Begin typing your search above and press return to search.

మళ్లీ ‘పంజా’ విసరబోతున్న డైరెక్టర్

By:  Tupaki Desk   |   18 Sept 2015 9:00 PM IST
మళ్లీ ‘పంజా’ విసరబోతున్న డైరెక్టర్
X
తమిళ పరిశ్రమలో ఉన్న విలక్షణమైన దర్శకుల్లో విష్ణువర్ధన్. మన నవదీప్ హీరోగా నటించిన ‘అరిందుమ్ అరయామళం’ దగ్గర్నుంచి ఈ మధ్యే అజిత్ హీరోగా తెరకెక్కిన ‘ఆరంభం’ వరకు అతడి సినిమాలు చాలా విలక్షణంగా ఉంటాయి. ఐతే తమిళంలో భారీ హిట్లు కొట్టిన విష్ణుకి తెలుగులో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం దక్కినా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పంజా’ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో మళ్లీ ఇంకో తమిళ దర్శకుడితో పని చేయడానికి పవన్ భయపడే పరిస్థితి తలెత్తింది. ఐతే విష్ణు మాత్రం పవన్ తో మళ్లీ ఇంకో సినిమా తీస్తానని.. హిట్టు కొడతానని నమ్మకంగా చెబుతున్నాడు.

పంజా సినిమా చేస్తున్నపుడే పవన్ తనతో ఇంకో సినిమా చేస్తానని మాటిచ్చాడని.. ‘పంజా’ ఫ్లాప్ అయినప్పటికీ తనతో టచ్ లోనే ఉన్నాడని.. ఆయన కోసం తాను మరో కథ సిద్ధం చేస్తున్నానని చెప్పాడు విష్ణు. ఈసారి కమర్షియల్ హంగులేమీ తగ్గకుండా మంచి కథ సిద్ధమవుతోందని విష్ణు చెప్పాడు. పవన్ కళ్యాణ్ హీరోగా కంటే తనకు వ్యక్తిగా ఎంతో ఇష్టమని.. పంజా ఫలితం చూశాక కూడా తనతో వ్యవహరించిన తీరుకు ముగ్ధుడినైపోయానని.. అలాంటి హీరోతో మంచి సినిమా తీయాలని గట్టిగా ఫిక్సయ్యానని విష్ణు చెప్పాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని అతనంటున్నాడు. ఐతే ఇప్పటికే మూణ్నాలుగు ప్రాజెక్టులు పవన్ కోసం లైన్ లో ఉన్నాయి. వాటిలో ఏది ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు విడుదలవుతుందో తెలియట్లేదు. మరి విష్ణుతో ప్రాజెక్టు ఎప్పుడు తెరమీదికి వస్తుందో చూడాలి.