Begin typing your search above and press return to search.

'విరాటపర్వం' సక్సెస్ మీట్: 'శంకరన్న వల్లే ఆమె చనిపోయింది కాబట్టి మాకు కోపం'

By:  Tupaki Desk   |   19 Jun 2022 4:30 AM GMT
విరాటపర్వం సక్సెస్ మీట్: శంకరన్న వల్లే ఆమె చనిపోయింది కాబట్టి మాకు కోపం
X
రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన చిత్రం ''విరాట పర్వం''. సుధాకర్ చెరుకూరి - డి.సురేశ్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుని, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

1990స్ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో.. ఖమ్మం జిల్లాకు చెందిన సరళ అనే మహిళ (సినిమాలో ఆమె పేరుని 'వెన్నెల'గా మార్చారు) నిజజీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా 'విరాటపర్వం' మూవీ రూపొందింది. ఈ విషయాన్ని రిలీజ్ కు ముందు వెల్లడించారు మేకర్స్. శనివారం హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ కు సరళ సోదరుడు మోహన్ రావు అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ.. ''కొన్నేళ్ల క్రితం వేణు ఉడుగుల ఈ కథ చెప్పారు. 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ఎలా చూపిస్తారో అనే భయం కలిగింది. కానీ ఆయన అర్థమయ్యేలా చెప్పేసరికి కన్విన్సింగ్ గా అనిపించింది. రానా - సాయిపల్లవి పేర్లు చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ప్రివ్యూకి రమ్మని చాలా సార్లు అడిగారు. ఈ సినిమాని ప్రేక్షకుడిగానే చూడాలనుందని చెప్పాను. సినిమా చూసిన తర్వాత మేము ఏం అనుకుంటున్నామో అదే తీశారు'' అని అన్నారు.

''మా ఇంట్లో కమ్యూనిస్ట్ వాతావరణం ఎక్కువ. మా చెల్లి విప్లవాన్ని ప్రేమించింది. తను స్టూడెంట్ ఆర్గనైజేషన్లోకి వెళ్లడాన్ని మేం వారించాం కానీ.. అంత డీప్ గా నక్సల్స్ లోకి వెళ్తుందని అనుకోలేదు. ఆమె దాన్ని ప్రేమించి ఇష్టంతోనే వెళ్ళింది. సినిమాలో రవన్న రచనలకు ప్రభావితమై వెళ్లినట్లు చూపించారు. రెండూ ఒక్కటే. ఆమె విప్లవాన్ని ప్రేమించింది. విప్లవం వలనే చనిపోయింది. అదే బ్యాడ్ లక్. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు''

''మాకు తెలిసిన రియల్ స్టోరీలో శంకరన్న (సినిమాలో 'రవన్న' పాత్ర) నెగిటివ్ క్యారక్టర్. తన వల్లే మా సిస్టర్ చనిపోయింది కాబట్టి మాకు ఆ కోపం వుండేది. కానీ రానా - సాయి పల్లవిని పాత్రలను డైరెక్టర్ చూపించిన విధానం అద్భుతంగా ఉంది. వేణు నాలుగేళ్ళ పాటు ఈ కథపై వర్క్ చేశాడు. సబ్జెక్టులో నాకంటే అతనికి ఎక్కువ పరిజ్ఞానం ఉంది. నా సోదరి విప్లవాన్ని ప్రేమించిన విషయం ఈ సినిమా ద్వారా నాకు అర్థమైంది''

''మా ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూశాం. నా భార్య మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగింది. ఎప్పుడూ వినని సంగీతం 'విరాటపర్వం' సినిమాలో వినిపించిదని చెప్పింది. సాయి పల్లవి - రానా లేకపోతే ఈ సినిమా లేదు. సురేష్ ప్రొడక్షన్ లాంటి బ్యానర్లో ఇలాంటి కథని తీసుకొని ఒక ప్రయోగం చేయడమనేది చాలా గొప్ప విషయం. రానా గారు ఇకపై ఇలాంటి ప్రయోగాలు చేయనని చెప్పారు. కానీ రానా గారే ఇలాంటి ప్రయోగాలు చేయగలరు. మంచి కథ దొరికితే ఆయన ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను'' అని సరళ సోదరుడు మోహన్ రావు అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు వేణు ఉడుగల మాట్లాడుతూ.. ''విరాటపర్వం చిత్ర రిలీజ్ అయిన అన్నీ చోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్న తీరుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను'' అని అన్నారు.

హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. ''నేను మోహన్ రావుగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీని చూసి నా గుండె బరువెక్కింది. వేణుగారు సరళ కథను ప్రజల వద్దకు చేర్చాలి అని ఎంతో హార్డ్ వర్క్ చేసారు. సురేష్ బాబు గారు సినిమాకు సంబంధించిన అన్ని విషయాలలో ఎంతో కేర్ తీసుకున్నారు. నేను సరళ పాత్ర చెయ్యడం గర్వంగా ఉంది. ఈరోజు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో ఎంతో సంతోషంగా ఉన్నాను'' అని చెప్పింది.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ''మొదటిసారి మా బ్యానర్ లో ఒక అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనలను సినిమాగా తీశాం. మా బుక్ లో ఈ బయోపిక్ ని గర్వంగా రాసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ప్రేమ కథలుంటాయి. కొన్ని సరైనవి ఉంటాయి.. కొన్ని తప్పుగా ఉంటాయి. కానీ ఇలాంటి ప్రేమకథ మాత్రం మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి. రెగ్యులర్ సినిమా రోజుల్లో ఇది ఒక మంచి సినిమాగా మిగిలిపోతుంది. సాయిపల్లవి వెన్నెల పాత్రను అంగీకరించకపోతే ఈ సినిమానే లేదు'' అని అన్నారు.