Begin typing your search above and press return to search.

విశాఖ టాలీవుడ్ .. కొత్త ఊపు తెస్తున్నారు!

By:  Tupaki Desk   |   28 May 2019 5:59 AM GMT
విశాఖ టాలీవుడ్ .. కొత్త ఊపు తెస్తున్నారు!
X
బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో కొత్త టాలీవుడ్ పెట్టాల‌న్న ప్ర‌తిపాద‌న ద‌శాబ్ధాల కాలం నాటిది. మ‌ద్రాస్ నుంచి తెలుగు సినీప‌రిశ్ర‌మ ఎటు వెళ్లాలి? ఎక్క‌డ ప్రారంభించాలి? అన్న ప్ర‌స్థావ‌న వ‌చ్చిన‌ప్పుడు ఏఎన్నార్ - దాస‌రి- కేఎస్.రామారావు- రామానాయుడు- కృష్ణ‌ వంటి ఉద్ధండులు బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో ప‌రిశ్ర‌మ‌ను పాదుకొల్పితే బావుంటుంద‌ని భావించారు. కానీ అనూహ్యంగా రాజ‌ధాని కేంద్రం హైద‌రాబాద్ లోనే ప‌రిశ్ర‌మ‌ను ప్రారంభించాల్సి వ‌చ్చింది. నాటి నిర్ణ‌యం వెన‌క ఎన్నో కారణాలు బ‌లంగా ప‌ని చేశాయి. ప‌రిశ్ర‌మ‌కు అనుకూలంగా ప్ర‌భుత్వాలు స్పందించి అక్క‌డే స్టూడియోల నిర్మాణానికి భారీగా భూములు ఇవ్వ‌డంతో టాలీవుడ్ బ‌లంగా వేళ్లూనుకుంది. ఒక‌వేళ అప్ప‌ట్లోనే విశాఖ న‌గ‌రంలో ప‌రిశ్ర‌మ ఏర్పాటు కోసం భూములు ఇచ్చి ఉంటే ఇప్ప‌టికే అక్క‌డ టాలీవుడ్ అద్భుతంగా క‌ళ‌క‌ళ‌లాడేద‌ని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు విశ్లేషించారు. జ‌మానా కాలం నుంచి విశాఖ‌- అర‌కులో 80-90 శాతం షూటింగులు చేస్తున్నా హైద‌రాబాద్ కేంద్రం కావ‌డం వ‌ల్ల వైజాగ్ గురించిన స‌రైన ప్ర‌చారం కూడా లేకుండా పోయింద‌ని కొంద‌రు చెబుతున్నారు.

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం మ‌రోసారి ప‌రిశ్ర‌మ త‌ల‌రింపుపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అయితే ఇరు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు తెలుగు వారే కాబ‌ట్టి ప‌రిశ్ర‌మ ఎటూ వెళ్లాల్సిన ప‌ని లేద‌ని విశ్లేషించారు. ఇక విభ‌జ‌న త‌ర్వాత‌ తెలుగు దేశం ప్ర‌భుత్వం వైజాగ్ లో కొత్త టాలీవుడ్ ని ప్రారంభిస్తామ‌ని.. హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌కు ధీటుగా త‌యారు చేస్తామ‌ని బీరాలు పోవ‌డం తెలిసిందే. చేసే ప‌నుల‌కు మాట‌ల‌కు పొంత‌న లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఎవ్వ‌రూ న‌మ్మ‌లేదు. ప‌లువురు సినీదిగ్గ‌జాలు బాబు దొంగాట‌కంపై ప‌లు సంద‌ర్భాల్లో తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. సినిమా వాళ్ల‌ను ఆకులో వ‌క్క‌లా వాడుకుని విసిరేసే ప్ర‌భుత్వం ఇది అంటూ స్టూడియోలు ఉన్న‌ ప‌లువురు సినీపెద్ద‌లు స‌హా తెలుగు ఫిలింఛాంబ‌ర్ వ‌ర్గాల్లోనే పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది.

