Begin typing your search above and press return to search.

తమిళ సినిమాల విడుదల ఆపేసిన విశాల్

By:  Tupaki Desk   |   9 Oct 2017 5:18 PM GMT
తమిళ సినిమాల విడుదల ఆపేసిన విశాల్
X
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో తమిళ సినీ పరిశ్రమలో పెద్ద సంక్షోభమే నెలకొంది. అంతకుముందు తమిళనాట అసలు వినోదపు పన్ను అన్నదే లేదు. తమిళంలో టైటిల్ పెట్టి.. సెన్సార్ బోర్డు దగ్గర యు/ఎ సర్టిఫికెట్ పట్టుకొస్తే వినోదపు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చేది అక్కడి ప్రభుత్వం. ఐతే జీఎస్టీ రాకతో ఆ సంప్రదాయానికి తెరపడింది. కేంద్ర ప్రభుత్వం విధించే 28 శాతం జీఎస్టీ పన్నును కట్టక తప్పని పరిస్థితి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేదు. ఇది చాలదన్నట్లు తమిళనాడు ప్రభుత్వం అదనంగా 10 శాతం పన్ను విధించడంతో తమిళ నిర్మాతలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పన్నే లేని దశ నుంచి 38 శాతం పన్ను కట్టాల్సిన స్థితికి రావడంతో లబోదిబోమంటున్నారు.

దీనిపై ఇప్పటికే తమిళ నిర్మాతలు పలుమార్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించినా కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రాలేదు. దీంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్.. ఆందోళనను ఉద్ధృతం చేయాలని నిర్ణయించాడు. కనీసం రాష్ట్ర ప్రభుత్వ పన్ను అయినా రద్దు చేయకపోతే పరిశ్రమ బతకదంటున్న విశాల్.. ఈ పన్ను రద్దుకు డిమాండ్ చేస్తూ కొత్త సినిమాల విడుదలను ఆపించాడు. గత శుక్రవారం తమిళనాట విడుదల కావాల్సిన ఆరు సినిమాలు ఆగిపోయాయి. అయినా ప్రభుత్వం కరుణించలేదు. దీంతో ఈ వారం కూడా నిరసనను కొనసాగించాలని విశాల్ నిర్ణయించాడు. ఈ వారాంతంలో కూడా కొత్త సినిమాలు విడుదల కావని అతను ప్రకటించాడు. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు సంకట స్థితిలో పడ్డారు. ఐతే నిర్మాతల బాగు కోసమే తాను పోరాడుతున్నానని.. సమస్య పరిష్కారమయ్యే వరకు ఓపిక పట్టాలని విశాల్ కోరుతున్నాడు.