Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ ర‌చ‌యిత‌ల‌దే ఇక‌పై హ‌వా

By:  Tupaki Desk   |   2 Oct 2019 1:30 AM GMT
వెబ్ సిరీస్ ర‌చ‌యిత‌ల‌దే ఇక‌పై హ‌వా
X
సినిమాకు స‌మాంత‌రంగా డిజిట‌ల్ ప్ర‌పంచం విస్త‌రిస్తోంది. థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూడాల‌నుకునే ప్రేక్ష‌కుడి మైండ్ సెట్ లో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది. థియేట‌ర్ నుంచి దృష్టి వెబ్ సిరీస్ వీక్ష‌ణ‌ వైపు మ‌ళ్లుతోంది. టీవీ పెడితే మ‌న‌సుకి ఆహ్లాదాన్ని.. వినోదాన్ని అందించే కార్య‌క్ర‌మాలు క‌నిపించ‌డం లేదు. దీనికి తోడు రొటీన్ కామెడీ స్కిట్ లు.. డీగ్రేడ్ కార్య‌క్ర‌మాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఆహ్లాద‌క‌ర‌మైన కామెడీ వినోదం మిస్స‌వుతోంది. పైగా బుల్లితెర‌పై క్రియేటివిటీ కంటే మాస్ డ‌బుల్ మీనింగు జోకుల‌తో కాల‌క్షేపం వికారం పుట్టిస్తోంది. అందు వ‌ల్ల ఆ చెత్త చూడ‌టం కంటే వెబ్ సిరీస్ ల‌లో వుండే ఆస‌క్తిక‌ర‌మైన కంటెంట్ చూడ‌టానికే జ‌నాలు అమితాస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ వెబ్ సిరీస్ ల‌కు క్రేజు పెరిగింది. ప‌లువురు క్రేజీ స్టార్లు.. వెండితెర‌పై ఇక త‌మ శ‌కం ముగిసింద‌ని భావించిన వారు ఇప్పుడు వెబ్ సిరీస్ ల బాట ప‌డుతున్నారు. అక్క‌డ అవ‌కాశాల‌తో పాటు ఆస‌క్తిక‌ర‌మైన కంటెంట్ వుండ‌టంతో వెబ్ సిరీస్ వీక్ష‌ణ‌కు జ‌నం అల‌వాటు ప‌డుతున్నారు. స‌రిగ్గా ఇదే పాయింట్ ర‌చ‌యిత‌ల‌కు ఓ కొత్త దారిని తెరిచింద‌ని విశ్లేషిస్తున్నారు. డిజిట‌ల్ రంగంలో టాలెంటెడ్ రైట‌ర్స్ కి మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌నుంది. ప‌నికి త‌గ్గ ఆదాయ మార్గం క‌నిపిస్తోంది. సినిమాతో పోలిస్తే ఈ రంగంలో ర‌చ‌యిత‌ల‌కు అత్య‌ధికంగా ప్రాధాన్యం పెరిగింది. నెల‌కి ల‌క్ష‌ల్లో జీతాలు అందుకునే అవ‌కాశం ఓటీటీ/ వెబ్ సిరీస్ వేదిక క‌ల్పించ‌నుంద‌ని తాజా అధ్య‌య‌నం చెబుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ వ‌ల్ల యంగ్ టాలెంటెడ్ ర‌చ‌యిత‌ల కెరీర్ కు బంగారు బాట‌గా మార‌బోతోందని ఓ ప్ర‌ముఖ టెలీ సీరియ‌ల్ ద‌ర్శ‌కుడు తుపాకీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ విశ్లేషించారు.

వెబ్ సిరీస్ లో కిక్కు ఎంత‌? అని అడిగితే .. ప్ర‌స్తుతం లైవ్ లో ఉన్న `ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ ని చూడండి .. మీరే చెబుతారు.. అందులో మ‌జా ఏంటో! అంటూ చెబుతున్నారాయ‌న‌. పైగా ఈ వెబ్ సిరీస్ కి డైరెక్ట్ చేస్తోంది ఇద్ద‌రు తెలుగు కుర్రాళ్లు. తెలుగులో `డీ ఫ‌ర్ దోపిడి` చిత్రాన్ని.. హిందీలో షోర్ ఇన్ ద సిటీ.. గో గోవా గాన్‌.. హ్యాపీ ఎండింగ్‌.. ఎ జెంటిల్‌మేన్‌.. స్త్రీ వంటి చిత్రాల్ని అందించిన రాజ్ అండ్ డీకే తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ వెబ్ సిరీస్ `ఫ్యామిలీమెన్‌`. తెలుగు- త‌మిళం- హిందీ భాష‌ల్లో ఈ వెబ్ సిరీస్ అమెజాన్ లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ వెబ్ సిరీస్‌లపై ఆస‌క్తి పెంచ‌డంలో ఫ్యామిలీ మ్యాన్ పెద్ద బూస్ట్ అవుతోంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

టీవీక్ష‌కుల్లో మునుముందు ఆస‌క్తి మారుతోంది. ఇప్ప‌టికే తెలుగులో ప‌లు ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు వెబ్ సిరీస్ రూప‌క‌ల్ప‌న‌ల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తున్నాయి. `గాడ్స్ ఆఫ్ ధ‌ర్మ‌పురి`.. మ్యాడ్ హౌజ్ వంటి వెబ్ సిరీస్ లు తెలుగు ఆడియెన్ కి అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామం ఈ రంగంలో న‌టీన‌టుల‌కు అవ‌కాశాలు పెంచుతోంది. దాంతోపాటే భ‌విష్య‌త్తు టాలెంటెడ్ ర‌చ‌యిత‌ల‌దే అన్న సంకేతాలు బ‌లంగా క‌నిపిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ రంగంలో టాలెంట్ వున్న ర‌చ‌యిత‌ల‌కు మరింత‌గా అవ‌కాశాలు పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్రేక్ష‌కుల్ని ఉత్కంఠ‌కు గురి చేసే లేదా థ్రిల్ ని క‌లిగించే కంటెంట్ ని గ్రిప్పింగ్ గా రాయ‌గ‌లిగేవారికి ఇక్క‌డ చాలా అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.