Begin typing your search above and press return to search.

సినిమా థియేట‌ర్లు బంద్.. బార్లు ఓపెన్.. ఇదేమి మహా ప్ర‌భుత్వం?

By:  Tupaki Desk   |   5 April 2021 4:52 AM GMT
సినిమా థియేట‌ర్లు బంద్.. బార్లు ఓపెన్.. ఇదేమి మహా ప్ర‌భుత్వం?
X
భారతదేశంలో 58.19శాతం కోవిడ్ 19 కేసులు ఉన్న రాష్ట్రంగా మ‌హారాష్ట్ర గుబులు రేకెత్తిస్తోంది. పెరుగుతున్న కేసుల‌పై మ‌హా ప్ర‌భుత్వం తీవ్ర ఆందోళ‌న‌లో ఉంది. జ‌న‌స‌మూహాలు ఉండే చోట ఇక లాక్ డౌన్ త‌ప్ప‌ద‌ని సీఎం ఉద్ధ‌వ్ ఇంత‌కుముందే ప్ర‌క‌టించగా సినీప్ర‌పంచం నివ్వెర‌పోయింది.

ప‌రిశ్ర‌మ క‌ష్టాల్లో ఉంద‌ని సినిమా థియేట‌ర్ల‌ను మూసివేయ‌వ‌ద్ద‌ని ముంబై ప‌రిశ్ర‌మ‌ అభ్య‌ర్థించినా కానీ దానిని మ‌హా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. స‌రిక‌దా.. ఈ సోమ‌వారం రాత్రి 8 నుండి థియేట‌ర్లు స‌హా చాలా చోట్ల బంద్ అమలులో ఉంటుందని ప్ర‌క‌టించింది. సినిమా హాల్స్- థియేటర్లు - మల్టీప్లెక్స్ లను ప్రజల ప్రవేశాన్ని నిషేధించింది. అయితే షూటింగుల‌కు కొద్దిపాటి వెసులుబాటు క‌ల్పించింది. రద్దీ లేకపోతే సినిమా- టెలివిజన్ షూటింగులు కొనసాగుతాయి. పార్కులు.. ఆట స్థలాలు కూడా మూసివేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో షాపింగ్ మాల్స్- బార్ లు- రెస్టారెంట్లు- చిన్న షాపులు టేక్-అవేస్ .. పొట్లాల కోసం మాత్రమే తెరుస్తార‌ని వెల్ల‌డించింది.

రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితిపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిన కొద్దిసేప‌టికే.. మైనారిటీ వ్యవహారాల మంత్రి.. ఎన్ ‌సిపి నాయకుడు నవాబ్ మాలిక్ శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు మహారాష్ట్ర వారాంతపు లాక్ డౌన్ త‌ప్ప‌ద‌ని ధృవీకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు వాటి సామర్థ్యంలో 50శాతం మాత్రమే పనిచేయడానికి అనుమతించబడతాయని మాలిక్ చెప్పారు.

మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని.. సిఆర్ ‌పిసి సెక్షన్ 144 కింద జారీ చేసిన నిషేధిత ఉత్తర్వులు వారంలో పగటిపూట అమలు చేయబడతాయని మాలిక్ తెలిపారు. నైట్ కర్ఫ్యూ నుండి అవసరమైన సేవలకు మినహాయింపు ఉంటుంది.

పరిశ్రమలు - ఉత్పత్తి రంగం.. కూరగాయల మార్కెట్లు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలతో (ఎస్‌ఓపి) పనిచేస్తాయని.. కార్మికులకు వసతి సౌకర్యం ఉంటే నిర్మాణ స్థలాలు పనిచేస్తాయని మంత్రివ‌ర్యులు మాలిక్ తెలిపారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 49447 కొత్త కోవిడ్ -19 కేసులు న‌మోద‌వ్వ‌గా.. 277 మంది మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 37821 మంది ఈ వ్యాధి నుండి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 24. 95ల‌క్ష‌లుకు చేరుకుంది. రాష్ట్రంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 4ల‌క్ష‌లు ఉంది. గత 24 గంటల్లో కొత్త మరణాలతో టోట‌ల్ మరణాలు 55656 కు పెరిగాయి.