Begin typing your search above and press return to search.

మరీ ‘ఛత్రపతి’తో పోల్చేశారేంటి సార్..

By:  Tupaki Desk   |   1 Aug 2017 9:01 AM GMT
మరీ ‘ఛత్రపతి’తో పోల్చేశారేంటి సార్..
X
బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి పెద్దగా బ్యాగ్రౌండ్ లేకపోయినా.. అతడి అరంగేట్ర సినిమాను తనే డైరెక్ట్ చేశాడు స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్. శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ తనను ‘ఆది’ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశాడన్న కృతజ్నతే ఇందుకు కారణం. ఇప్పుడు శ్రీనివాస్ మూడో సినిమా ‘జయ జానకి నాయక’ ఆడియో వేడుకకు కూడా వినాయక్ ముఖ్య అతిథిగా వచ్చి అతణ్ని ఆశీర్వదించాడు.

ఐతే ఈ సందర్భంగా తాను పరిచయం చేసిన హీరో గురించి.. అతడి సినిమా గురించి గొప్పగా మాట్లాడేశాడు వినాయక్. ‘జయ జానకి నాయక’ ట్రైలర్ చూస్తుంటే తనకు ‘ఛత్రపతి’ ఇంటర్వెల్ బ్యాంగ్ గుర్తుకొచ్చిందని వినాయక్ తెలిపాడు. ఐతే ఈ ట్రైలర్ కు.. ఛత్రపతి ఇంటర్వెల్ కు సంబంధమేంటన్నదే జనాలకు అర్థం కాలేదు. మరోవైపు ‘జయ జానకి నాయక’ ట్రైలర్లో అంతా ఓకే అనిపించినా.. శ్రీనివాస్ డైలాగులు పలికిన విధానమే కొంచెం తేడాగా ఉందని అందరూ అనుకుంటుంటే.. వినాయక్ మాత్రం ‘‘నువ్వేడిస్తే వీణ్ని చంపేస్తా’’ అనే డైలాగ్ ను శ్రీనివాస్ చాలా చాలా బాగా పలికాడంటూ కితాబిచ్చాడు. ‘అల్లుడు శీను’తో పోలిస్తే శ్రీనివాస్ చాలా మెరుగయ్యాడని వినాయక్ అన్నాడు. బోయపాటి శ్రీనుకు సినిమానే జీవితం అని.. ‘దమ్ము’ షూటింగ్ సందర్భంగా అతను అద్దం ముందు నిలుచుని మీసం మెలేస్తుండటం చూశానని.. ఎన్టీఆర్ తో ఓ సీన్ ఎలా చేయించాలో ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలిసిందని.. ఎన్టీఆర్ లాంటి పెర్ఫామర్ తో కూడా ఎలా చేయించాలా అని అలా ప్రాక్టీస్ చేయడం ఆశ్చర్యం కలిగించిందని వినాయక్ తెలిపాడు.