Begin typing your search above and press return to search.

కథ వినగానే కంట్రోల్ చేసుకోలేకపోయాను: విష్వక్సేన్

By:  Tupaki Desk   |   5 May 2022 4:30 AM GMT
కథ వినగానే కంట్రోల్ చేసుకోలేకపోయాను: విష్వక్సేన్
X
విష్వక్ సేన్ మొదటి నుంచి కూడా కాస్త మాస్ గా ఉండే పాత్రలనే చేస్తూ వచ్చాడు. దాంతో విష్వక్ కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఇటు ఇండస్ట్రీలోను .. అటు బయట కూడా వ్యక్తమయ్యాయి. దాంతో ఆయన ఫ్యామిలీ ఆడి యన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగిన కథనే ఈ సారి ఎంచుకున్నాడు. అలా ఈ సారి ఆయన నుంచి వస్తున్న సినిమానే 'అశోకవనంలో అర్జున కల్యాణం'. కథాకథనాల సంగతి అటుంచితే టైటిల్ మాత్రం కొత్తగా .. వైవిధ్యంగా అనిపిస్తోంది.

ఈ నెల 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో విష్వక్ మాట్లాడుతూ .. 'అశోకవనంలో అర్జున కల్యాణం' గురించి చెప్పాలంటే, ఈ సినిమాను నేను ఒక నెల రోజుల క్రితమే చూసుకున్నాను. చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో పెద్ద మ్యాజిక్ ఉంటుంది. నేను ఇప్పుడు కూడా చెబుతున్నాను. నా కెరియర్ లో నేను ది బెస్ట్ ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో నా పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. అందువలన నేను మరింత కష్టపడి చేయవలసి వచ్చింది.

ఈ సినిమాలోని హీరోలో మనందరిలోని ఫీలింగ్స్ ఉంటాయి .. అందువలన ఆ పాత్రకి అంతా కనెక్ట్ అవుతారు. కథ వినకముందు .. ఈ జోనర్ సినిమాను చేయనని చెప్పి తప్పించుకుని తిరిగాను .. కథ విన్న తరువాత కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇంతవరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు. 'నువ్వు నాకు నచ్చావ్' .. 'మల్లేశ్వరి' జోనర్లోకి ఈ సినిమా వస్తుందని నేను అనుకుంటున్నాను. చాలామంది ఈ టైటిల్ విషయంలో క్లారిటీ అడుగుతున్నారు. సినిమా చూస్తే ఈ టైటిల్ ఎందుకు పెట్టమనేది అర్థమవుతుంది.

ఈ సినిమాలో పెళ్లి చేసుకోవడానికి హీరో చాలా పాట్లు పడతాడు. రియల్ లైఫ్ లో అలా ఉండదు. పెళ్లి పైన నాకు మంచి అభిప్రాయమే ఉంది. 30 ఏళ్లు వచ్చేలోగా పెళ్లి చేసుకుంటాను. ఈ సినిమా చూస్తున్న వాళ్లందరికీ వాళ్ల పెళ్లి రోజులు గుర్తుకు వస్తాయి. వాళ్ల చుట్టాలు గుర్తొచ్చి తలచుకుంటారు .. సరదాగా నవ్వుకుంటారు. అంతగా ఈ సినిమాలోని సన్నివేశాలు .. పాత్రలు కనెక్ట్ అవుతాయి. నేను చిన్నప్పటి నుంచి పల్లెటూరి పెళ్లిళ్లు చాలా చూశాను. అందువలన కూడా నేను ఈ పాత్రను బాగా చేయగలిగానేమో" అంటూ చెప్పుకొచ్చాడు .