Begin typing your search above and press return to search.

వంద కోట్ల డైరెక్ట‌ర్.. ఇంకా ఎదురు చూపులే

By:  Tupaki Desk   |   12 April 2017 7:19 AM GMT
వంద కోట్ల డైరెక్ట‌ర్.. ఇంకా ఎదురు చూపులే
X
టాలీవుడ్లో ప్ర‌స్తుతం ఏ స్టార్ డైరెక్ట‌ర్ కూడా ఖాళీగా ఉండే ప‌రిస్థితి లేదు. ఒక సినిమా చేస్తుండ‌గానే ఇంకో సినిమాకు క‌మిట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఏం సినిమా చేద్దామా.. ఎవ‌రితో చేద్దామా అని స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నారు త‌ప్ప స్టార్ డైరెక్ట‌ర్ల‌కు మాత్రం ఆ ప‌రిస్థితి ఉండ‌ట్లేదు. కానీ ఇందుకు వి.వి.వినాయ‌క్ ఒక్క‌డు మిన‌హాయింపు. ‘ఖైదీ నంబ‌ర్ 150’తో రాజ‌మౌళి త‌ర్వాత వంద కోట్ల డైరెక్ట‌ర్ గా గుర్తింపు సంపాదించాడు వినాయ‌క్. కానీ అత‌డి త‌ర్వాతి సినిమా ఏంట‌న్న‌ది మాత్రం తేల‌డం లేదు. ‘ఖైదీ నంబ‌ర్ 150’ విడుద‌లై అప్పుడే మూడు నెల‌లైపోయింది. ఈ మూడు నెల‌ల్లో వినాయ‌క్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల‌పై ర‌క‌ర‌కాల వార్త‌లొచ్చాయి. కానీ వాటిలో ఏదీ నిజం కాలేదు. వినాయ‌క్ త‌ర్వాతి ప్రాజెక్టు ఫైన‌లైజ్ అవ్వ‌లేదు.

మ‌హేష్ బాబు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌తో వినాయ‌క్ ప‌ని చేసేందుకు ఆస్కార‌మే క‌నిపించ‌ట్లేదు. వినాయ‌క్ కు స‌న్నిహితుడైన జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా త‌న ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్ కు ఇప్పుడు డేట్లిచ్చే ప‌రిస్థితి లేదు. ‘జై ల‌వ‌కుశ’ త‌ర్వాత అత‌ను త్రివిక్ర‌మ్ సినిమాను లైన్లో పెట్టాడు. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్‌.. అల్లు అర్జున్ లాంటి స్టార్లు కూడా ఫుల్ బిజీ. ప్ర‌భాస్.. ర‌వితేజ కూడా అందుబాటులో లేరు. మొత్తానికి ఏ స్టార్ కూడా వినాయ‌క్ తో స‌మీప భ‌విష్య‌త్తులో ప‌ని చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. మ‌ధ్య‌లో మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ పేరు వినిపించింది కానీ.. అత‌ను ‘జ‌వాన్’ మీదికి వెళ్లిపోయాడు. మ‌రి ఇప్పుడు వినాయ‌క్ ఎవ‌రితో సినిమా చేస్తాడ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కం. హీరో ఖ‌రారైతే అత‌డి ఇమేజ్ కు త‌గ్గ‌ట్లు క‌థ రెడీ చేయిద్దామంటే అది కుద‌రట్లేదు. దీని కంటే ఏ హీరోకైనా స‌రిపోయే క‌థ రెడీ చేసుకుని.. అప్ప‌టికి అందుబాటులో ఉన్న హీరోతో స‌ర్దుకుపోవ‌డం మేలేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/