Begin typing your search above and press return to search.

భాయిజాన్ కు రీల్ మోడీ ప్రశ్న ఇదే!

By:  Tupaki Desk   |   17 April 2019 5:56 AM GMT
భాయిజాన్ కు రీల్ మోడీ ప్రశ్న ఇదే!
X
బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో వివేక్ కు ఒక ప్రశ్న ఎదురైంది. "సల్మాన్ కు నిజం చెప్పే మందు కనుక ఇస్తే.. మీరు సల్మాన్ ను ఏ ప్రశ్న అడుగుతారు?" ఇదోరకంగా మాయాబాజార్ సినిమాలో సత్యపీఠంపై నిలబెట్టి ప్రశ్నను అడగడం లాంటిదన్నమాట. అలా చేస్తే నోటినించి నిజమే వస్తుంది. దీనికి సమాధానమిస్తూ "సల్మాన్.. మీకు క్షమాపణ అనేదానిపై నిజంగా నమ్మకం ఉందా?" అని అడుగుతానని అన్నాడు.

సల్మాన్ కు ఎందుకు క్షమించాలి.. ఎవరిని క్షమించాలి అని తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మొదటి ప్రశ్నకు సమాధానం '16 ఏళ్ళయింది కాబట్టి'. క్షమించాల్సింది ఎందుకు అంటే ఆల్రెడీ కొన్నేళ్ళ క్రితం వివేక్ సల్మాన్ ను క్షమించాలని కోరాడు. కానీ సల్మాన్ క్షమించలేదు. ఇదంతా చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదంటే ఐశ్వర్య రాయ్ ఫ్లాష్ బ్యాక్ తెలీదన్నమాట. టూకీగా చెప్పుకుంటే మొదట సల్మాన్ - ఐశ్వర్య ప్రేమాయణం జరిగింది. సల్మాన్ తో బ్రేకప్ తర్వాత ఐశ్వర్య వివేక్ ప్రేమలో పడింది. అప్పుడు సల్మాన్ కు చిర్రెత్తుకొచ్చి వివేక్ ను ఇబ్బంది పెట్టాడు. దీంతో వివేక్ 2003 లో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. సల్మాన్ తనను బెదిరిస్తున్నాడని.. ముందురోజు రాత్రి నలభై కాల్స్ చేశాడని ఆరోపణలు గుప్పించాడు. దాంతో సల్లూ భాయ్ ఇక వివేక్ జోలికి రాలేదు. కానీ ఇంటర్నల్ గా వివేక్ కు ఆఫర్లు రాకుండా చేశాడని.. వివేక్ కెరీర్ ఇలా దెబ్బతినడానికి కారణం సల్మాన్ అనే టాక్ కూడా ఉంది.

ఇదంతా జరిగి ఎన్నో ఏళ్ళు అవుతున్నా సల్మాన్ మాత్రం తన మనసులోనే పెట్టుకున్నట్టున్నాడు. అందుకే వివేక్ ను దగ్గరకు రానివ్వడం లేదు. అందుకే వివేక్ "మీకు క్షమాపణ అనేదానిపై నిజంగా నమ్మకం ఉందా?" అనే ప్రశ్న వేస్తానని అన్నాడు. మరి వివేక్ ను సత్యపీఠం ఎక్కించి భాయిజాన్ ను ప్రశ్న అడగమంటే ఏం అడుగుతాడో ఏంటో!