Begin typing your search above and press return to search.

'సారంగ దరియా' కాపీ ఆరోపణలపై సుద్దాల ఏమ‌న్నారు?

By:  Tupaki Desk   |   6 March 2021 10:42 AM GMT
సారంగ దరియా కాపీ ఆరోపణలపై సుద్దాల ఏమ‌న్నారు?
X
నాగ‌చైత‌న్య‌-సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న `ల‌వ్ స్టోరి` నుంచి సారంగ ద‌రియా సింగిల్ రిలీజై యూట్యూబ్ లో సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. జాతీయ అవార్డ్ గ్ర‌హీత సుద్దాల అశోక్ తేజ ఈ పాట‌ను రాశారు. పాట‌లో సాహిత్యం బాణీతో పాటు సాయిప‌ల్ల‌వి అద్భుత‌మైన స్టెప్పులు ఆక‌ట్టుకున్నాయి. దీంతో నిమిషాలు గంట‌ల్లోనే మిలియ‌న్ల‌ మంది వీక్షించారు. అయితే అలాంటి క్రేజీ పాటను ర‌చ‌యిత కాపీ చేశార‌ని తాజాగా ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌న‌మే అయ్యింది.

జాన‌ప‌ద బాణీలో సాగిన ఈ పాట‌ను రేలారే కార్య‌క్ర‌మంలో తొలిగా తాను పాడాన‌ని కోమ‌లి అనే జాన‌ప‌ద గాయ‌ని ఆరోపించారు. దీంతో వివాదం చెలరేగింది. కోమలి.. వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నూ గ్రామానికి చెందిన గాయని. సారంగ దరియా పాటను తానే తొలిగా పాడార‌ట‌. కొమలి మొదట తన అమ్మమ్మ నుండి ఈ పాటను సంగ్ర‌హించార‌ట‌. టీవీ షో రెలా రే రెలా లో కోమ‌లి పాడారు. ఆ కార్య‌క్ర‌మానికి ప్రధాన న్యాయమూర్తిగా సుద్దాల అశోక్ తేజ ఉన్నారు. తన పాట ఉపయోగించినప్పటికీ తగిన క్రెడిట్ ఇవ్వలేదని కోమలి ఆరోపించారు.

పాట ప్రోమో వచ్చిన తర్వాతే ఈ పాటను ఉపయోగించడం గురించి తనకు తెలిసిందని కోమ‌లి అన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ములకు ఈ పాట మూలం ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలుసున‌ని కూడా ఆమె అన్నారు. అయినా త‌న‌కు తగిన క్రెడిట్ ఇవ్వలేదని ఆరోపించారు. తనకు పాట పాడే అవకాశం ఇవ్వమని శేఖర్ కమ్ముల- సుద్దల అశోక్ తేజలను కోరినప్పటికీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. అప్పటికే ఆలస్యం అయిందని.. పాట పూర్తయిందని పంపేశారని కోమ‌లి తెలిపారు.

అయితే ఈ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వాల‌పై రచయిత సుద్దాల అశోక్ తేజనే ప్ర‌శ్నిస్తే కోమలి వెర్ష‌న్ తో విభేదిస్తున్నారు. `రేలా రే రెలా` కార్యక్రమంలో కొమలి ఈ పాట పాడినట్లు అంగీకరించిన ఆయన అంత‌కుముందే ఆ జానపద పాట దశాబ్దాల నుండి చెలామణిలో ఉందని చెప్పారు. మొక్క‌జొన్న‌ తోటలో వంటి ఇతర జానపద ట్యూన్ లేదా మాస్ ట్యూన్ మాదిరిగానే ఈ ట్యూన్ అలాగే య‌థాత‌థంగా ఉంచామ‌ని ఆయన చెప్పారు. పల్లవిలో అసలు పాట కొన్ని పంక్తులను య‌థాత‌థంగా ఉప‌యోగిస్తూ.. పాట చరణం సాహిత్యాన్ని మార్చానని ఆయన చెప్పారు. సారంగ దరియా వివాదం వెనుక అంత మ్యాట‌ర్ ఉంది.