Begin typing your search above and press return to search.

శింబు కోసం విశాల్ త్యాగం

By:  Tupaki Desk   |   21 Jan 2018 9:51 AM GMT
శింబు కోసం విశాల్ త్యాగం
X
హీరోగా ఉన్నప్పుడు చక్కగా సినిమాలు చేసుకుంటూ ఇంకే ఒత్తిడి లేకుండా హాయిగా గడిచిపోతుంది కాని పరిశ్రమలో కీలకమైన బాధ్యత ఏదైనా చేపడితే మాత్రం చాలా వాటికి జవాబుదారిగా ఉండాల్సి వస్తుంది. విశాల్ ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కుంటున్నాడు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఒక పాత్ర పోషిస్తూనే మరో పక్క నడిగర్ సంఘం వ్యవహారాలు చూసుకోవడం కత్తి మీద సాములా మారుతోంది. దానికి తోడు తాను నటిస్తూ నిర్మించే సినిమాల పనులు అదనం. తాజాగా కీ అనే ఆడియో ఫంక్షన్ లో అక్కడనున్న ఇతర నిర్మాతలు కొందరు విశాల్ ను ఓ వివాదం సాకుగా చూపించి ఇరికించే ప్రయత్నం చేయటం హాట్ టాపిక్ గా మారింది. కొంత కాలం క్రితం శింబు హీరోగా 'ఏఏఏ' సినిమా తీసిన మైకేల్ రాయప్పన్ అనే నిర్మాత ఆ సినిమా పరాజయం పాలై ఆర్థికంగా తాను నష్టపోవడానికి శింబునే కారణం అంటూ తీవ్ర విమర్శలు చేస్తూ ఆ మధ్య పెద్ద గొడవే చేసారు.

ఇప్పుడు విశాల్ అదే నిర్మాత నిర్మించిన కీ అనే సినిమా ఆడియో రిలీజ్ కు గెస్ట్ గా వచ్చాడు. అనుకోకుండా మరో అతిధి శింబు వల్ల మైకేల్ కు జరిగిన నష్టం గురించి లేవనెత్తడంతో కాసేపు స్ట్రక్ అయిన విశాల్ వెంటనే తేరుకుని శింబుకు అప్పుడే నోటీసులు ఇచ్చామని, కాని స్పందన లేదని, కావాలంటే ఈ కీ సినిమా కోసం తన కొత్త సినిమా వాయిదా వేసుకుంటానని ప్రకటించాడు. అంతే కాదు మైకేల్ కు ఓ సినిమా చేస్తానని హామీ కూడా ఇచ్చేసాడు. శింబు వివాదం మాత్రం ఇంతటితో వదిలేయాలని చెప్పడం ఫైనల్ ట్విస్ట్

శింబుని ఇంత వెనకేసుకురావడంలో అర్థమేంటో అని కోలీవుడ్ మీడియా రకరకాలుగా కథలు రాసేసింది. స్వతహాగానే వివాదాలు కోరి తెచ్చుకునే శింబుతో ఇప్పుడు నోటీసులు - చర్యలు అంటూ ఏవైనా మొదలు పెడితే తన ప్రవర్తనతో ఇంకా రచ్చ చేసి కోలీవుడ్ ని మరోసారి మీడియాలో హై లైట్ చేస్తాడనే ఉద్దేశంతోనే విశాల్ సైలెంట్ అయినట్టు రాసాయి. ఇప్పుడు శింబు కోసం తనకు చేసే ఉద్దేశం లేని నిర్మాతకు మాట ఇవ్వాల్సి వచ్చింది విశాల్. తప్పదు మరి. బాధ్యత అంటే ఎంతో కొంత త్యాగం కూడుకునే ఉంటుంది.