Begin typing your search above and press return to search.

వినాయక్, ఉపేంద్ర.. ఓ టమోటా సినిమా

By:  Tupaki Desk   |   10 Aug 2015 9:40 AM GMT
వినాయక్, ఉపేంద్ర.. ఓ టమోటా సినిమా
X
నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఉపేంద్ర-2 సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ సినిమాను తెలుగులోకి తెస్తున్ననల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) చాలా మంది ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సినీ ప్రముఖుల్ని ఆడియో ఫంక్షన్ కు తీసుకొచ్చి బాగానే హంగామా చేశాడు. వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో దిల్ రాజు, గోపీచంద్ మలినేని, వీరూ పోట్ల, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఉప్పి మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఉపేంద్ర సినిమా తమ మీద ఎంత ప్రభావం చూపిందో చెబుతూ.. తామందరం ఉపేంద్ర ఫ్యాన్స్ అని చెప్పుకున్నారు. వినాయక్ సైతం తనకు ఉపేంద్ర ఒక రోల్ మోడల్ అని.. ఆయనంత కొత్తగా సినిమాలు తీయడం ఎవరివల్లా కాదని చెప్పారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండగా డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించిన ఉపేంద్రతో తన అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు.

‘‘ఓం సినిమా రోజుల నుంచే నాకు ఉపేంద్ర అంటే చాలా అభిమానం. ఆ తెలుగులో హీరోగా ఓ సినిమా చేయడం కోసం హైదరాబాద్ కు వచ్చారు. దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. ఆయన్ని చూడ్డం నాలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లకు భలే సరదా. ఆయన ప్రతి మూమెంట్ ని గమనించే వాళ్లం. అప్పట్లో ఓ పెద్ద షాపింగ్ మాల్ లో ఉపేంద్ర 50 వేల రూపాయలకు బట్టలు కొన్నారన్న సంగతి కథలు కథలుగా చెప్పుకునేవాళ్లం. ఐతే ఆ తర్వాత ఉపేంద్రను వ్యక్తిగతంగా కలవాల్సి వస్తే ఆయనుంటున్న కాటేజీ కి వెళ్లాం. డోర్ తెరిచి ఆయన్ని చూస్తే నాకు మతి పోయింది. ఓ లుంగీ కట్టుకుని.. జేబు చిరిగిన ఓ చొక్కా వేసుకుని కనిపించాడు. బయట అంత స్టయిల్ గా ఉండే ఉపేంద్ర.. ఇంట్లో అంత సింపుల్ గా ఉంటాడా అనిపించింది. ఆ ప్రభావం నామీద కూడా పడింది. నేను కూడా ఇప్పుడు ఇంట్లో లుంగీ కట్టుకుని. చిరిగిన చొక్కాలు వేసుకుంటున్నా. ఉపేంద్ర ప్రతిదీ కొత్తగా ఉండాలని ఆలోచిస్తారు. అప్పట్లో నేను పని చేసిన సినిమాకు సంబంధించి.. దర్శకుడితో కథా చర్చలు జరుగుతుండగా.. హీరో హీరోయిన్లు పదే పదే ఐలవ్యూ చెప్పుకోవడం గురించి చర్చ వచ్చింది. ఇలా చెప్పుకోవడం ప్రేమతో కాదని.. ఇన్ సెక్యూర్ ఫీలింగ్ తో అని.. దీని గురించి సినిమాలో డిస్కస్ చేద్దామని చెప్పాడు ఉపేంద్ర. చాలా కొత్తగా అనిపించింది. అంతే కాదు.. ఆ సినిమా టైటల్ కూడా రొటీన్ గా ఉందని.. ‘టమోటా’ అని పెడదామని చెప్పాడు. అలా ఏదైనా కొత్తగా ఉండాలని చూస్తాడు ఉపేంద్ర’’ అని ఒకప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు వినాయక్.