Begin typing your search above and press return to search.

సంక్రాంతి థియేట‌ర్ల సెగ‌ అక్క‌డ మొద‌లైంది!

By:  Tupaki Desk   |   7 Dec 2022 3:38 PM GMT
సంక్రాంతి థియేట‌ర్ల సెగ‌ అక్క‌డ మొద‌లైంది!
X
సంక్రాంతి, ద‌స‌రా సీజ‌న్‌ల‌లో తెలుగు సినిమాల‌కే ప్ర‌ధాన్య‌త నివ్వాల‌ని తీర్మానిస్తూ గ‌తంలో ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. 2017లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న కార‌ణంగా తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండలి ఈ నిర్ణ‌యాన్ని అప్ప‌ట్లో ప్ర‌క‌టించింది. దీనికి యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అధ్య‌క్షుడు, స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు కూడా ఆమోదం తెలిపారు. అయితే 2023 సంక్రాంతికి గానూ సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలు 'వాల్తేరు వీర‌య్య‌, వీర సింహారెడ్డి రిలీజ్ కాబోతున్నాయి.

ఇదే స‌మ‌యంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న 'వార‌సుడు' డబ్బింగ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని 2023 జ‌న‌ప‌వ‌రి 12న త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో భారీ స్థాయిలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ కోసం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన ఏరియాల్లో థియేట‌ర్ల‌ని భారీ స్థాయిలో దిల్ రాజు బ్లాక్ చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ వార్త‌ల నేప‌థ్యంలో తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి ఓ ప్ర‌క‌ట‌న చేసింది. సంక్రాంతి, ద‌స‌రా పండ‌గ సీజ‌న్ ల‌లో తెలుగు సినిమాల‌కే ప్ర‌ధాన్య‌త ఇవ్వాల‌ని ప్ర‌త్యేకంగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీనిపై భిన్నాభిప్ర‌యాలు వ్య‌క్తం కావ‌డం తెలిసిందే. అల్లు అర‌వింద్ ఒక‌లా.. సి. అశ్వ‌నీద‌త్ మ‌రోలా స్పందించారు. ఆ త‌రువాత త‌మిళ ప్రొడ్యూస‌ర్స్ తెలుగు నిర్మాత‌ల మండ‌లి నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టారు. డ‌బ్బింగ్ సినిమాల‌కు థియేట‌ర్లు కేటాయించ‌నివ్వ‌రా? అంటూ మండిప‌డ్డారు.

ఇక ఇదే విష‌యంపై త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్ . లింగుస్వామి ఏకంగా తెలుగు నిర్మాత‌ల‌పై బెదిరింపుల‌కు దిగాడు. నిర్మాత‌ల మండ‌లి నిర్ణాయ‌న్ని వెన‌క్కి తీసుకోవాల‌ని, లేదంటే 'వారీసు'కు ముందు సినిమా.. 'వారీసు' త‌రువాత సినిమాలా ప‌రిస్థితులు మార‌తాయంటూ హెచ్చ‌రించాడు.

అయితే ఈ హెచ్చ‌రిక‌ల‌పై ఇండైరెక్ట్ గా ప్ర‌స‌న్న‌కుమార్ పంచ్ లు వేయ‌డం తెలిసిందే. ఇదిలా వుంటే సంక్రాంతి టైమ్ లో తెలుగు సినిమాల‌తో పాటు డ‌బ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ అసోసియేష‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకోవ‌డం విశేషం.

గ‌తంలో తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి ప్ర‌వేశ పెట్టిన తీర్మానానికి వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్స్, ఎగ్జిబిట‌ర్స్ అంతా క‌ట్టుబ‌డి వుండాల‌ని, సంక్రాంతికి తెలుగు సినిమాల‌కే తొలి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిర్ణయించుకోవ‌డంతో సంక్రాంతి థియేట‌ర్ల సెగ మొద‌లైంది. మ‌రి దీనిపై దిల్ రాజు ఎలా స్పందిస్తారో.. ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారో వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.