Begin typing your search above and press return to search.

యాక్షన్ కింగ్ ప్రెస్ మీట్ తర్వాత విశ్వక్ సేన్ కెరీర్ ఏంటి ?

By:  Tupaki Desk   |   6 Nov 2022 3:02 AM GMT
యాక్షన్ కింగ్ ప్రెస్ మీట్ తర్వాత విశ్వక్ సేన్ కెరీర్ ఏంటి ?
X
సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో విశ్వక్ సేన్ మరియు ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లుగా ఓ సినిమా ప్రారభించిన సంగతి తెలిసిందే. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా లాంచ్ చేసారు. అయితే ఈ సినిమా విషయంలో అర్జున్ కు విశ్వక్ కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఈ సినిమా షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకోమని విశ్వక్ మెసేజ్ చేసిన నేపథ్యంలో.. దర్శకుడు అర్జున్ శనివారం మీడియా ముందుకు వచ్చారు.

అర్జున్ మాట్లాడుతూ.. ''నా సినిమా హీరో అని గర్వంగా చెప్పుకోవాలనుకున్న విశ్వక్ సేన్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. అతని ప్రవర్తన నన్ను మాత్రమే కాదు.. మొత్తం చిత్ర బృందాన్ని చాలా చాలా బాధ పెట్టింది. అయినా సరే మీడియాని పిలిచి అవన్నీ చెప్పాలని అనుకోలేదు. కానీ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల కారణంగా మాట్లాడాల్సి వచ్చింది. 42 ఏళ్ళ నుంచి నేను తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను. అందుకే ఒక మంచి తెలుగు సినిమా తీసి నా కూతుర్ని టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాను. నేను ఇంతవరకు రాసుకున్న కథల్లో ఇదే బెస్ట్''

''ఇందులో హీరో ఎవరైతే బాగుంటుందా అని అలోచించి విశ్వక్ కు చెప్పడం జరిగింది. రెండున్నర గంటల సేపు ప్రతీ సన్నివేశాన్ని డైలాగ్స్ తో సహా చెప్పాను. అతనికి కథ బాగా నచ్చింది. పిచ్చి పిచ్చిగా నచ్చింది సార్ అన్నారు. ఓకే చేద్దాం అనుకుని ముందుకు వెళ్ళాం. రెమ్యునరేషన్ విషయంలో విశ్వక్ మరియు అతని మేనేజర్ మాట్లాడిన టర్మ్స్ నాకు వర్కౌట్ అవ్వలేదు. అతను ఒక ఏరియా రైట్స్ తీసుకునేలా డెసిజన్ కు వచ్చాం. అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత ఎలాంటి సమస్య లేదు. కానీ నేను ఎన్నిసార్లు డిస్కషన్స్ కు పిలిచినా అతను రాలేదు. నా లైఫ్ లో ఇన్ని మిస్డ్ కాల్స్ ఇవ్వలేదు. దానికి నేను తప్పుగా కూడా అనుకోలేదు. ఇతర సినిమాలతో బిజీగా ఉండొచ్చు అని అర్థం చేసుకుంటూ వచ్చా. కాస్ట్యూమ్ డిజైన్ కోసం డిజైనర్ ని పంపినా టైం ఇవ్వలేదు''

''ఇలానే జరుగుతూ వచ్చింది. ఫైనల్ గా ఒక 30 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం. కొంతమంది కేరళ ఆర్టిస్టులు ఉన్నారు. జగపతి బాబుతో పాటు మరికొందరి డేట్స్ ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో స్టార్ట్ చేయాలి. అలాంటి సమయంలో విశ్వక్ మరియు అతని మేనేజర్ వచ్చారు. 'కొంచం అడ్జస్ట్ మెంట్ కావాలి సార్' అని అడిగారు. రెండు మూడు రోజులు అడుగుతారేమో అనుకున్నా. కానీ వాళ్ళు మొత్తం షెడ్యూల్ ని క్యాన్సిల్ చేయమని అడగడానికి వచ్చారని తర్వాత తెలిసింది. 'ఫ్రెష్ గా మంచి ఫిజిక్ తో వస్తాను.. టైం కావాలి' అని అన్నాడు. టీమ్ తో మాట్లాడి ఆల్మోస్ట్ షెడ్యూల్ మొత్తం క్యాన్సిల్ చేశా.. జగపతిబాబు డేట్స్ వేస్ట్ అవ్వకూడదని రెండు రోజులు మాత్రం షూట్ పెట్టుకున్నా అంతే''

''ఆ తర్వాత నవంబర్ 3 నుంచి డిసెంబర్ 10 వరకూ విశ్వక్ డేట్స్ ఇచ్చేస్తాం.. వేరే సినిమా ఏదీ పెట్టుకోవడం లేదు అని అతని మేనేజర్ చెప్పాడు. సరే అనుకున్నా. మూడు నాలుగు రోజులు గడిచిన తర్వాత ఒక వారం రెస్ట్ కావాలి అని అన్నారు. అందులో కూడా అడ్జస్ట్ చేసి కొన్ని డేట్స్ చెబితే ఓకే అన్నారు. స్క్రిప్ట్ లో ఏవైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే షూటింగ్ కు ముందు చూసుకుంటాం. ఒక యాక్టర్ గా అతని ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉండాలని అనుకున్నాను. నేను చాలాసార్లు కాల్ చేసి రమ్మని పిలిచినా రాలేదు''

''చివరగా అక్టోబర్ 31న వచ్చాడు. మళ్ళీ కథ గురించి మాట్లాడుకున్నాం. ముందు చెప్పిన దాని కంటే ఇంకా బాగా ఇంప్రవైజ్ చేసి చెప్పాను. 'నా మైండ్ కి ఎక్కింది.. అదరగొట్టేద్దాం' అని చెప్పి వెళ్ళిపోయాడు. షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు మళ్ళీ వస్తే గెటప్ అన్నీ చూసుకుందాం అనుకున్నాం. ఆ తర్వాత హీరో పేరు మారుద్దామా అని మాట్లాడుకున్నాం. నవంబర్ 3న షూటింగ్ అంటే.. ముందు రోజు గెటప్ చూసుకుందాం ఒకసారి రమ్మని అడిగితే.. 'మన పని మీదే ఉన్నాను సార్' అని కటింగ్ షాప్ నుంచి ఫొటోస్ మరియు వీడియోలు పంపించాడు. 'రేపటి నుంచి అదరగొట్టేద్దాం సార్' అన్నాడు. ఒక యాక్టర్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను సార్.. ఇప్పుడు రాలేను అన్నాడు. సరే అనుకున్నాను''

''తర్వాతి రోజు షూటింగ్ ఉందని 6 గంటలకే నన్ను నిద్ర లేపమని అసిస్టెంట్ కు చెప్పాను. కానీ ఏదో మెసేజ్ వచ్చిందని ఆ రోజు ఉదయం 5గంటలకే వచ్చి నిద్ర లేపాడు. మొబైల్ చూస్తే నాలుగు గంటలప్పుడు విశ్వక్ సేన్ నుంచి మెసేజ్ వచ్చింది. 'సర్.. ఐయామ్ సారీ. ప్లీజ్ క్యాన్సిల్ షూట్. కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేయాలి' అని మెసేజ్ లో ఉంది. నాకేమీ అర్థం కాలేదు. కథ, క్యారెక్టర్, డైలాగ్స్ లో ఎలాంటి మార్పూ లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడనిపించింది. నేను జీర్ణించుకోలేకపోయా. మరీ ఇంత అప్రొఫెషనలిజమా.. నిజంగా ఇది నాకే కాదు.. అందరు టెక్నీషియన్సన్స్ మొత్తం నా టీమ్ ని అవమానించడమే''

''ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి అందరూ ఇతర పనులన్నీ వదిలేసుకొని వచ్చి ఉంటారు. ఉన్నట్టుండి షూటింగ్ లేదు అని ఎలా చెప్పాలి. అందుకే నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా. ఎవరితో చెప్పాలో తెలియదు. అలానే ఉండిపోయా. ఆ తర్వాత ఆయన మేనేజర్ 'సారీ సార్.. నాకు ఏమి టైపు చేయాలో తెలియడం లేదు. మీతో మాట్లాడటానికి నాకు టైం ఇవ్వండి' అని మెస్సేజ్ పెట్టారు. ఒక ప్రొడ్యూసర్ - డైరెక్టర్ అంటే అతనికి మర్యాద లేదు. ప్రేమ లేదు. అలాంటప్పుడు అక్కడ టీమ్ వర్క్ అనేదే ఉండదు. ఇంకేం మాట్లాడతాం. ఇది జరగదు అని అప్పుడు అనుకున్నా. నేను ఇక అతనితో కలిసి పని చేయలేనని చెప్పండి అని నా మనుషులతో చెప్పేసాను''

