Begin typing your search above and press return to search.

స్వీయ దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీ చేస్తానంటున్న యువ హీరో..!

By:  Tupaki Desk   |   11 Aug 2021 1:30 AM GMT
స్వీయ దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీ చేస్తానంటున్న యువ హీరో..!
X
'వెళ్లిపోమాకే' సినిమాతో హీరోగా పరిచయమైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో స్వీయ దర్శకత్వంలో 'ఫలక్ నుమా దాస్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇది 'అంగమలై డైరీస్' అనే మలయాళ చిత్రానికి రీమేక్. అయితే ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు యువ హీరో ప్రకటించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వక్ సేన్ వచ్చే ఏడాది తన సొంత సినిమా ఉంటుందని తెలిపారు. పక్కా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో హైదరాబాదీ కుర్రాడి కథతో ఉంటుందని.. మోస్ట్లీ 'ఫలక్ నుమా దాస్' లోని దాస్ క్యారక్టర్ లా ఉంటుంది అని చెప్పాడు. ఇది బైలింగ్వల్ సినిమా అని.. తెలుగు హిందీ భాషల్లో ఉంటుందని.. కథ రాస్తున్నానని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎవరూ ఛాన్స్ ఇవ్వకపోవడం వల్లే కోపంతో సొంతంగా సినిమా తీసినట్లు విశ్వక్ చెప్పాడు.

అయితే 'ఫలక్ నుమా దాస్' మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఇటీవల విశ్వక్ సేన్ ట్వీట్ చేస్తూ.. ''ఫలక్ నుమా దాస్ 2" కోసం చిత్ర బృందం త్వరలోనే మళ్లీ కలవబోతోందని పేర్కొన్నాడు. మరి ఇప్పుడు విశ్వక్ చెప్పిన బైలింగ్వల్ 'ఫలక్ నుమా దాస్' సీక్వెలా లేదా మరో కొత్త మూవీనా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా డైరెక్టర్ గా ఫస్ట్ సినిమాకు రీమేక్ స్టోరీని నమ్ముకున్న యంగ్ హీరో.. ఈసారి మాత్రం తన సొంత కథ తోనే రాబోతున్నాడని అర్థం అవుతోంది.

ఇకపోతే గతేడాది 'హిట్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. న‌రేష్ కొప్పలి దర్శకత్వంలో చేసిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ''పాగల్'' ఆగస్ట్ 14న థియేట్రికల్ రిలీజ్ కానుంది. దిల్‌ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ - లక్కీ మీడియా బ్యానర్స్‌ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా పేతురాజ్ - సిమ్రాన్ చౌదరి - మేఘ లేఖ హీరోయిన్లుగా నటించారు. మంగళవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. 'పాగల్' తో బ్లాక్ బస్టర్ హిట్ కొడతామని మాస్ కా దాస్ ధీమాగా ఉన్నారు.