Begin typing your search above and press return to search.

మలయాళ నాట 'మరక్కార్' మాటేమిటో?!

By:  Tupaki Desk   |   3 Dec 2021 4:30 AM GMT
మలయాళ నాట మరక్కార్ మాటేమిటో?!
X
మలయాళనాట విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మోహన్ లాల్ పేరు చెబుతారు. వైవిధ్యభరితమైన కథలకు .. ప్రయోగాత్మకమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ ఆయన తన జోరును కొనసాగిస్తున్నారు. యంగ్ స్టార్ హీరోలు కూడా ఆయనతో పోటిపడలేకపోతున్నారు. అలాంటి మోహన్ లాల్ తన తాజా చిత్రంగా 'మరక్కార్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 100 కోట్ల బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమైంది. ప్రియదర్శన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

16వ శతాబ్దానికి చెందిన ఒక కేరళ పోరాట యోధుడి కథ ఇది. కుంజాలి మరక్కార్ అనే ఒక యోధుడి జీవితంలోని ఒక కోణం ఇది. కేరళ తీర ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకురావడానికి ప్రయత్నించిన పోర్చుగీసువారిని మరక్కార్ ధైర్యసాహసాలతో ఎదురిస్తాడు. ఫలితంగా తన కుటుంబ సభ్యులను కోల్పోతాడు. పోర్చుగీసువారి బారి నుంచి తప్పించుకున్న మరక్కార్, రహస్య జీవితంలోకి వెళ్లిపోతాడు. తిరిగి ఆయన తన బలాన్ని ఎలా కూడగట్టుకున్నాడు? పోర్చుగీసువారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేదే కథ.

ఈ సినిమా నిర్మాణ సమయం నుంచే మలయాళంలో ఈ సినిమాను 'బాహుబలి'తో పోల్చారు. ఆ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా రూపొందుతున్నట్టుగా చెప్పారు. మోహన్ లాల్ .. సునీల్ శెట్టి .. ప్రభు .. కీర్తి సురేశ్ .. సుహాసిని .. మంజు వారియర్ వంటి తారాగణం కారణంగా ఈ సినిమాపై అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. కాస్ట్యూమ్స్ పరంగా కూడా ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మలయాళంలోనే కాదు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషా ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ప్రియదర్శన్ గొప్ప దర్శకుడే అయినప్పటికీ, ఈ సినిమా కథాకథనాలపై ఆయన అంతగా దృష్టి పెట్టలేదని చెప్పుకుంటున్నారు. స్క్రీన్ ప్లే లోపం కారణంగా కథలో కొంత గందరగోళం కనిపిస్తోందని అంటున్నారు. ఏ పాత్రకి ఒక ప్రత్యేకత లేకపోవడం .. ఆ పాత్రలని సరిగ్గా రిజిస్టర్ చేయకపోవడం .. పాత్రల సంఖ్య ఎక్కువ కావడం .. వాటిని అర్థమయ్యేలా పరిచయం చేయకపోవడం వలన .. సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా అయోమయాన్ని కలిగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచి ఆర్టిస్టులను ఎంచుకున్నప్పటికీ, వాళ్లని సరిగ్గా ఉపయో పగించుకోలేదని చెప్పుకుంటున్నారు.

మోహన్ లాల్ - ప్రియదర్శన్ కాంబినేషన్ గనుక, వసూళ్ల పరంగా అయితే ఆలోచించనవసరం లేదు. కాకపోతే మరికాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేదనే అంటున్నారు.