఐపీ-2’ తీవ్ర నిరాశకు గురి చేసేది ఇక్కడే. కాజోల్ ను పెట్టుకున్నారు కాబట్టి ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుందని.. ఆమెకు ధనుష్ కు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా పకడ్బందీగా ఉంటాయని ఆశిస్తాం. అలాంటిదేమీ జరగదు. ఇద్దరి మధ్య ఎత్తులు పైఎత్తులు చాలా సాధారణంగా ఉంటాయి. ‘రఘువరన్ బీటెక్’లో హీరో విలన్లను ఎదిరించే తీరు కానీ.. అతడికి ఎదురయ్యే అడ్డంకులు కానీ.. చివరికి వాళ్లపై గెలిచే తీరు కానీ.. ప్రేక్షకుడిలో ఒక ఎమోషన్ తీసుకొస్తాయి. కానీ ఇందులో అదే మిస్సయింది. సన్నివేశాల్లో బలం లేకుండా.. ఊరికే హీరోను ఎలివేట్ చేసేందుకు స్లో మోషన్ షాట్లు పెట్టడం.. థీమ్ మ్యూజిక్ వేసి అతణ్ని పైకి ఎత్తే ప్రయత్నం జరగడం.. విసుగు తెప్పిస్తాయి. సినిమా అంతా అయ్యాక కూడా హీరో ఏం సాధించాడని చూస్తే ఏమీ ఉండదు.

క్లైమాక్స్ ‘వీఐపీ-2’కు మరో పెద్ద బలహీనత. వసుంధర మీద రఘువరన్ గెలిచేలా ఒక పెద్ద క్లైమాక్స్ ఆశిస్తే.. హోరాహీరో సన్నివేశాలు.. ఫైట్ లాంటిదేమీ లేకుండా కొంచెం భిన్నంగా సినిమాను ముగించేందుకు ధనుష్ అండ్ కో చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. రఘువరన్-వసుంధర సింపుల్ గా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. మొత్తంగా ‘వీఐపీ-2’ అయ్యేసరికి.. ‘రఘువరన్ బీటెక్’ ఎంత మంచి సినిమానో అర్థమవుతుంది. అర్జెంటుగా మళ్లీ ఆ సినిమా ఒకసారి చూసి.. దీని తాలూకు నెగెటివ్ ఫీలింగ్ అంతా పోగొట్టుకోవాలని అనిపిస్తుంది. అసలు ‘వీఐపీ-2’ను ఇలా తీర్చిదిద్ది.. మళ్లీ ‘వీఐపీ-3’ కూడా తీయబోతున్నట్లు ధనుష్ ఎలా ప్రకటించగలిగాడో?

నటీనటులు:

ధనుష్ కొత్తగా చేసిందేమీ లేదు. తనకు అలవాటైన రఘువరన్ పాత్రను ఈజీగా చేసుకెళ్లిపోయాడు. ఎక్కడా అతను ఇబ్బంది పడలేదు. ‘రఘువరన్ బీటెక్’లో మాదిరే అక్కడక్కడా రజినీకాంత్ సిగ్నేచర్ స్టయిల్స్ ను అనుకరించాడు ధనుష్. హీరోయిన్ అమలా పాల్ కూడా ఈజీగా తన పాత్రను కానిచ్చేసింది. కాజోల్ పాత్ర అంత బలంగా లేకపోయినా.. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్.. నటన ఆకట్టుకుంటాయి. హీరో తండ్రి పాత్రలో సముద్రఖని ఓకే. వివేక్ అక్కడక్కడా కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. విలన్ పాత్రలో కనిపించిన శరవణ సుబ్బయ్య పర్వాలేదు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

‘వీఐపీ-2’కు అతి పెద్ద డ్రా బ్యాక్ సంగీతం. తొలి భాగానికి అనిరుధ్ ఎంత బలమయ్యాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు ప్రేక్షకులు సైతం అతడి పాటలు.. నేపథ్య సంగీతానికి ఫిదా అయిపోయారు. అతను లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ‘రఘువరన్ బీటెక్’ సిగ్నేచర్ మ్యూజిక్ ఇందులో పూర్తిగా మిస్సయింది. హీరో ఎలివేషన్ సన్నివేశాల్లో.. ఎమోషనల్ సీన్లలో అనిరుధ్ మ్యూజిక్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. మామూలుగా చూస్తే సీన్ రోల్డాన్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుందేమో కానీ.. ఈ చిత్రానికి అతడి సంగీతం సెట్టవ్వలేదు. పాటలు కూడా ఏవీ రిజిస్టర్ కావు. సమీర్ తాహిర్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ధనుష్ తీర్చిదిద్దుకున్న కథలోనే అంత విషయం లేదు. ఇక సౌందర్య రజినీకాంత్ స్క్రీన్ ప్లే తోనూ ఏం మ్యాజిక్ చేయలేకపోయింది. దర్శకత్వ పరంగానూ మెరుపులేమీ లేవు. ఇద్దరూ కలిసి ‘రఘువరన్ బీటెక్’కు ఒక పేలవమైన సీక్వెల్ తయారు చేశారు.

చివరగా: వీఐపీ-2.. రఘువరన్ వీక్ అయిపోయాడు!

రేటింగ్- 1.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre