Begin typing your search above and press return to search.

క్షమించమని న‌య‌న్ దంప‌తులు..టీటీడీ నిర్ణ‌యం ఏంటీ?

By:  Tupaki Desk   |   11 Jun 2022 8:33 AM GMT
క్షమించమని న‌య‌న్ దంప‌తులు..టీటీడీ నిర్ణ‌యం ఏంటీ?
X
నూత‌న దంప‌తులు న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ వివాదంలో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. అట్ట‌హాసంగా జూన్ 9న వివాహం చేసుకున్న ఈ దంప‌తులు ఆ మ‌రుస‌టి రోజే పెళ్లి బ‌ట్ట‌ల్లో తిరుమ‌ల‌ తిరుప‌తి దేవ‌ స్థానానికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన ద్వారానికి అత్యంత స‌మీపంలో న‌య‌న‌తార చెప్పుల‌తో తిర‌గ‌డం, ప్ర‌త్యేకంగా ఫొటో షూట్ ని నిర్వ‌హించ‌డం వివాదానికి దారితీసింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ఈ కొత్త జంట భ‌క్తుల మ‌నోభావాల‌ని దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించ‌డంతో వారిపై స‌ర్వత్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

వీరి ఫొటో షూట్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ కావ‌డంతో దీనిపై టీటీడీ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ న‌య‌న‌తార దంప‌తుల‌కు నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా ఈ దంప‌తుల‌కు టీటీడీ పాల‌క మండలి ఫోన్ కూడా చేసి వివ‌ర‌ణ కోరారు. దీంతో తెలియ‌క జ‌రిగిన త‌ప్పిద‌మ‌ని, భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తీసినందుకు ద‌య‌చేసి క్ష‌మించాలంటూ న‌య‌నతార దంప‌తులు కోరిన‌ట్లు టీటీడీ వీఎస్ వో స్పష్టం చేశారు. టీటీడీ ఈవో, చైర్మ‌న్ ల‌తో చ‌ర్చించి త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

అయితే వివాదం గురించి తెలిసిన వెంట‌నే ఫోన్ లో న‌య‌న‌తార దంప‌తులు టీటీడీ పాల‌క వ‌ర్గాల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆ త‌రువాత టీటీడీ నోటీసులు జారీ చేసింది. అనంత‌రం మ‌రోసారి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ న‌య‌న‌తార దంప‌తులు మీడియాకు లేఖ‌ని విడుద‌ల చేశారు. నోటీసుల‌కు ముందు, నోటీసులు త‌రువాత కూడా న‌య‌న‌తార దంప‌తులు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయినా టీటీడీ కి సంబంధించిన వారు ఈవో, చైర్మ‌న్ ల‌తో చ‌ర్చించి త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్ప‌డం ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన త‌రువాత చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌న‌డం ఏంట‌ని కొంత మంది వాదిస్తున్నారు.

అంతే కాకుండా న‌య‌న‌తార దంప‌తులు తెలియ‌క జ‌రిగిన త‌ప్పిదానికి చింతిస్తూ క్ష‌మాప‌ణ‌లు చెబుతూ మీడియాకు లేఖ‌ని కూడా విడుద‌ల చేశారు. 'ఆ స‌మ‌యంలో త‌మ కాళ్ల‌కు చెప్పులు వున్న‌ట్టుగా గుర్తించ‌లేద‌ని లేఖ‌లో పేర్కొన్నారు. దేవుడిపై త‌మ‌కు అపార‌మైన న‌మ్మ‌కం వుంద‌ని, తాము తెలియ‌క చేసిన త‌ప్పుల‌ను మ‌న్నించాల‌ని కోరాడు.

'మా పెళ్లి తిరుమ‌ల‌లో జ‌ర‌గాల‌ని కోరుకున్నాం. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అది సాధ్య‌ప‌డ‌లేదు. చెన్నై స‌మీపంలోని మ‌హాబ‌లిపురంలో మా వివాహం జ‌రిగింది. స్వామివారిపై వున్న అపార‌మైన భ‌క్తితో పెళ్లి త‌రువాత ఇంటికి వెళ్ల‌కుండా మండ‌పం నుంచి నేరుగా తిరుమ‌ల‌కు వ‌చ్చాము. స్వామి వారి క‌ల్యాణోత్స‌వ సేవ‌లో పాల్గొని ఆశీస్సులు తీసుకోవాల‌నుకున్నాం. శుక్ర‌వారం ద‌ర్శ‌నం చేసుకునేందుకు వ‌చ్చాము.

ద‌ర్శ‌నం అనంత‌రం మా పెళ్లి తిరుమ‌ల‌లో పూర్త‌యిన‌ట్లు అనిపించేలా ఫొటోలు తీసుకోవాల‌ని అనుకున్నాం. అయితే ఆల‌య ప్రాంగ‌ణంలో భ‌క్తులు ఎక్కువ‌గా వుండ‌టంతో ఆల‌యం నుంచి వెళ్లిపోయాము. మ‌ళ్లీ తిరిగి వ‌చ్చాము. వెంట‌నే ఫొటో షూట్ పూర్తి చేయాల‌నే కంగారులో చూసుకోకుండా చెప్పులు కాళ్ల‌కు ఉన్నట్లుగా గ‌మ‌నించ‌లేదు. ఇందుకు మ‌న‌స్ఫూర్తిగా మేమిద్ద‌రం క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నాం. మా పెళ్లి ఏర్పాట్ల కోసం గత 30 రోజుల్లో ఐదు సార్లు తిరుమ‌ల‌కు రావ‌డం జ‌రిగింది. ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేదు. మేము ఎంత‌గానో ప్రేమించే స్వామి వారిపై భ‌క్తి లేకుండా ఇలా చేయలేదు. తెలియ‌క జ‌రిగిన మా త‌ప్పుల‌కు మేము క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాము. ద‌య‌చేసి క్ష‌మించండి' అని విఘ్నేష్ శివ‌న్ తను మీడియాకు విడుద‌ల చేసిన లేఖ‌లో పేర్కొన్నారు. టీటీడీ నోటీసుల‌కు ముందు, నోటీసుల త‌రువాత న‌య‌న దంప‌తులు జ‌రిగిన త‌ప్పిదాన్ని క్ష‌మించ‌మ‌ని కోరిన నేప‌థ్యంలో టీటీడీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుంద‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.