Begin typing your search above and press return to search.

కోహ్లిని అనుష్క ఎంతగా మార్చేసిందంటే..

By:  Tupaki Desk   |   5 Jun 2017 11:47 AM GMT
కోహ్లిని అనుష్క ఎంతగా మార్చేసిందంటే..
X
ఎంత వారలైనా కాంత దాసులే అని రుజువు చేస్తున్నాడు ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి. తన జీవితంలో ఎవరూ తేనన్ని మార్పులు తన ప్రేయసి అనుష్క శర్మ తీసుకొచ్చిందని అతను చెప్పాడు. ఆమె వల్ల తాను ఎన్నో విషయాల్లో తనను తాను మార్చుకున్నానని.. తన అభిప్రాయాలు కూడా చాలా వరకు మారాయని అతను తెలిపాడు. ఒకప్పుడు అనుష్కతో తన బంధం గురించి ఓపెన్ గా మాట్లాడేందుకు ఇష్టపడని కోహ్లి.. ఈ మధ్య తన గురించి చాలా ముచ్చట్లే చెబుతున్నాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో విరాట్ మాట్లాడుతూ.. అనుష్క తన జీవితంలోకి వచ్చాక మహిళల పట్ల తన అభిప్రాయాలు మారిపోయాయన్నాడు. తాను ఫెమినిస్టుగా మారిపోయానని అతనన్నాడు. దేశంలో మహిళల పట్ల వివక్ష గురించి పెరిగి పెద్దయ్యేటపుడు తనకు తెలియదని.. ఐతే ఇప్పుడు తానో ఫెమినిస్టునని అన్నాడు. ఏ విషయాన్నయినా మహిళల కోణం నుంచి తానిప్పుడు ఆలోచించగలుగుతున్నానని.. ఇదంతా అనుష్క వల్లేనని విరాట్ చెప్పాడు.

జంతువుల విషయంలోనూ తన దృక్పథాన్ని అనుష్క మార్చిందని అతనన్నాడు. తనకు జంతువులంటే ముందు నుంచి ఇష్టం ఉన్నప్పటికీ... వాటిపై ఇప్పుడున్నంత శ్రద్ధ ఇంతకుముందు లేదని.. వాటి మీద తానిప్పుడు అమితమైన ప్రేమ చూపిస్తున్నానని విరాట్ చెప్పాడు. ఇలా అనుష్క తన జీవితంలోకి వచ్చాక చాలానే మార్పు వచ్చిందని విరాట్ అన్నాడు. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న కోహ్లి-అనుష్క.. మధ్యలో విడిపోయి మళ్లీ కలిశారు. త్వరలోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/