Begin typing your search above and press return to search.

నటీమణులకు ఏమైంది? నెలలో నాలుగు ఆత్మహత్యలు

By:  Tupaki Desk   |   27 May 2022 2:30 AM GMT
నటీమణులకు ఏమైంది? నెలలో నాలుగు ఆత్మహత్యలు
X
మరో విషాద ఉదంతం బయటకు వచ్చింది. బెంగాల్ కు చెందిన మోడల్ కమ్ నటీమణి 21 ఏళ్ల బిదిషా డి మజుందార్ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని గుర్తించారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. విషాదకరమైన విషయం ఏమంటే.. బెంగాలీ చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు నటీమణులు ఈ నెలలో ఆత్మహత్య చేసుకోవటం విస్మయానికి గురి చేస్తోంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఈ నెలలో ఇప్పటివరకు నలుగురు నటీమణులు బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళనకు గురి చేస్తోంది.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కోతా లోని తన అపార్ట్ మెంట్ లోనే బిదిషా కొంతకాలంగా నివసిస్తున్నారు. ఇరుగు పొరుగు వారు ఇస్తున్న సమాచారం ప్రకారం ఆమె ఆ ప్లాట్ లో నాలుగు నెలలుగా ఉంటున్నట్లు చెబుతున్నారు. మోడల్ గా.. నటిగా గుర్తింపు పొందిన ఆమె.. తాజాగా ప్లాట్ లో ఊరి వేసుకున్న విషయాన్ని గుర్తించారు. తన ఆత్మహత్యకు కారణాన్ని తెలుపుతూ సూసైడ్ లెటర్ కూడా రాసినట్లు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ప్లాట్ వద్దకు చేరుకొని డెడ్ బాడీని.. సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టం కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. చిత్రపరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బెంగాల్ మీడియా సంస్థల రిపోర్టుల్ని చూస్తే.. బిదిషా కు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

అతనిలో రిలేషన్ షిప్ లో ఉన్న ఆమె కొద్ది రోజులుగా డిప్రెషన్ లో ఉందని ఆమె స్నేహితులు చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఆమె మరణం వెనుక అసలు కారణం ఏమిటన్న విషయాన్ని తేల్చేపనిలో పడ్డారు బెంగాల్ పోలీసులు.

ఇదిలా ఉంటే.. నెల వ్యవధిలో గ్లామర్ ప్రపంచానికి చెందిన నలుగురు నటీమణులు ఆత్మహత్య చేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. నటీమణులకు అసలేమైంది? ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నది ప్రశ్నగా మారింది. బెంగాల్ విషయానికే వస్తే.. వారం క్రితమే బెంగాలీ బుల్లితెర నటి పల్లవి డే తన ఫ్లాట్ లోనే అనుమానాస్పద రీతిలో మరణించటం తెలిసిందే.

దీనికి ముందు మే 11న బెంగళూరుకు చెందిన డ్యాన్సర్ టీనా సాధు ఆత్మహత్య చేసుకోగా.. తర్వాతి రోజునే కేరళకు చెందిన షహనా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా గ్లామర్ ప్రపంచానికి చెందిన మహిళా సెలబ్రిటీలు బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పదు.