Begin typing your search above and press return to search.

కాపీ ఎప్పట్నుంచో ఉందంటున్న వినాయక్

By:  Tupaki Desk   |   8 Feb 2018 11:22 AM GMT
కాపీ ఎప్పట్నుంచో ఉందంటున్న వినాయక్
X
హాలీవుడ్ కథల్ని ఎత్తుకొచ్చేసి చడీచప్పుడు లేకుండా సినిమాలు తీసేస్తుంటారు ఇండియన్ డైరెక్టర్స్. ఇందుకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మినహాయింపు కాదని రుజువైంది. ఇంతకుముందు ఒకట్రెండు సీన్లు లేపేసేవాడు కానీ.. ఈసారి ఏకంగా ఒక సినిమా కథను అలాగే దించేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఫ్రెంచ్ సినిమా ‘లార్జో వించ్’ను కాపీ కొట్టి ‘అజ్ఞాతవాసి’ తీశాడన్న ఆరోపణలతో త్రివిక్రమ్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఈ వివాదం ఇంకా కూడా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ‘ఇంటిలిజెంట్’తో ప్రేక్షకుల ముందుకొస్తున్న మరో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ను విలేకరులు ఈ విషయమై అడిగారు.

హాలీవుడ్ కథల్ని కాపీ కొట్టి మన డైరెక్టర్లు సినిమాలు తీయడం గురించి వినాయక్ దగ్గర ప్రస్తావిస్తే.. సింపుల్ గా ఇదేమీ కొత్త కాదు కదా అన్నాడు. హాలీవుడ్ కథల నుంచి స్ఫూర్తి పొంది మన దర్శకులు గతంలోనే ఎన్నో సినిమాలు తీశారని.. ఐతే మీడియా అప్పుడు అంత యాక్టివ్ గా లేదు కాబట్టి ఆ విషయం హైలైట్ కాలేదని వినాయక్ అన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియా హడావుడి పెరిగింది కాబట్టి అన్ని విషయాలూ బయటికి వస్తున్నాయని వినాయక్ అన్నాడు. ఐతే ఏదైనా కథ నుంచి స్ఫూర్తి పొందితే ఓకే కానీ.. అలాగే దించేయకూడదని వినాయక్ అభిప్రాయపడ్డాడు. తెలుగులో ప్రస్తుతం కొత్తదనం ఉన్న విభిన్నమైన కథలు చాలా వస్తున్నాయని.. అది మంచి పరిణామం అని వినాయక్ అన్నాడు. తాను కూడా కొత్త వాళ్లతో ఒక విభిన్నమైన సినిమా తీయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని.. ఇంకో రెండేళ్లలో అలాంటి ఒక సినిమా తీస్తానని వినాయక్ చెప్పాడు.