అయితే విశాఖ టాలీవుడ్ అన్న‌ది విశాఖ వాసుల్లో.. ఉత్త‌రాంధ్ర‌లో బ‌లంగా నాటుకుపోయిన టాపిక్. అందువ‌ల్ల అక్క‌డ యాథృచ్ఛికంగానే కార్య‌క‌లాపాలు ప్రారంభ‌మ‌య్యాయి. జ‌మానా కాలం నుంచి ఫిలింఛాంబ‌ర్ యాక్టివిటీస్ సాగుతున్నా.. వాటికి ఇంత‌కాలానికి కొత్త ఊపు క‌నిపిస్తోంద‌ని తెలుస్తోంది. నాలుగేళ్ల క్రిత‌మే విశాఖ రామానాయుడు స్టూడియోస్ ప‌రిస‌రాల్లో నిర్మాత కె.ఎస్.రామారావు సార‌థ్యంలో ఎఫ్ ఎన్‌ సీసీ మొద‌లైంది. రెండేళ్ల‌లో రామానాయుడు స్టూడియోస్ ని ఆనుకుని ప్ర‌భుత్వ‌మే ఎఫ్ ఎన్ సీసీని నిర్మించేందుకు స్థ‌లం కేటాయించింద‌ని తెలుస్తోంది. ఇక 2002లోనే ఫిలింఛాంబ‌ర్ ని ప్రారంభించారు. విశాఖ‌- జ్యోతి థియేట‌ర్ లో ఆరంభం ఛాంబ‌ర్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేవారు. త‌ర్వాత దొండ‌ప‌ర్తి ఏరియాకి ఆఫీస్ ని మార్చారు. కొన్నేళ్లుగా ఫిలింఛాంబ‌ర్ ని యాక్టివ్ గానే ఉంది. తాజాగా విశాఖ‌లో మూవీ ఆర్టిస్టుల సంఘంని ప్రారంభించ‌డం మ‌రో ముంద‌డుగు అని చెబుతున్నారు. త్వ‌ర‌లో విశాఖ సినీప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన వెబ్ సైట్ ని ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వ మార్పు అనంత‌రం విశాఖ స్థానిక‌ ప్ర‌జ‌ల్లోనే ఉత్సాహం పెరిగింది. బీచ్ సొగసుల విశాఖ ఫిలిం హ‌బ్ యాక్టివిటీస్ రైజ్ అవ్వ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో అంద‌రిలో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. జ‌గ‌న‌న్న నిజాయితీగా ప‌ని చేస్తార‌ని.. విశాఖ‌లో ఫిలింహ‌బ్ ప్రారంభిస్తార‌నే హోప్ ఉంద‌ని విశాఖ మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్య‌క్షుడు ఎం.కృష్ణ కిషోర్ వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

విశాఖ మహానగరంలో నగర సినీ కళాకారులను దృష్టిలో పెట్టుకుని `విశాఖ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్`(వీఎంఏఏ) నూతనంగా ప్రారంభించామ‌ని అధ్యక్షుడు ఎం కిషోర్ తెలిపారు. ఈ అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షుడిగా నండూరి రామకృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏ ఏం. ప్రసాద్ కొన‌సాగుతారు. ఉపాధ్యక్షులుగా చలసాని కృష్ణ ప్రసాద్. రవితేజ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వై . అప్పారావు. సంయుక్త కార్యదర్శులుగ వర్రే నాంచారయ్య - డి హేమా వెంకటేశ్వరి - కోశాధికారిగా డి వరలక్ష్మి,లు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా చెల్లుబోయిన రమేష్ యాదవ్, వెంకటరమణ మూర్తి, అన్వేష్, శివ జ్యోతిలు ఎన్నికయ్యారు, ఈ విశాఖ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు గౌరవ సలహాదారులుగా బాదం గిరి సాయి- పీఆర్వో వీరబాబు-రాపేటిఅప్పారావు (జబర్దస్త్ అప్పారావు)- నవీన్ పట్నాయక్- సీనియ‌ర్ సినీ జ‌ర్న‌లిస్టు కం ఆర్టిస్ట్ శివాజీ- ఎఫ్ ఎం బాబాయ్ (దాడి త్రినాథరావు) వ్యవహరిస్తారు. విశాఖ‌లో సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి కోసం వీఎంఏఏ కృషి చేస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా అధ్య‌క్ష కార్య‌వ‌ర్గం ప్ర‌క‌టించింది.