Begin typing your search above and press return to search.

దిగ్గజ దర్శకుడ్ని కలిసేందుకు వెళ్లి ఫోటోలు తీయించుకున్నాడు

By:  Tupaki Desk   |   18 April 2021 8:30 AM GMT
దిగ్గజ దర్శకుడ్ని కలిసేందుకు వెళ్లి ఫోటోలు తీయించుకున్నాడు
X
విలక్షణ నటుడు. పాత్ర ఏదైనా ఇట్టే ఇమిడిపోతాడు. హీరో కావొచ్చు.. విలన్ కావొచ్చు. సహాయనటుడు కావొచ్చు. పాత్ర ఏదైతే.. దాని కోసమే పుట్టినట్లుగా ఉండే టాలెంట్ విజయ సేతుపతి సొంతం. ఇటీవల కాలంలో తెలుగు.. తమిళ ఇండస్ట్రీలో అతనో హాట్ టాపిక్. అతడి నటన గురించి తెలిసినంత బాగా.. అతడి వ్యక్తిగత జీవితం గురించి అస్సలు తెలీదు. సినిమా కథకు ఏ మాత్రం తీసిపోని రీతిలో డ్రామా ఉన్న అతడి జీవితంలోని కొన్ని విషయాలు ఆసక్తికరంగానే కాదు.. నిజమా? అన్న విస్మయానికి గురి చేస్తాయి.

అలాంటిదే ఒక ఉదంతాన్ని విజయసేతుపతి స్వయంగా చెప్పారు. సాధారణంగా బాలచందర్ లాంటి దిగ్గజ దర్శకుడి దగ్గరకు వెళ్లిన వారు ఎవరైనా సరే.. ‘సార్.. మీ సినిమాలో ఛాన్సు ఇస్తారా?’ అని అడుగుతారు. కానీ.. విజయ సేతుపతి మాత్రం భిన్నం. ఆయన్ను కలిసిన సందర్భానికి అతడికి ఊరు..పేరు ఇండస్ట్రీలో ఎవరికి తెలీదు. పూర్తిగా కొత్త. అలాంటి వ్యక్తి ఆయన్ను కలిస్తే.. ఆయన నోటి నుంచి వచ్చిన మాట.. ‘బాబు ఇప్పుడేం సినిమాలు చేయటం లేదు’ అని. అందుకు విజయసేతపతి చెప్పిన మాట.. ‘సార్.. మీ దగ్గరకు ఛాన్సు అడగటం కోసం రాలేదు’ అని.

మరి ఎందుకు వచ్చినట్లు? అన్న సందేహానికి అతడు చెప్పిన సమాధానం.. మీరు దిగ్గజ దర్శకుడిగా అందరికి తెలుసు. కానీ.. మంచి ఫోటోగ్రాఫర్ అన్న విషయం చాలామందికి తెలీదు. నాకు మాత్రంతెలుసు. నా ఫోటోలు తీస్తారేమోనని అడిగేందుకు వచ్చానని బదులిచ్చాడు. బాలుమహేందర్ లాంటి పెద్దాయన్నుకలిస్తే చాలనుకునే వారికి భిన్నంగా ఆయన చేత ఫోటోలు తీయమని అడగటానికి వచ్చిన విజయ సేతుపతిని చూసి ముచ్చట పడిన ఆయన..ఇప్పటివరకు నన్ను ఎవరూ ఇలా అడగలేదని నవ్వుతూనే.. అతడు కోరినట్లుగా ఫోటోలు తీసి ఇచ్చాడు.

తన కెమేరాను సిద్ధం చేసుకొని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు చేసుకొని.. వాటి ప్రింట్లను ఇస్తూ.. నేను చూసిన చక్కటి ఫోటోజెనిక్ ఫేస్ లలో నీదీ ఒకటి.. మంచి నటుడివి అవుతావంటూ ఆశీర్వదించి పంపారట.అయితే.. ఆయన తీసిన ఫోటోల్నిచూసిన సేతుపతి భార్య సీరియస్ కావటం.. సినిమాల్లోకి వెళ్లకూడదన్న ఆమె మాటకు కట్టుబడి.. ఆ ఫోటోల్ని తన చేతులతో తాను చించేయటం.. కొంతకాలానికి అవకాశాలు రావటం.. మరికొన్నేళ్లకు స్టార్ హోదాను సొంతం చేసుకోవటం విజయ సేతుపతికి చెల్లింది. రాసి పెట్టి ఉంటే.. జరగకుండా ఉంటుందా?