Begin typing your search above and press return to search.

RRR గురించి బాలీవుడ్ ఏమంటోంది..?

By:  Tupaki Desk   |   26 March 2022 2:28 AM GMT
RRR గురించి బాలీవుడ్ ఏమంటోంది..?
X
'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు ''ఆర్.ఆర్.ఆర్'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రమోషనల్ కంటెంట్ తోనే సినిమాపై అంచనాలు రెట్టింపు చేసిన ఈ మూవీ కోసం భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా నార్త్ లో ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ చేశారు.

ఎట్టకేలకు ప్రేక్షకులను ఎంతో కాలంగా ఎదురుచూసిన RRR సినిమా నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చిన జక్కన్న.. మరోసారి విజువల్ వండర్ ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. తొలి రోజు అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ సందడే కనిపించింది.

ఉత్తరాదిలో 'ఆర్.ఆర్.ఆర్' ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడంతో అక్కడి జనాలు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. సినిమా రిలీజ్ అయ్యాక ఒకరిద్దరు మినహా దాదాపు బాలీవుడ్ క్రిటిక్స్ మరియు అక్కడి మీడియా సానుకూలమైన రివ్యూలు రేటింగ్స్ ఇచ్చారు. ట్విట్టర్ లో నార్త్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అలానే ఉంది.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ అద్భుతమైన నటన గురించి అందరూ కొనియాడుతున్నారు. ఇద్దరూ తమ పాత్రల్లో జీవించారని.. సినిమా కోసం తమ సర్వస్వం ఇచ్చారని పేర్కొన్నారు. అది డ్యాన్స్ సీక్వెన్స్‌ అయినా.. కఠినమైన పోరాట సన్నివేశాలైనా ఇద్దరు యాక్టర్స్ ఎంత కష్టపడ్డారో తెర మీద కనిపించిందంటున్నారు. రామరాజును నిప్పుగా.. కొమురం భీముడిని నీరుగా అభివర్ణిస్తూ రాజమౌళి రెండు పాత్రలను తనదైన శైలిని ఆవిష్కరించారన్నారు.

RRR విజువల్ గా అద్భుతంగా ఉందని.. ఎస్ఎస్ రాజమౌళి మరోసారి పెద్ద స్క్రీన్ మీద గూస్‌ బంప్స్ మూమెంట్స్ పుష్కలంగా అందించారని తెలిపారు. ఇది మాస్ ఎలిమెంట్స్ మరియు ఎమోషన్ తో ప్యాక్ చేయబడిన పేట్రియాటిక్ కథ అని.. ఊహకందని ఇంటర్వెల్ బ్లాక్ - అద్భుతమైన ప్రదర్శనలతో కూడినదని సమీక్షల్లో పేర్కొన్నారు. సాంకేతికంగా మరో స్థాయిలో ఉందని.. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయన్నారు.

ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం - సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ - శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఒకదానికొకటి బాగా కలిసి వచ్చాయని బాలీవుడ్ వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. కొన్ని భాగాలలో వీఎఫ్ఎక్స్ మరింత మెరుగ్గా ఉండవచ్చని.. సెకండాఫ్‌ లో కొద్దిగా పట్టు సడలిందని.. క్లైమాక్స్‌ లో ఇంకా ఎక్కువ ఆశించామని అన్నారు. 'బాహుబలి' సినిమాతో పోల్చలేమని తీర్పిచ్చారు.

లోటుపాట్లు ఉన్నప్పటికీ RRR అనేది పెద్ద స్క్రీన్‌ పై చూడటానికి అర్హమైన చిత్రమని.. ప్రేక్షకులు తప్పకుండా ఆదరించే విజువల్‌ కోలాహలమని పేర్కొన్నారు. పవర్-ప్యాక్డ్ పోరాట సన్నివేశాలు - ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి RRR సరిపోతుందని బాలీవుడ్ విశ్లేషకులు - జాతీయ మీడియా తమ రివ్యూలలో తెలిపారు.