Begin typing your search above and press return to search.

'అయోగ్య' ఇచ్చిన‌ మాట త‌ప్పాడు!!

By:  Tupaki Desk   |   6 July 2019 1:30 AM GMT
అయోగ్య ఇచ్చిన‌ మాట త‌ప్పాడు!!
X
ఆల్రెడీ తెలుగులో బ్లాక్ బ‌స్టర్ అయిన సినిమాకి రీమేక్ అది. అక్క‌డా విజ‌యం సాధించింది. ఇప్పుడు తిరిగి తెలుగులోకి అనువాద‌మై రిలీజ‌వుతోంది. మ‌రి ఇక్క‌డ మ‌రోసారి ఆద‌రిస్తారా? ఎన్టీఆర్ లాంటి స్టార్ న‌టించిన `టెంప‌ర్` చిత్రాన్ని త‌మిళంలో విశాల్ హీరోగా రీమేక్ చేశారు. అక్క‌డ అయోగ్య పేరుతో రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించింది. అయితే అదే సినిమాని తెలుగులోకి అనువ‌దించి రిలీజ్ చేస్తుండ‌డం స‌ర్ ప్రైజ్ టాస్క్. అలా అటు తిరిగి ఇటు తిరిగి వ‌చ్చిన సినిమాని మ‌న ప్రేక్ష‌కులు మ‌రోసారి ఆద‌రిస్తారా? అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... విశాల్‌ హీరోగా తెలుగు `టెంపర్‌`కు రీమేక్‌(త‌మిళ్‌)గా రూపొందిన `అయోగ్య` తెలుగులో అదే టైటిల్‌ తో విడుదల కానుంది. ఏ.ఆర్.మురుగ‌దాస్ శిష్యుడు వెంకట్‌ మోహన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విశాల్ స‌ర‌స‌న రాశీఖన్నా కథానాయికగా నటించారు. `ఠాగూర్‌` మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సాధ‌క్ మూవీస్ అధినేత ప్ర‌శాంత్ గౌడ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. తాజాగా నిర్మాత రిలీజ్ తేదీని ప్ర‌క‌టించారు. ఈనెల‌ 12న సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

అయితే ఇక్క‌డ విశాల్ హిట్టు కొడ‌తాడా? అన్న‌దానిపై ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అప్ప‌ట్లో పందెంకోడి ఇంట‌ర్వ్యూల్లో `అయోగ్య‌` గురించి మాట్లాడిన విశాల్ ఓ మాట‌న్నారు. నేను టెంప‌ర్ రీమేక్ లో న‌టిస్తున్నా. కానీ తెలుగులో దానిని రిలీజ్ చేసే సాహ‌సం చేయ‌ను. ఒక‌వేళ ఇక్క‌డ రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ అభిమానులు న‌న్ను పోల్చి చూస్తారు. నేను ఎలా న‌టించినా ఎన్టీఆర్ రేంజులో చేయ‌లేద‌నే అంటారు. అందుకే ఇక్క‌డ రిలీజ్ చేయ‌ను!! అంటూ కుండ‌బ‌ద్ధ‌లు కొడుతూ చాలా స్ప‌ష్టంగా అన్నారు. కానీ ఇప్పుడు విశాల్ మాట త‌ప్పారు. అయోగ్య తెలుగు వెర్ష‌న్ రిలీజ‌వుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా చూస్తే త‌ప్ప‌కుండా విశాల్ న‌ట‌న‌కు పోలిక చెబుతారు. మ‌రి విశాల్ ఆడిన మాట ఎందుకు త‌ప్పిన‌ట్టు?

ఇక టెంప‌ర్ రీమేక్ గా వ‌చ్చిన అయోగ్య విశాల్ ఎన‌ర్జీ లెవ‌ల్ ని ప‌దింత‌లు చూపించింద‌ని త‌మిళ‌ క్రిటిక్స్ పొగిడారు. అలాగే త‌మిళ వెర్ష‌న్ క్లైమాక్స్ చాలా వ‌ర‌కూ మార్చారు. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా ప‌తాక స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దారు. ఈనెల 12న ఏపీ- నైజాంలో రిలీజ్ చేస్తున్నారు కాబ‌ట్టి ఫ‌లితం ఎలా ఉండ‌బోతోందో వేచి చూడాల్సిందే.