''ఈ హీరోను పెట్టుకుని బాగా డబ్బులు సంపాదించాలని.. పెద్ద బిజినెస్ అవుతుందని నేను సినిమా చేయాలని అనుకోలేదు. నేను ఒక మంచి సినిమా చేయలనుకున్నా. నేను ఈ సినిమా పేరు చెప్పుకొని ఏ ఫైనాన్సియర్ దగ్గరా డబ్బులు అడగలేదు. నాకు చాలా బాధేసింది. ఇన్నేళ్ళలో నాకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇండస్ట్రీలో నేను ఎంతో ప్రొఫెషనలిజం చూపించే నటీనటులను చూశా''

''ఉదాహరణకు జగపతిబాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ ప్రొడక్షన్ జగపతి బాబుదే అనుకునేంత క్లోజ్. ఆయన్ని డేట్స్ అడిగాను. ఆయన షెడ్యూల్ నాకు చూపించి.. తర్వాత రెండు నెలల పాటు ఎలాంటి సినిమాలు లేవని చెప్పారు. 'నా కోసం మధ్యలో రెండు రోజులు సర్దుబాటు చెయ్' అని అడిగితే.. 'అస్సలు కుదరదు. నేను వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చాను. వాళ్ళని అడిగి కుదిరితే చెప్తాను' అని అన్నారు. అదీ ఒక నటుడికి ఉండాల్సిన కమిట్ మెంట్''

''బాలకృష్ణ గారిని ఈ సినిమా ఓపెనింగ్ కు పిలిచాను. 'బాస్.. నా డాటర్ ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను' అని పెట్టాను. మెసేజ్ చూసుకొని వెంటనే ఫోన్ చేసారు. అదే రోజు అనుకుని 'కరెక్ట్ అడ్రస్ పెట్టు వస్తా' అని అన్నారు. ఇప్పుడు కాదు బాస్.. ఇంకా 15 రోజులు తర్వాత అని చెప్పడంతో.. 'సారీ బాస్.. నేను చేస్తున్న సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ని అడిగి చెబుతా' అన్నారు. అది కమిట్ మెంట్. సినిమా పూజ రోజున కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి, రాలేకపోయినందుకు సారీ చెప్పారు. వెంకటేష్ కు కూడా షూటింగ్ ఉండటంతో.. సల్మాన్ ఖాన్ మరియు ప్రొడ్యూసర్స్ కు ఇబ్బంది అవుతుంది.. రాలేను. తర్వాత ఎప్పుడైనా వచ్చి కలుస్తాను అన్నారు. చిరంజీవి కూడా తన ప్రొడ్యూసర్ ని అడిగి వస్తామని చెప్పారు. అది కమిట్మెంట్''

''నేను అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టర్స్ తో కలిసి పనిచేశా. వాళ్ళకి లైఫ్ లో ఏం తక్కువ. అయినా సరే వాళ్ళకి ఎలాంటి డెడికేషన్ ఉంది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లకు ఎలాంటి డెడికేషన్ ఉంది. నేను కూడా అలానే అనుకున్నాను. ఫ్రెష్ గా వస్తాను టైం ఇవ్వండి అంటే సరే అనుకున్నాను. వచ్చి క్యాన్సిల్ చేయమని అడిగాడు. ఒక ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్ ని షూటింగ్ క్యాన్సిల్ చేయమని ఎలా అడుగుతారు? ఒక రోజు షూట్ అంటే నటీనటుల దగ్గర నుంచి లైట్ బాయ్ వరకూ ఎంత మంది కష్టం ఉంటుంది. ఎంత డబ్బు ఖర్చవుతుంది. మనం చేసే పనికి మనం సిన్సియర్ గా ఉండాలి. టీమ్ వర్క్ ఉండాలి. ఇదే నా హీరో నుంచి ఎక్స్ పెక్ట్ చేశా''

''షూటింగ్ చేయాల్సిన సమయంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఆయన గురించి ఏదో చెప్పడానికి కాదు. 42 ఏళ్ళ నా కెరీర్ లో ఒకరి మీద ఇలా వచ్చి ఆరోపణలు చేయడం జరగలేదు. ఇప్పుడు కూడా ఇది కంప్లెయింట్ కాదు. నా బాధ చెప్పుకోడానికి వచ్చా. 'నా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు' అనే దానికి వివరణ ఇవ్వడానికి వచ్చా. నా ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లడం అంటే.. 42 ఏళ్ళ నా పరపతికి దెబ్బ తగిలినట్లే. నా సినిమా నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదని నేను అనుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లో అతనితో నేను సినిమా చేయాలని అనుకోవడం లేదు అని మీ అందరికీ తెలియాలి అని ప్రెస్ మీట్ పెట్టా''

