Begin typing your search above and press return to search.

ధనుష్ అండ్ బ్యాచికి ఇంకా అర్ధం'కాలా'?

By:  Tupaki Desk   |   16 Feb 2018 6:14 AM GMT
ధనుష్ అండ్ బ్యాచికి ఇంకా అర్ధంకాలా?
X
ఏప్రియల్ 27న రజనీకాంత్ ''కాలా'' వచ్చేస్తోంది అంటూ ఒక ప్రకటన చేయగానే మొత్తం తమిళనాడు అంతా ఎలర్ట్ అయిపోయింది. ఆల్రెడీ సూపర్ స్టార్ కూడా పొలిటికల్ జర్నీ మొదలెట్టారు కాబట్టి.. ఇప్పుడు ఈ సినిమాకు ప్రత్యేకంగా విపరీతమైన ప్రమోషన్లను చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాను తెలుగులో మాత్రం మనోళ్లు పెద్దగా పట్టించుకోవట్లేదు సుమీ. ఎందుకంటారు?

నిజానికి ధనుష్‌ ప్లానింగ్ ఎలా ఉందంటే.. తమిళంలో డేట్ చెప్పగానే తెలుగులో కూడా ఎలర్ట్ అయిపోయి ధియేటర్లు ఇచ్చేసి డిస్ర్టిబ్యూటర్లు వచ్చేసి సినిమాను కొనుక్కొని వెళ్ళిపోతారు అనుకున్నారు. కాని ఇక్కడ కాలా డేట్ వచ్చిన వెంటనే.. ఏప్రియల్ 26న అల్లు అర్జున్ నా పేరు సూర్య.. మహేష్‌ భరత్ అను నేను సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలతో పోటీ పడీ ''కాలా'' సినిమాను కొనేసి.. తెలుగులో రిలీజ్ చేసేంత ధైర్యం ఎవరు చేస్తారు చెప్పండి? అందుకే కాలా సినిమాకు బయ్యర్లు కరువైయ్యారు.

గతంలో పక్కనే చిన్నచిన్న సినిమాలే పోటీ ఉండేవి కాబట్టి.. రజనీ సినిమాను మన తెలుగు పంపిణీదారులే ఎగబడి కొనేశేవారు. ఇప్పుడేమో బన్నీ అండ్ మహేష్‌ సినిమాలకు భయపడి ఆగిపోతున్నారు. అయితే ఈ విషయం ధనుష్‌ కు మాత్రం ఇంకా అర్దం కాలేదు. అందుకే బయ్యర్లు రావట్లేదేంటి అంటూ కంగారుపడుతున్నాడు. అంతేకాదు.. ఒకవేళ ఎవరూ రాకపోతే వండర్ బార్ పతాకంపై తనే స్వయంగా రిలీజ్ చేసుకుంటాడట.