Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఆకట్టుకునేలా భారతదేశపు అతి పెద్ద మోషన్‌ క్యాప్చర్‌ మూవీ 'ధీర'..!

By:  Tupaki Desk   |   18 Nov 2020 2:10 PM GMT
ట్రైలర్ టాక్: ఆకట్టుకునేలా భారతదేశపు అతి పెద్ద మోషన్‌ క్యాప్చర్‌ మూవీ ధీర..!
X
భారతదేశపు అతి పెద్ద మోషన్‌ క్యాప్చర్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ గా తెరకెక్కిన చిత్రం "ధీర". దీనికి 'బుద్ధి రిద్ధి సిద్ధి' అనేది ఉపశీర్షిక. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో 'వికటకవి'గా ప్రసిద్ధి చెందిన తెనాలి రామకృష్ణ ఆధారంగా ఈ యానిమేషన్ మూవీ రూపొందించారు. ఈ చిత్రానికి అరుణ్ కుమార్ రాపోలు దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా లెవల్లో 12 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన 'ధీర' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో "ధీర" హిందీ ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'ధీర' ట్రైలర్ లో "14వ శతాబ్ధం అఖండ భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఓ స్వతంత్ర సామ్రాజ్యానికి ప్రాణ ప్రతీష్ట జరిగింది. ఆ మహోన్నత సామ్రాజ్యమే విజయనగరం" అంటూ వాయిస్ ఓవర్ తో మొదలైంది. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలోకి ఒక వికటకవి కావాలని కోరుకోవడం.. కవి గా గుర్తింపు తెచ్చుకోవడానికి తెనాలి రామకృష్ణ పడిన అవమానాలను చూపించారు. 'అవకాశాలు మనల్ని ఎతుక్కుంటూ రావు రామా.. మనమే వాటిని సృష్టించుకోవాలి' అని రామకృష్ణ కు తన తల్లి హితబోధ చేస్తుంది. రామకృష్ణుడు శ్రీకృష్ణ దేవాదాయ ఆస్థానంలో ఎలా వెళ్ళాడు.. అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితులు ఎంటనేది చూపించారు. శత్రువుల పన్నాగలను తన యుక్తి కుయుక్తులతో ఎలా మట్టుబెట్టాడన్నది ఆసక్తికరంగా ఉండబోతోందని తెలుస్తోంది. మొత్తం మీద "ధీర" యానిమేషన్ ట్రైలర్ ఆధ్యంతం అలరిస్తోంది.

కాగా, 'ధీర' హిందీ వర్షన్ లో తెనాలి రామకృష్ణుడు పాత్రకి బాలీవుడ్ స్టార్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ వాయిస్ అందించాడు. తెలుగు వర్షన్ కి టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తమిళ్ లో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి.. బెంగాలీ భాషలో జీత్ వాయిస్ ఇస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ మురళి సంగీతం సమకూరుస్తున్నారు. ఏ థీరమ్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ 'ధీర' యానిమేషన్ చిత్రాన్ని నిర్మించింది. ఈ మోషన్‌ క్యాప్చర్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.