Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కు ఏమైంది ?

By:  Tupaki Desk   |   6 Jun 2019 2:30 PM GMT
టాలీవుడ్ కు ఏమైంది ?
X
ఎవరు ఏ కంటెంట్ తో సినిమా తీసినా ఫైనల్ గా పెట్టుబడి పెట్టిన నిర్మాత బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు లాభాల కోసమే వ్యాపారం చేస్తారు. అంతే తప్ప హీరోకో దర్శకుడికో పేరు వస్తే చాలు మాకు డబ్బులు రాకపోయినా పర్వాలేదని ఎవరూ అనుకోరు. కాకపోతే మనిషి ఆశాజీవి. ఒకదాంట్లో పోయింది ఇంకోదాంట్లో వస్తుందన్న నమ్మకమే డిజాస్టర్లు ఫ్లాపులు యావరేజ్ లు వచ్చినా ఇంకో సినిమా కోసం కాసులను సిద్ధం చేయిస్తాయి.

కానీ ఈ ఏడాదిలో ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటిదాకా అన్ని వర్గాలకు యనానిమస్ గా లాభాలు ఇచ్చిన సినిమాలు సింగల్ డిజిట్ లోనే ఉండటం ఆందోళన కలిగించే విషయం. సంక్రాంతితో మొదలైన ఈ పరంపర ఇవాళ్టి దాకా కొనసాగుతూనే ఉంది. నిఖార్సుగా చెప్పుకునే హిట్లు చాలా తక్కువ స్థాయిలో ఉండటం నిర్లక్ష్యం చేసేది కాదు

జనవరి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే అందరూ హ్యాపీగా ఫీలైన సినిమాలు వ్రేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. ఎఫ్2 యునానిమస్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాక రుపాయకి మూడు రూపాయలు రిటర్న్ ఇచ్చిన మాట వాస్తవం. అదే సమయంలో వినయ విదేయ రామతో పాతిక కోట్ల దాకా నష్టం కలగగా ఎన్టీఆర్ బయోపిక్ ఏకంగా యాభై కోట్ల దాకా ముంచేసింది. అఖిల్ మిస్టర్ మజ్ను-వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇలా కొద్దో గొప్పో అంచనాలు ఉన్నవి నిరాశపరిచాయి. యాత్ర-కళ్యాణ్ రామ్ 118 చాలా వాటితో పోల్చుకుంటే నయమనిపించే ఫలితాన్ని అందుకున్నాయి. చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే ఉంది కాని చిన్నా చితకా చిత్రాలను ఇక్కడ ప్రస్తావించడం లేదు

ఏప్రిల్ చాలా ఆశజనకంగా కనిపించింది. అయితే లెక్కల్లో మాత్రం ఒక్క మజిలి మాత్రమే అంచనాలకు తగట్టు ఆడితే జెర్సీకి ఎన్నడూ లేని పాజిటివ్ రివ్యూలు టాక్ వచ్చినా అవి వసూళ్లుగా మారలేదు. కమర్షియల్ లెక్కల్లో యావరేజ్ గా మిగిలిపోయింది. చిత్రలహరి బెటర్ అనుకున్నా హీరో సాయి తేజ్ మార్కెట్ కి సగం ధరకే అమ్మడంతో సేఫ్ అయ్యింది కాని లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది.

మహర్షి వంద కోట్లు తెచ్చిందని చెప్పుకున్నా సీడెడ్ తో పాటు ఓవర్సీస్ లోనూ నష్టాలు తప్పలేదు. మిగిలిన ఏరియాలలో మంచి వసూళ్లు రాబట్టడం చాలా మటుకు కాపాడింది. ఇక అక్కడి నుంచి ఏదో ఒక సినిమా వస్తూనే ఉంది కాని ఏదీ హ్యాపీగా గుండెల మీద చేయి వేసుకుని నిద్ర పోయే స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆఖరికి ఇవాళ వచ్చిన హిప్పి-సెవెన్ లది కూడా అదే పరిస్థితి. ఈ ట్రెండ్ ఇలా కొనసాగడం చాలా ప్రమదకరం. ఇకనైనా దర్శక నిర్మాతలు మేల్కొని కాస్త కంటెంట్ మీద శ్రద్ధ పెంచితే తప్ప మనుగడ ప్రశ్నార్థకం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు