Begin typing your search above and press return to search.

విశాల్.. మరీ ఇంత కాన్ఫిడెన్సా?

By:  Tupaki Desk   |   10 July 2018 4:45 AM GMT
విశాల్.. మరీ ఇంత కాన్ఫిడెన్సా?
X
తమిళంలో ‘చెల్లమే’ అనే చిన్న సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు విశాల్. ఆ తర్వాత ‘పందెంకోడి’ లాంటి సినిమాలతో కొంచెం పేరు సంపాదించి మీడయం రేంజి హీరోగా కొనసాగాడు. కానీ గత కొన్నేళ్లలో అతడి ఇమేజ్ బాగా పెరిగింది. సినిమాల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ మంచి హిట్లు కొట్టడమే కాక.. నడిగర్ సంఘం.. నిర్మాతల మండలి రాజకీయాల్లో అడుగు పెట్టి వాటి ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించి.. పరిశ్రమకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపట్టి రీల్ హీరోగానే కాక.. రియల్ హీరోగా కూడా మంచి పేరు సంపాదించాడు విశాల్. ఇది అతడి సినిమాలకు కూడా బాగా ఉపయోగపడింది. కోలీవుడ్ లో సమ్మె తర్వాత విడుదలైన అతడి సినిమా ‘ఇరుంబు తిరై’ పెద్ద హిట్టయింది. స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గని రీతిలో వసూళ్లు సాధించింది.

ఈ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో విశాల్.. తన తర్వాతి సినిమా విషయంలో పెద్ద సాహసమే చేయబోతున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో తాను నటించిన ‘సెండైకోళి-2’ (పందెం కోడి సీక్వెల్) చిత్రాన్ని దీపావళి రేసులో నిలబెట్టాడు. దీపావళికి విజయ్- మురుగదాస్ సినిమాతో పాటు సూర్య-సెల్వరాఘవన్ చిత్రం కూడా విడుదల కాబోతోంది. వాళ్లే ముందు బెర్తులు బుక్ చేసుకున్నారు. నిజానికి ‘సెండైకోళి-2’ ఆగస్టు లేదా సెప్టెంబరులో రిలీజవుతుందని అంతా అనుకున్నారు. ఐతే ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేస్తేనే మంచిదని విశాల్ ఫిక్సయ్యాడు. సమ్మె తర్వాత తమిళ నిర్మాతల మండలి నేతృత్వంలోని ఒక కమిటీ రిలీజ్ డేట్ల సంగతి తేలుస్తోంది. ఆ కమిటీకి అప్లై చేసుకుని అక్టోబరు 18న తన సినిమాను రిలీజ్ చేసుకోవడానికి అనుమతి తెచ్చుకున్నాడు విశాల్. మరి విజయ్.. సూర్య సినిమాలు కూడా దీపావళికే వస్తే.. వాళ్ల పోటీని విశాల్ తట్టుకోగలడా అన్నది డౌటు. కానీ విశాల్ దేనికీ భయపడే రకం కాదు. ఆ మనస్తత్వంతోనే బడా హీరోల్ని ఢీకొట్టడానికి రెడీ అయిపోయాడు.