Begin typing your search above and press return to search.

నాని చేతికిస్తే ఎక్కడికో తీసుకెళ్తాడట

By:  Tupaki Desk   |   22 Sep 2016 7:30 PM GMT
నాని చేతికిస్తే ఎక్కడికో తీసుకెళ్తాడట
X
ఏ దర్శకుడైనా ఓ సన్నివేశం ‘ది బెస్ట్’ అనిపించేలా రావాలని స్క్రిప్టు రాసేటపుడు అనుకుంటాడని.. ఐతే మనం ఏం రాసినా నాని తన నటనతో దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తాడని అన్నాడు దర్శకుడు విరించి వర్మ. ‘ఉయ్యాల జంపాల’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విరించి.. ఇప్పుడు నానితో చేసిన ‘మజ్ను’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో విరించి మాట్లాడుతూ.. ‘‘మజ్ను సినిమాకు ఏం కావాలంటే అది సమకూర్చారు నిర్మాతలు. ఇక నాని గురించి ఎంత చెప్పినా తక్కువే. తనతో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. మనం ఏం రాసినా.. ఎలా తీసినా.. తన చేతికి వెళ్లేసరికి ఇంకో స్థాయిలో ఉంటుంది. మామూలు సన్నివేశాల్ని కూడా తన నటనతో ఇంకో రేంజికి తీసుకెళ్తాడు. ‘మజ్ను’ సినిమాను కేవలం 53 రోజుల్లోనే పూర్తి చేశాం. అలాగని ఎక్కడా రాజీ పడలేదు. మంచి టెక్నీషియన్లు దొరకడమే ఇందుకు కారణం. హీరోయిన్లు అనుశ్రీ.. ప్రియశ్రీ సినిమా అంతటా కనిపిస్తారు. వాళ్లతో ట్రావెల్ మొదలుపెట్టి.. చివరికి వచ్చేసరికి బాగా ఇష్టపడతాం. అంత బాగా ఉంటాయి వాళ్ల క్యారెక్టర్లు.

‘ఉయ్యాల జంపాల’ తర్వాత రెండో సినిమా చేయడానికి ఆలస్యమైంది. అయినప్పటికీ నానితో చేయడం.. ‘మజ్ను’ లాంటి మంచి సినిమాతో రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా పూర్తి కాకముందే భీమవరం నుంచి ఓ ఫ్రెండు ఫోన్ చేశాడు. మజ్ను సినిమా సూపర్ హిట్టవుతుందన్నాడు. అదేంటి అప్పుడే అలా అనేస్తున్నావంటే.. నాని సినిమా అంటే బాగుంటుందని.. అందులోనూ నాతో సినిమా కాబట్టి కచ్చితంగా బాగుంటుందని నమ్మకమని చెప్పాడు. ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందని ఆశిస్తున్నా’’ అని విరించి చెప్పాడు.