Begin typing your search above and press return to search.

లైగర్ గొడవ.. వరంగల్ శీను ఏమన్నాడంటే?

By:  Tupaki Desk   |   17 May 2023 1:00 PM GMT
లైగర్ గొడవ.. వరంగల్ శీను ఏమన్నాడంటే?
X
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో గతేడాది ఆగస్టులో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్, పూరీ కనెక్స్ట్ సంయుక్తంగా నిర్మించారు. సినిమా రిలీజై తొమ్మిది నెలలు గడుస్తున్నా.. నష్టాల తాలూకు గొడవ మాత్రం ఇంకా సద్దుమణగలేదు. ఈ చిత్రం వల్ల భారీగా నష్టపోయిన బయర్స్ పరిహారం కోసం హైదరాబాద్ లో నిరాహార దీక్షలు చేస్తున్నారు.

ఈ సినిమా మీద భారీ పెట్టుబడి పెట్టి కోలుకోలేని దెబ్బతిన్న డిస్ట్రిబ్యూటర్లలో వరంగల్ శీను ఒకరు. దాదాపుగా ఈ చిత్రం తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆపేసి సైలెంట్ అయిపోయాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న నిరాహార దీక్షల్లో ఆయన కనిపించడం లేదు. దీక్షతో ఆయనకు సంబంధం లేదని కొందరు చెబుతుండగా.. మరికొందరేమో తెర వెనుక ఉండే కథ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించి వరంగల్ శీను అసలు విషయంపై క్లారిటీ ఇచ్చారు.

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు తాను ఓ అడ్మైరర్ అని.. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తనకు ఆయనంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను మంచి ధరకు తీసుకొని.. పూరీకి ఎవరూ ఇవ్వలేని ఓవర్ ఫ్లోస్ ఇచ్చినట్లు శ్రీను గుర్తు చేశారు.

అయితే ఈ సినిమా వచ్చిన లాభాల కంటే లైగర్ చిత్రం వల్ల నష్టపోయిందే చాలా ఎక్కువన్నారు. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ 15 నిమిషాలు మినహాయిస్తే.. మిగిలిన చిత్రం అంతా తనకు నచ్చినట్లు వివరించాడు.

సినిమా ఫ్లాప్ అయిన తర్వాత డైరెక్టర్ పూరీతో, ఛార్మితో మాట్లాడేందుకు తాను ప్రయత్నించానని.. కానీ వాళ్లు తన ఫోన్ కూడా లేపట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చేసినా వాళ్లు తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని వివరించారు. అలాగే డైరెక్టర్ కు వ్యతిరేకంగా ధర్నా చేయాలనుకున్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు వార్నింగ్ ఇస్తూ.. ఎవరైనా బతికేది పరువు కేసమే అని పూరీ వ్యాఖ్యానించినట్లు చెప్పారు. మరి తనకు కూడా పరువు ఉంటుందని కదా అని అన్నారు.

అయితే వాట్సాప్ గ్రూపుల్లో తిరిగిన మెసేజ్ కు, ధర్నాలకు తనకు ఏమాత్రం సంబంధం లేదని వరంగల్ శీను క్లారిటీ ఇచ్చారు. నిజానికి పూరీ మోసం చేసే వ్యక్తి కాదని.. ఆయన్ని కలిసి మాట్లాడుదామని.. బయ్యర్లకు తాను చెప్పినట్లు వివరించారు. కానీ ఆ మెసేజ్ ఎవరు రాశారు, ఎలా స్ప్రెడ్ అయిందో తనకు అస్సలే తెలియదన్నారు. ఆ మెసేజ్ వల్లే తనను అంతా అపార్థం చేసుకున్నారని... తన మీద కక్ష గట్టి కొందరు ఈ డ్రామాను నడిపించారని భావిస్తున్నట్లు శ్రీను చెప్పారు.