Begin typing your search above and press return to search.

తమిళ సినీరాజకీయంలో తెలుగు హీరోయిజం

By:  Tupaki Desk   |   19 Oct 2015 7:28 AM GMT
తమిళ సినీరాజకీయంలో తెలుగు హీరోయిజం
X
పొరుగు రాష్ట్రంలో తెలుగు తలెత్తుకుంది. స్వభాషా అభిమానంతో పరభాషలను ద్వేషించడమే కాకుండా ఆ భాషలు మాట్లాడేవారినీ పరాయివారిగానే భావించే నేలపై తెలుగు తడాఖా చూపింది.

తమిళనాడు ప్రభుత్వం తెలుగు భాషకు, తెలుగు మాట్లాడే ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. కానీ, అక్కడి తమిళ సినీ పరిశ్రమ మాత్రం తెలుగుకు తోడుగా నిలిచింది. బెదిరింపులు, దాడులను ఎదుర్కొని తెలుగును తలకెత్తుకుంది. తమిళ సినీరంగానికి సంబంధించిన నడిగర్ సంఘం ఎన్నికల్లో తెలుగోడు విశాల్ సాధించిన విజయం సామాన్యం కాదు. ఆయన విజయం కొత్త సంకేతాలను పంపింది.

వివాదాలు - ఆరోపణలు - ప్రత్యారోపణలు - బెదిరింపులు - దాడుల మధ్య జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో హీరో విశాల్ గెలిచిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న నటుడు శరత్ కుమార్ ప్యానల్‌పై.. హీరో విశాల్ ప్యానల్ గెలిచింది. విశాల్ సాధించిన విజయం సాధారణమైనది కాదు. తమిళ పరిశ్రమలో ఉన్న భాషా దురభిమానులు చాలామందికి తెలుగువాడైన విశాల్ అంటే అస్సలు పడదు. వారంతా విశాల్ ను పోటీలో ఉండొద్దంటూ నయానా భయానా బెదిరించారు. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు ప్రాంతానికి చెందిన విశాల్ కుటుంబం ఎప్పుడో తమిళనాడులో స్థిరపడింది. తమిళనాట అగ్రహీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. భారీ అభిమానగణం ఈయన సొంతం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ వర్గం విశాల్ ను ఎన్నిరకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా ప్రయత్నించింది. విశాల్ తమిళుడు కాదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. విశాల్ ను రెచ్చగొడుతూ, అవమానిస్తూ చివరికి దాడికి కూడా దిగింది. ఇవన్నీ విశాల్ పట్ల అక్కడి నటవర్గంలో మరింత సానుభూతిని పెంచాయి.

విశాల్ ఎలా గెలిచాడు..

పదేళ్లుగా ఈ ప్యానెల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శరత్ కుమార్ వర్గంతో ఇబ్బందులు పడుతున్న తమిళ సినీ వర్గం విశాల్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం తొలి మలుపు. శరత్ వర్గం ఏకఛత్రాధిపత్యం, ఇష్టారాజ్యంతో తమిళ సినీ పరిశ్రమ నానా ఇబ్బందులు పడింది. అంతేకాకుండా యువ ఓటర్లంతా విశాల్ పక్షానే ఉన్నారు. వివాద రహిత నేపథ్యం, కలుపుగోలుతనం, సీనియర్ల పట్ల గౌరవం వంటి లక్షణాలు విశాల్ పట్ల అందరిలోనూ సానుకూలత కలిగేలా చేశాయి. చిన్ననటుల నుంచి పెద్ద నటుల వరకు అందరితోనూ విశాల్ కు మంచి సంబంధాలున్నాయి. ఇది ప్రధానంగా ఆయనకు లాభించింది. విశాల్ ఎలాంటివాడన్నదే చూశారు కానీ, తమిళుడు కాదన్న భావనే ఎవరికీ రాలేదు. విశాల్ ను తమవాడిగానే భావించారు వారంతా. విశాల్ ప్యానల్ తరపున నాజర్ అధ్యక్షుడిగా పోటీ చేయడమూ లాభించింది. ఆయనా వివాదరహితుడు కావడంతో తమిళ సినీ పరిశ్రమ వారి వెంట నడిచింది.

భాషా దురభిమానాలతో కొట్టుకుంటన్న ఈ దేశంలో విశాల్ గెలుపు మేలి మలుపుగానే చెప్పాలి. తమిళ నటులు కూడా ఈ విషయంలో దురభిమానం కంటే అభిమానమే అసలైనదని నిరూపించారు.