Begin typing your search above and press return to search.

విశాల్.. వాళ్ల మీదా పోటీకి రెడీ

By:  Tupaki Desk   |   15 Nov 2016 6:32 AM GMT
విశాల్.. వాళ్ల మీదా పోటీకి రెడీ
X
తెలుగు తేజం విశాల్.. తమిళనాట పెద్ద తలకాయలతో ఢీకొట్టి బాగానే నెట్టుకొస్తున్నాడు. నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ ను సవాలు చేసి.. అతడి టీం మొత్తాన్ని ఎన్నికల్లో మట్టి కరిపించిన విశాల్.. ఇప్పుడు నిర్మాతల మండలి మీద పడ్డాడు. పైరసీ మీద పోరాటంలో నిర్మాతలు విఫలమయ్యారంటూ వాళ్ల మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన విశాల్ పై తాజాగా నిషేధం పడ్డ సంగతి తెలిసిందే. ఐతే ఈ సస్పెన్షన్ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి నిర్మాతలపై ఎదురుదాడి చేసిన విశాల్.. వాళ్ల మీద కూడా ఎన్నికల్లో పోటీకి రెడీ అని ప్రకటించాడు. జనవరిలో జరిగే నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీకి దిగనున్నట్లు అతను ప్రకటించాడు. విశాల్ నిజాయితీ పరుడని.. అతను లేవనెత్తే ప్రశ్నల్లో న్యాయం ఉంటుందని.. ఇమేజ్ ఉన్న నేపథ్యంలో నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ విశాల్ సంచలన ఫలితం రాబడతాడేమో అన్న చర్చ మొదలైంది.

మరోవైపు తనపై పడ్డ సస్పెన్షన్ వేటుపై విశాల్ స్పందిస్తూ.. నిర్మాతల్ని గట్టిగానే వాయించేశాడు. ‘‘ప్రశ్నించడమే నేరమా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. నాపై నిషేధం షాక్ అని చెప్పను కానీ.. ఆశ్చర్యం అయితే కలిగింది. నాకు నిర్మాతల సంఘం నుంచి అంతకు ముందు ఎప్పుడో ఒక లేఖ వచ్చింది. ఐతే అందులో సంఘం అధ్యక్షుడి పేరు కానీ.. కార్యదర్శి పేరు కానీ లేదు. ఒక న్యాయవాది ద్వారా ఆ లేఖను పంపారు. అయినా ఒక నిర్మాతగా.. సహ నిర్మాతలకు మంచి జరగాలని కోరుకోవడం.. వారి వైపు నిలబడి ప్రశ్నంచడం నేరమా? సస్పెన్షన్‌ విషయంలో చట్టబద్ధంగా ఎదుర్కొంటాను. ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదు. నేను చేసిన నేరమేంటో నాకు తెలియదు. అప్పుడెప్పుడో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాతల సంఘం ప్రతినిధులు.. నిర్మాతల శ్రేయస్సు గురించి పట్టించుకోవడం లేదని.. బోండాలు భజ్జీలు తింటూ కాలం గడిపేస్తున్నారని అన్నాను. అందులో తప్పేముంది. ఇలాంటి వ్యాఖ్యలే నటుడు కరుణాస్‌ చేశారు. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి చర్యలు తీసుకోలేదు. అసలు పైరసీని అరికట్టే విషయంలో నిర్మాతల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి’’ అని విశాల్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/