Begin typing your search above and press return to search.

పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదంటున్న విష్వక్సేన్!

By:  Tupaki Desk   |   6 Feb 2022 2:30 PM GMT
పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదంటున్న విష్వక్సేన్!
X
తెలుగు తెరపైకి విష్వక్సేన్ రావడమే దూకుడు గా వచ్చాడు. తెలంగాణ యాస .. ముందుగా కొట్టి ఆ తరువాత మాట్లాడే కుర్రాడిగా తెరపై కనిపించాడు. కొత్త హీరోలా ఎక్కువ సమయం తీసుకోకుండా మొత్తానికి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. అయితే నెమ్మదిగా ఆ ఇమేజ్ నుంచి బయటపడటానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా చేశాడు. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువకావడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేశాడు. మార్చి 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఆ తరువాత సినిమాగా ఆయన 'ఓరి దేవుడా' సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో పీవీపీ సినిమాస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విష్వక్ జోడీగా 'మిథిల' తెలుగు తెరకి పరిచయమవుతోంది. లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్లు .. ఇతర బృందంపై ఈ పాటను చిత్రీకరించారు. 'పాఠశాలలో ఫెండ్షిప్ పాతబడదుగా .. పలకరిస్తే పలుకుతుంది పాప నవ్వులా' అంటూ ఈ సాంగ్ సాగుతోంది. అర్మాన్ మాలిక్ ఈ పాటను ఆలపించాడు.

పూర్తి పాటను ఈ నెల 7వ తేదీ సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. పోస్టర్లు .. టైటిల్ .. సాంగ్ ప్రోమోను బట్టి చూస్తుంటే, లవ్ ను .. కామెడీని ప్రధానంగా చేసుకుని ఈ సినిమా నడవనున్నట్టుగా అర్థమవుతోంది. యూత్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే అందుకు తగిన కంటెంట్ తో వస్తోంది. మొదటి నుంచి కూడా ఈ సినిమా నుంచి పెద్దగా అప్ డేట్స్ రాలేదు. ఇక ఈ సాంగ్ నుంచి జోరు పెంచుతారేమో చూడాలి. ఇతర తారాగణం ఎవరనేది కూడా తెలియాలి. అప్పుడే ఈ ప్రాజెక్టు గురించి ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది.

'హిట్' సినిమా తరువాత విష్వక్ సక్సెస్ అనే మాటే వినలేదు. 'పాగల్' సినిమా సమయంలో చాలా హడావిడి చేశాడుగానీ అది వర్కౌట్ కాలేదు. నిజానికి 'పాగల్' చాలా క్యాచీ టైటిల్ .. అయితే కథా నేపథ్యాన్ని ఎంచుకునే విషయంలోనే పొరపాటు జరిగిపోయింది. కథలో ప్రధానంగా కనిపించే రెండు అంశాల మధ్య పొంతనలేకపోవడంతో దెబ్బతినేసింది. దాంతో సాధ్యమైనంత త్వరగా హిట్ కొట్టాలనే పట్టుదలతో విష్వక్ ఉన్నాడు. మరి ఈ ఏడాదిలో రానున్న ఈ రెండు సినిమాలతో ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.