Begin typing your search above and press return to search.

ఓట‌ర్ల‌ని బుట్ట‌లో వేసేందుకు `మా` ఎన్నిక‌ల్లో ఓటుకి నోటు!?

By:  Tupaki Desk   |   28 Sep 2021 3:30 AM GMT
ఓట‌ర్ల‌ని బుట్ట‌లో వేసేందుకు `మా` ఎన్నిక‌ల్లో ఓటుకి నోటు!?
X
`మా` అసోసియేష‌న్ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌) ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లైంది. సోమ‌వారం నుంచి నామినేష‌న్ ల ప్ర‌క్రియ మొద‌లైంది. ముందుగా `మా` ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్న ప్ర‌కాష్ రాజ్ త‌న ప్యానెల్ స‌భ్యుల‌తో స‌హా సోమవారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. నామినేష‌న్ ల స్వీక‌ర‌ణ ఈ నెల 29 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో `మా` ఎన్నిక‌లు రాజ‌కీయంగానూ చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ప‌వ‌న్ ఏపీ ప్ర‌భుత్వంపై అక్క‌డి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అయితే ఈ విష‌యంలో సినీ ఇండస్ట్రీ నుంచి ఆయ‌న‌కు మద్ధ‌తు మాత్రం లభించ‌డం లేదు. ప‌వ‌న్ స‌పోర్ట్ గా నిలిచిన ప్ర‌కాష్ రాజ్ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ని స‌మ‌ర్ధించ‌కుండా.. న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడి కొంత సేఫ్ గేమ్ ఆడిన‌ట్టుగా స్ప‌ష్ట‌మైంది. ఇక గ‌త `మా` ఎన్నిక‌ల‌తో పోలిస్తే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల కార‌ణంగా ఈ ద‌ఫా ఎన్నిక‌లు ఇండ‌స్ట్రీలో తీవ్ర దుమారాన్ని సృష్టించేవిగా వున్నాయి.

దీంతో ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డానికి ఎవ‌రూ సుముఖ‌త‌ని వ్య‌క్తం చేయ‌డం లేదు. ఈ వాడీ వేడీ వాతావ‌ర‌ణంలో `మా` ఎన్నిక‌ల ప్రాచారానికి అభ్య‌ర్థులు మ‌రింత స్పీడు సెంచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఓట‌ర్ల‌కు విందులు ఏర్పాటు చేసిన అభ్య‌ర్థులు ఇప్పుడు ఏకంగా త‌మ ఓట‌ర్లు చేయి జారి పోకుండా ఓటుకు నోటుతో కొన‌డానికి సిద్ధ‌మైన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

గెలుపు కోసం ప్ర‌తీ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని అభ్య‌ర్థులు భావిస్తూ ఆ వెపుగా ఏ చిన్న అవ‌కాశం వున్నా దాని కోసం ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేద‌ని వినిపిస్తోంది. హైద‌రాబాద్ లో వుండే ఆర్టిస్ట్ ల‌ని క‌లుసుకుని వారికి అన్ని విధాలా అండ‌గా వుంటామ‌ని.. త‌మ‌కే ఓటు వేయాల‌ని అభ్య‌ర్థులు అభ్య‌ర్థిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.


`మా` ఎన్నిక‌ల‌పై ప‌వ‌న్ వ్యాఖ్య‌ల ప్ర‌భావం:


ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారాన్ని రేపిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాఖ్య‌ల తుఫాను `మా`తో పాటు ఇండ‌స్ట్రీని కూడా ఓ కుదుపు కుదిపేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ట‌స్థంగా వున్న వారంతా ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త‌.. రాజ‌కీయ‌ వ్యాఖ్య‌ల‌తో ఇండ‌స్ట్రీకి ఎలాంటి సంబంధం లేద‌ని బాహాటంగానే చెబుతూ ప్ర‌త్యేక వీడియోల‌ని విడుద‌ల చేస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన కొన్ని విష‌యాల్లో స్పందించ‌డం లేదు. ప‌వ‌న్ తాజా వ్యాఖ్య‌ల‌తో పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టుగా మారింద‌ని చాలా మంది ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌వ‌న్ రాజ‌కీయ వ్యాఖ్య‌ల కార‌ణంగా ఏపీ ప్ర‌భుత్వం ఇండ‌స్ట్రీపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించే ప్ర‌మాదం కూడా లేక‌పోలేద‌ని ప‌లువురు అనుమానాం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక్క‌డో విష‌యం చెప్పాలి. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కు `మా` ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్న మంచు విష్ణు కుటుంబానికి బంధుత్వం వున్న విష‌యం తెలిసిందే. ఆ కార‌ణంగా ఆయ‌న కోసం `మా` ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌భావం ఖ‌చ్చితంగా వుంటుంద‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల వ‌ల్ల ఖ‌చ్చితంగా ఇందులో ఇన్ వాల్వ్ కావాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు భావిస్తార‌ని కూడా ఓ వ‌ర్గం త‌మ అనుమానాన్ని వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఆ అనుమానం వ‌ల్లే సోమ‌వారం మీడీయాతో మాట్లాడుతూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డానికి పెద్ద‌గా సాహ‌సించ‌లేద‌ని.. చాలా తెలివిగా మాట్లాడి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మ‌ద్ద‌తుగా నిలిచిన వ్యక్తి చేసిన వ్యాఖ్య‌లపై స్పందించ‌డానికి ప్ర‌కాష్ రాజ్ ఆచితూయి వ్య‌వ‌హ‌రించారంటే దీన్ని బ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చ‌ని కూడా కొంత మంది త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఏం జ‌ర‌గ‌నుంది? `మా` ఎన్నిక‌ల‌పై ప‌వ‌న్ ప్ర‌భావం ఏ స్థాయిలో వుండ‌బోతోంది? .. ఎన్నిక‌ల అనంత‌రం ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై మోహ‌న్ బాబు ఏ స్థాయిలో స్పందించ‌బోతున్నార‌న్న‌ది స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.