Begin typing your search above and press return to search.
శక్తి దెబ్బ నుంచి ప్రభాస్ బయట పడేస్తాడా?
By: Tupaki Desk | 4 May 2023 6:24 PM GMTవైజయంతి మూవీస్ అంటే టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ బ్యానర్ లో ఎక్కువగా స్టార్ హీరోలతోనే మూవీస్ వచ్చాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే ఆ రోజుల్లో సోఫియా ఫాంటసీ కథతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
అయితే వైజయంతి మూవీస్ బ్యానర్ లో కూడా ప్లాప్ సినిమాలు ఉన్నాయి. కానీ నిర్మాత అశ్వినీ దత్ కి పీడకల మారిన మూవీ మాత్రం శక్తి అని చెప్పాలి. మెహర్ రమేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో నిర్మాత అశ్వినీ దత్ ఏకంగా 32 కోట్ల వరకు నష్టపోయారు.
సినిమాకు పెట్టిన పెట్టుబడిలో కనీసం 20 శాతం కూడా శక్తి మూవీ రికవరీ చేయలేకపోయింది. ఇక ఆ డిజాస్టర్ నుంచి కోలుకోవడానికి ఏకంగా నాలుగేళ్ల సమయం అశ్వినీ దత్ కు పట్టింది. శక్తి తరహాలోనే మరల ఇప్పుడు అంతకు మించి అనే విధంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్టు కె సినిమాని నిర్మిస్తున్నారు.
500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శక్తి తరహాలోనే ఈ సినిమా పైన కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అప్పుడు 50 కోట్లు అంటే ఇప్పుడు 500 కోట్ల బడ్జెట్ లెక్క. ఈ లెక్కన శక్తి సినిమా నష్టం ప్రస్తుతం మార్కెట్ లెక్కల్లో తీసుకుంటే 100 కొట్లకి పైనే.
ప్రాజెక్ట్ కె మూవీని ఇండియన్ హాలీవుడ్ సినిమా గా ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కథతో ఈ మూవీ చేస్తున్నట్లు నిర్మాత అశ్విని దత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అలాగే సినిమా పైన కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. మరి అప్పుడు శక్తి సినిమా కొట్టిన దెబ్బ నుంచి ప్రాజెక్ట్ కె మూవీతో ప్రభాస్ అశ్విని దత్ ను బయటపడేస్తాడా లేదా అనేది జనవరి 12 తరువాత తెలిసిపోతుంది.