''కొన్ని రోజులు పోయిన తర్వాత అతనితో కాంప్రమైజ్ అయి ఈ సినిమా చేయను. 100 కోట్లు వచ్చినా చెయ్యను. ఇలాంటివి అందరికీ తెలియాలి. ఇలా మరొకరికి జరగకూడదు. బయటకు వచ్చి మాట్లాడకుండా ఉండే ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంది ఉంటారు. నాకు దైర్యం ఉంది. అందుకే నేను ఇక్కడికి వచ్చి చెబుతున్నాను. ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ కి మర్యాద ఇవ్వడం అనేది బేసిక్స్. మీకు కథ నచ్చకపోతే, ఈ సినిమా చేయాల్సిందే అని ఎవరూ బలవంతం చేయరు. ఆఖరికి ప్రొడక్షన్ బాయ్ ను కూడా తీసుకురాలేరు. ఇండస్ట్రీలో కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి తెలియకపోతే సినిమాలు అంగీకరించకండి. మీ ఇంట్లో మీరు ఉండండి.. మా ఇంట్లో మేం ఉంటాం. బయట సినిమా ఒప్పుకున్నప్పుడు తప్పకుండా నమ్మకం ఉండాలి'' అని అన్నారు.

''సాయి మాధవ్ బుర్రా ఇప్పుడు టాప్ డైలాగ్ రైటర్. ఆయన డైలాగ్స్ మనోడికి నచ్చడం లేదు. 'పుష్ప' లాంటి పెద్ద పెద్ద సినిమాకు పాటలు రాసిన చంద్రబోస్ పాటల స్టైల్ అతనికి నచ్చడం లేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ని ఇష్టపడటం లేదు. హీరోగా అతడు కొన్ని సూచనలు చేయొచ్చు తప్పులేదు. కానీ, ఒక మేకర్ గా నాకు కూడా నచ్చాలి కదా! అప్పుడు కూడా నేను చాలా సాఫ్ట్ గా చెప్పే ప్రయత్నం చేశా. జస్ట్ నన్ను నమ్ము.. నేను ఒక మంచి సినిమా తీస్తా అని చెప్పా''

''ఈ ప్రాజెక్ట్ లో ముందుగా అనూప్ రూబెన్స్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నాం. నా కూతురి ఫస్ట్ సినిమా కదా అని 'కేజీఎఫ్' లాంటి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయితే హైప్ వస్తుందని అనుకున్నా. కానీ మ్యూజిక్ సిట్టింగ్స్ లో అతని స్టైల్ కి నా కథకు మ్యాచ్ అవ్వడం లేదు. అందుకే మళ్ళీ అనూప్ ని పిలిచా. ఇద్దరికీ డబ్బులు ఇచ్చాను. స్టోరీ కమాండ్ చేసినట్లే ఫెంటాస్టిక్ మ్యూజిక్ వచ్చింది. అంటే దీని అర్థం రవి సంగీతాన్ని తక్కువ చేయడం కాదు. కేవలం అతని స్టైల్ నా స్టోరీకి సెట్ అవ్వలేదు అంతే. నేను విశ్వక్ కు అనూప్ పేరు చెప్పే ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాను. కాబట్టి సంగీత దర్శకుడి విషయంలో అప్సెట్ అవ్వాల్సిందేమీ లేదు. నా సినిమాకు ఎవరు బెస్ట్ అని ఇండస్ట్రీలో పెద్ద పెద్దవాళ్ళ సలహా తీసుకొని మరీ పెట్టుకున్నాను''

''ఈ వివాదంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ మెంబర్స్ తో మాట్లాడుతున్నాను. నా నుంచి పెద్ద డిమాండ్ ఏమీ లేదు. ఇలా మరొకరికి జరగకుండా చూడమని మాత్రమే చెబుతా. అంతేకానీ, దీన్ని పెద్ద గొడవ చేయాలని నాకు లేదు. నేను ఇక్కడ సినిమాలు మాత్రమే చేయడానికి వచ్చా.. వివాదాలు సృష్టించడానికి కాదు. ఎవరి వలనా ఏదీ ఆగదు. త్వరలోనే ఈ సినిమా మరొక హీరోతో స్టార్ట్ చేస్తా.. టైటిల్ కూడా అనౌన్స్ చేస్తా. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. ఆ లిస్టులో ఈ సినిమా కూడా ఎక్కడో ఒక చోట ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాను'' అని అర్జున్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ అమ్మా నాన్నలు అంటే తనకు చాలా ఇష్టమని.. వాళ్ళ ఫాదర్ ఒక జెంటిల్ మెన్ అని.. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని ఆయన అన్నారు.