Begin typing your search above and press return to search.

కరుణానిధి నియోజకవర్గంలో పోటీ చేస్తా-విశాల్

By:  Tupaki Desk   |   29 Oct 2018 7:03 AM GMT
కరుణానిధి నియోజకవర్గంలో పోటీ చేస్తా-విశాల్
X
తెలుగువాడైన విశాల్ తమిళంలో హీరోగా చిన్న స్థాయిలో మొదలుపెట్టి పెద్ద రేంజికి వెళ్లాడు. మొదట్లో ఇతనేం హీరో అన్నవాళ్లంతా.. ఆ తర్వాత అతడి ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయారు. కేవలం మాస్ హీరోగా ఎదగడం కాదు.. నడిగర్ సంఘం ఎన్నికల్లో తన టీంను గెలిపించుకుని.. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా నెగ్గి.. ఆ తర్వాత పరిశ్రమ బాగు కోసం అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి రియల్ హీరో అనిపించుకున్నాడతను. ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు.. మామూలు జనాల్లోనూ మంచి ఫాలోయింగే సంపాదించుకున్నాడు విశాల్. అతడికున్న ఆదరణ చూశాక రాజకీయాల్లో రాణించగలడన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి విశ్లేషకుల్లో. గత ఏడాది జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన నియోజకవర్గంలో విశాల్ పోటీ చేసేందుకు కూడా ప్రయత్నించడం.. అనూహ్యంగా అతడి నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడం తెలిసిందే.

అంతమాత్రాన విశాల్ వెనక్కి తగ్గట్లేదు. అతను అతి త్వరలోనే రాజకీయారంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరుణానిధి మరణంతో ఖాళీ అయిన నియోజకవర్గంలో పోటీకి సై అంటున్నాడు విశాల్. కొన్ని కారణాల వల్ల అక్కడ ఎన్నిక వాయిదా పడింది. త్వరలోనే ఈసీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు విశాల్ ప్రకటించాడు. సినీ పరిశ్రమలో ఎలా అయితే తన పదవుల్ని బాధ్యతతో నిర్వర్తించానో.. రాజకీయాల్లో కూడా అంతే నిబద్ధతతో ఉంటానని విశాల్ చెప్పాడు. తాను త్వరలోనే జనాల్లో ఎన్నికలపై చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు విశాల్ తెలిపాడు. డబ్బు తీసుకోకుండా ఓటు వేయడంపై ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపడతానని అతనన్నాడు. మరోవైపు కోలీవుడ్లో మహిళలపై లైంగిక వేధింపుల్ని నివారించేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు విశాల్ వెల్లడించాడు.