Begin typing your search above and press return to search.

వైజయంతి రిస్క్ చేయటం లేదుగా!

By:  Tupaki Desk   |   2 Aug 2018 6:11 AM GMT
వైజయంతి రిస్క్ చేయటం లేదుగా!
X
టాలీవుడ్ ప్రస్థానంలో వైజయంతి మూవీస్ బ్యానర్ ది ప్రత్యేకమైన ప్రస్థానం. స్వర్గీయ ఎన్టీఆర్ చేతుల మీదుగా యుగపురుషుడుతో ప్రారంభమై అతి తక్కువ కాలంలో భారీ సినిమాల నిర్మాణానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిన దీని విజయం వెనుక నిర్మాత అశ్వినీదత్ కృషి చాలా ఉంది. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలందరితోను సినిమాలు తీసిన ఈయన జగదేకవీరుడు అతిలోకసుందరి-ఆఖరి పోరాటం-అగ్ని పర్వతం-చూడాలని ఉంది-ఇంద్ర లాంటి అల్ టైం బ్లాక్ బస్టర్స్ తో పాటు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో భాగస్వామ్యం కూడా పంచుకున్నారు. కానీ అదంతా గత చరిత్ర. 2002లో పవన్ కళ్యాణ్ తో తీసిన బాలుతో ప్రతిదీ ఫెయిల్యూర్ కావడం మొదలయ్యింది. సుభాష్ చంద్ర బోస్-రావోయి చందమామ-జై చిరంజీవ-సైనికుడు-కంత్రి-శక్తి ఇలా దేనికదే డిజాస్టర్ స్థాయికి తగ్గకుండా చేదు అనుభవాలు మిగిల్చాయి. ఇందులో నటించినవారందరూ అగ్ర హీరోలే కావడంతో బడ్జెట్ పరిమితులు లేకుండా భారీ నిర్మించడంతో నష్టాలు రెట్టింపు కావడం మొదలయ్యింది.

ఈ ఏడాది వచ్చిన మహానటి వైజయంతి సంస్థకు పూర్వ వైభవం వచ్చే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 45 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఉత్సాహమో లేక ముందే ఊహించి ప్లాన్ చేసుకున్న ప్రకారమో చెప్పలేం కానీ మళ్ళి వరసగా భారీ ప్రాజెక్ట్స్ ని లైన్ పెడుతోంది వైజయంతి. నాగార్జున నానితో తీస్తున్న మల్టీ స్టారర్ దేవదాస్ మీద ఎంత క్రేజ్ ఉందొ అంతే స్థాయిలో ఎక్కడో తేడా కొడుతోందట అనే ప్రచారం కూడా ఫిలింనగర్ లో జోరుగా సాగుతోంది.

ఇది కాకుండా చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మహేష్ బాబు 25వ సినిమాలో కూడా వైజయంతి పార్టనర్ గా ఉంది. మరి ఒకేసారి ఇంత పెద్ద పెద్ద రిస్కులు చేస్తున్న వైజయంతికి ఈ రెండూ చాలా కీలకం. మహానటి భారీగా తీసినా ఇంత ఖర్చు కాలేదు. అందుకే లాభాల శాతం పెరిగింది. కానీ దేవదాస్ ప్లస్ మహేష్ సినిమాల సంగతి వేరు. బడ్జెట్ పరంగా చాలా రిస్క్ ఫాక్టర్ ఉంది. మరి ఈ రెండూ విజయాలు సొంతం చేసుకుంటే వైజయంతి సంస్థ పూర్తిగా ట్రాక్ లో పడ్డట్టే. దేవదాస్ సెప్టెంబర్ లో విడుదల కానుండగా మహేష్ 25వ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ ఉంటుంది.