Begin typing your search above and press return to search.

MAA ఎన్నికలు.. కృష్ణంరాజుకు రాసిన లేఖ‌లో ఏం ఉంది?

By:  Tupaki Desk   |   9 Aug 2021 10:34 AM GMT
MAA ఎన్నికలు.. కృష్ణంరాజుకు రాసిన లేఖ‌లో ఏం ఉంది?
X
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లుక‌లుక‌ల గురించి తెలిసిందే. శివాజీరాజా వ‌ర్సెస్ సీనియ‌ర్ న‌రేష్ ఎపిసోడ్స్ తో `మా` అంత‌ర్గ‌త‌ విష‌యాల‌న్నీ బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ప్ర‌తిష్ఠాత్మ‌క మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీ తీవ్ర‌త‌ర‌మైంది. సెప్టెంబ‌ర్ 2021 ఎన్నిక‌ల్లో నువ్వా నేనా? అంటూ ఆరుగురు పోటీప‌డుతున్నారు. ఇందులో ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచువిష్ణు మ‌ధ్య పోటీ పైనే అంద‌రి దృష్టి. గ‌త అధ్య‌క్షుడు న‌రేష్ త‌న వ‌ర్గం మ‌ద్ధ‌తును మంచు విష్ణుకు అందిస్తార‌న్న టాక్ వినిపిస్తోంది.

అయితే మా క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ పెద్ద‌లు ఎవ‌రూ ఇంత‌వ‌ర‌కూ ఎన్నిక‌ల తేదీని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం విడ్డూరంగా ఉందంటూ టాక్ వినిపిస్తోంది. మెజారిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఇసి) సభ్యులు ఆగస్టు 22న జరగనున్న సమావేశంలో ఎన్నికల తేదీని సెప్టెంబర్ 12గా ప్రకటించాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ అధిపతి కృష్ణంరాజుకు లేఖ రాసినట్లు ప్ర‌చార‌మవుతోంది. అసోసియేషన్ అంతర్గత వ్యవహారాలను ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రముఖంగా కృష్ణంరాజును అభ్యర్థించారు. `మా` మొత్తం సభ్యుల సమావేశం ఈనెల‌ 22 న జరుగుతుంది. 12 మంది ఈసీ సభ్యులు ఎన్నికల తేదీ గురించి మాత్రమే చర్చించాలనుకుంటున్నారు. ఈ సమావేశంలో మరేమీ చర్చించకూడదు. జులై 30 న జరిగిన సమావేశంలో సెప్టెంబర్ 12 న ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించార‌ని గుస‌గుస‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే దానిని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. ప్రస్తుత ఈసీ పదవీకాలం మార్చి 31తో ముగిసిందని అందువల్ల ఇకపై సమావేశాలను నిర్వహించే హక్కు తమకు లేదని వారు పేర్కొన్నారు. వార్షిక జనరల్ బాడీ మీటింగ్ (యాన్యువ‌ల్ మీటింగ్) లో ఎన్నికల తేదీని నిర్ణయించాలని వారు అభిప్రాయపడ్డారు.

కోవిడ్ లాక్డౌన్ కారణంగా చాలా మంది న‌టీన‌టులు ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని.. వారికి సహాయం చేయడానికి వీలైనంత త్వరగా కొత్త బోర్డును ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆగస్టు 22 న జరిగే సమావేశంలో ఎన్నికల తేదీ అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌నే ఆశిద్దాం.

ఆ ఇద్ద‌రిపైనా వ్య‌తిరేక‌త దేనికి?

ఇటీవ‌ల మా అసోసియేష‌న్ వ‌ర్చువ‌ల్ మీటింగ్ లో ఇద్ద‌రు సీనియ‌ర్ న‌టుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీలోకి ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. సీనియర్ నటులు గిరిబాబు - శివ కృష్ణను క్రమశిక్షణ కమిటీలో చేర్చారు. అయితే ఈ ఆలోచనను కొంద‌రు వ్యతిరేకించారని తెలిసింది.

మా భ‌వంతి మ‌ళ్లీ హాట్ టాపిక్:

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల వేళ‌ వివాదాల‌న్నీ `మా సొంత భ‌వంతి` నిర్మాణం చుట్టూనే తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు ఆర్టిస్టుల సంఘం ద‌శాబ్ధాల పాటు మ‌నుగ‌డ సాగిస్తున్నా.. దాదాపు 950 మంది స‌భ్యుల‌తో సౌత్ లోనే అతి పెద్ద అసోసియేష‌న్ గా వెలిగిపోతున్నా కానీ `మా`కు సొంత భ‌వంతి లేక‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇన్నేళ్ల‌లో మా అసోసియేష‌న్ కి సొంత భ‌వంతి కోసం ప్ర‌య‌త్నాలు సాగ‌లేదా? అంటే.. ప్ర‌తిసారీ ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నా ఫెయిల‌య్యామ‌ని అంగీక‌రిస్తున్నారు. తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలో.. వైయ‌స్సార్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌య‌త్నించినా అవ్వ‌లేదు. ఇప్పుడు కేసీఆర్ హ‌యాంలో అవుతుందా? అన్న‌ది సందిగ్ధ‌మే.

సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఎజెండాగా తానే స్వ‌యంగా `మా భ‌వంతి`ని నిర్మించ‌డానికి ప్ర‌తి పైసా ఇస్తాన‌ని ఎవ‌రూ ఇవ్వ‌న‌వ‌స‌రం లేద‌ని మంచు విష్ణు ప్ర‌క‌టించినా దానిపై ఎవ‌రూ న‌మ్మ‌కం వ్య‌క్తం చేయ‌లేదు. మా సొంత భ‌వంతి నిర్మాణం విష‌యంలో ప్ర‌కాష్ రాజ్ పూర్తి క్లారిటీతో ఉన్నార‌ని .. స్థ‌ల సేక‌ర‌ణ స‌హా ప్ర‌తిదీ ఆయ‌న‌కు ఎలా చేయాలో తెలుసున‌ని ప్ర‌చారం చేసుకున్నారు. ప్ర‌భుత్వం నుంచి ప‌ని పూర్తి చేసే స‌మ‌ర్థ‌త ఆయ‌న‌కు ఉందా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. ఎవ‌రు గెలిచినా ఎవ‌రు గెల‌వ‌క‌పోయినా మా భ‌వంతి నిర్మాణం జ‌ర‌గాల‌ని ఆకాంక్షిద్దాం.