Begin typing your search above and press return to search.

ఆ వ్యాఖ్య‌ల‌పై విశాల్ క్ష‌మాప‌ణ చెబుతాడా..?

By:  Tupaki Desk   |   17 Aug 2016 5:33 PM GMT
ఆ వ్యాఖ్య‌ల‌పై విశాల్ క్ష‌మాప‌ణ చెబుతాడా..?
X
న‌టుడు విశాల్ పై నిర్మాత‌ల మండలి గ‌రంగ‌రంగా ఉంది! అత‌డు క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. ఒక‌వేళ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే, భ‌విష్య‌త్తులో అత‌డి సినిమాల విడుద‌ల విష‌యంలో పంపిణీదారులు స‌హ‌క‌రించ‌ర‌ని హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసింది. త‌ను చేసిన వ్యాఖ్య‌ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ వెంట‌నే స్పందించ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు, కబాలీ నిర్మాత క‌లైపులి థాను హెచ్చ‌రించారు!

కార‌ణం ఏంటంటే... నిర్మాత‌ల మండ‌లి తీరుపై విశాల్ ఇటీవ‌లే అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఏదైనా స‌మస్య వ‌చ్చింద‌ని వారి ద‌గ్గ‌ర‌కు వెళ్తే, దానిపై చ‌ర్చించ‌కుండా బోండాలూ బ‌జ్జీలు తెప్పించుకుని క‌బుర్ల‌తో కాల‌క్షేపం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించాడు. మండ‌లి బాగుప‌డాలంటే ఇప్పుడున్న జ‌న‌మంతా మారిపోవాల‌నీ, కొత్త నీరు వ‌చ్చిన‌ప్పుడే మంచి రోజులు వ‌స్తాయ‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. నిర్మాత‌ల మండలి పైర‌సీ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేద‌ని విశాల్ అన్నాడు. పైర‌సీ అనేది కేవ‌లం నిర్మాత‌ల‌కు మాత్ర‌మే న‌ష్టం క‌లించేది కాద‌నీ, వారితోపాటు న‌టులూ సాంకేతిక నిపుణుల కెరీర్ల‌పై ప్ర‌భావం ఉంటుంద‌ని వివ‌రించాడు.

డి.టి.హెచ్‌. రైట్స్ విష‌య‌మై కూడా నిర్మాత‌లు స్పందించి ఒక నిర్ణ‌యం తీసుకుంటే, సినిమాకు కొత్త ఆదాయం వ‌స్తుంద‌న్నాడు. ఒక సినిమా విడుద‌లైన 15 రోజుల త‌రువాతే డీవీడీలు మార్కెట్లోకి వ‌చ్చేలా ఒప్పందాలు కుదుర్చుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చాడు. ఈ ఉచిత స‌ల‌హాల‌పైనే నిర్మాత‌ల మండ‌లి ఆగ్ర‌హించింది. మండ‌లిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్య‌లు తీవ్రంగా ఉన్నాయ‌నీ, అలా మాట్లాడినందుకు విశాల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పితీరాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ఈ విష‌య‌మై త‌న‌కు నిర్మాత‌ల మండ‌లి నుంచి ఎలాంటి స‌మాచారం లేద‌నీ, అధికారంగా స‌మాచారం వ‌చ్చాక‌నే తాను స్పందిస్తాన‌ని విశాల్ చెప్పాడు. క‌బాలి నిర్మాత‌కూ విశాల్ కు మ‌ధ్య ఈ మ‌ధ్య‌నే మాటామాటా తేడా వ‌చ్చింద‌నీ, దాని ప‌ర్య‌వ‌సానంగానే థాను ఇలా విశాల్ కు వార్నింగ్ ఇచ్చార‌ని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు!