Begin typing your search above and press return to search.

ఆ సినిమాల్లో ఉన్నదేంటి..? 'పుష్ప' లో లేనిదేంటి..?

By:  Tupaki Desk   |   18 Dec 2021 3:33 PM GMT
ఆ సినిమాల్లో ఉన్నదేంటి..? పుష్ప లో లేనిదేంటి..?
X
'బాహుబలి' 'కేజీయఫ్' సినిమాల తరహాలోనే దక్షిణాది నుంచి రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రం ''పుష్ప''. ఫస్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' పేరుతో పాన్ ఇండియా స్థాయిలో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పుష్పరాజ్ అనే వ్యక్తి.. కూలీగా జీవితాన్ని ప్రారంభించి స్మగ్లింగ్‌ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదగాడన్నది చూపించారు.

'పుష్ప: ది రూల్' అనే టైటిల్ తో వచ్చే రెండో భాగంలో పుష్పరాజ్ తన ఆధిపత్యాన్ని ఎలా సాగించాడు అనేది చూపించబోతున్నారు. అలానే సమాధానాలు చెప్పని ప్రశ్నలను చూపిస్తూ.. అర్థాంతరంగా వదిలేసిన పాత్రలకు ముగింపు పలకనున్నారు. ఇదంతా తెర మీద ఎలా ఆవిష్కరిస్తారు? కొత్తగా ఏమేమి చూపిస్తారనే ఉత్సుకతే జనాలను థియేటర్లకు రప్పించాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ 'పుష్ప' పార్ట్-2 కోసం ఆసక్తి కలిగించేలా ఫస్ట్ పార్ట్ ని ముగించలేదని కామెంట్స్ వస్తున్నాయి.

'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ కూలీగా స్మగ్లర్ పుష్పరాజ్ గా అద్భుతమైన నటన కనబరిచారు. సినిమాకు తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చినా.. ఏ ఒక్కరు కూడా బన్నీ పెర్ఫార్మన్స్ కు వంక పెట్టలేదు. తన పాత్రకు ప్రాణం పెట్టి చేసారని.. సినిమాని ఒంటి చేత్తో నడిపించారని అంటున్నారు. కానీ పుష్ప రాజ్ పాత్ర ఇంకా పూర్తవ్వలేదు. రెండో భాగంలో అతని స్మగ్లింగ్ సిండికేట్ కు లీడర్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. అలాంటప్పుడు క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి.. సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని జనాలు మాట్లాడుకోవాలి. కానీ 'పుష్ప' విషయంలో అది జరిగినట్లుగా అనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నిజానికి 'పుష్ప' సినిమా రెండు భాగాలుగా చేస్తున్నారనే న్యూస్ వచ్చినప్పటి నుంచి.. 'బాహుబలి' 'కేజీయఫ్' ల స్థాయిలో ఆలోచించడం స్టార్ట్ చేశారు. 'బాహుబలి-1' క్లైమాక్స్ తో జనాల్లో క్యూరియాసిటీని పెంచి.. 'బాహుబలి 2' కోసం అందరూ ఎదురు చూసేలా చేశారు. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అని దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేశాడు. ఈ క్రమంలో రెండో పార్ట్ తో బిగ్గెట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

ఇక కన్నడ బాహుబలిగా పిలవబడే 'కేజీయఫ్' సినిమా క్లైమాక్స్ లో ట్విస్టులు ఏమీ లేనప్పటికీ.. కోలార్ గోల్డ్ మైన్స్ ని శాసించే విలన్ గరుడ ను అతని సామ్రాజ్యంలోనే హీరోతో చంపించి, రెండో భాగం మీద క్రేజ్ వచ్చేలా సినిమాని మలిచారు. అతను అధీరా వంటి బలమైన విలన్ తో ప్రభుత్వంతో ఎలా ఫైట్ చేయబోతున్నాడు అనే ఆసక్తి కలిగించారు. అందుకే వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలయ్యే 'కేజీయఫ్ 2' కోసం అందరూ ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నారు.

కానీ ఇక్కడ 'పుష్ప' విషయంలో ఆ రెండు సినిమాల స్థాయి క్లైమాక్స్ కొరవడిందని ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. మొదటి నుంచి కూడా సినీ అభిమానులు 'కేజీయఫ్' 'పుష్ప' సారూప్యత పెడుతూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. అక్కడ కోలార్ మైన్స్ లో రాకీ భాయ్ గా ఎదిగితే.. ఇక్కడ పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ కు నాయకుడుగా ఎదిగారు. ఈ నేపథ్యంలో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు 10 'కేజీయఫ్' లు కలిస్తే ఒక 'పుష్ప' అనే విధంగా ఎలివేషన్స్ ఇచ్చాడు.

అలానే దర్శకుడు సుకుమార్ సైతం ఇటీవల ప్రెస్ మీట్ లో 'బాహుబలి' 'కేజీఎఫ్' మాదిరి ఆసక్తికరంగా ఉంటుందని.., 'పుష్ప' చివరి 30 నిముషాలు రెండో భాగంపై అంచనాలను పెంచుతాయని చెప్పారు. కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత సెకండ్ పార్ట్ మీద కనబడలేదు. ప్రేక్షకులను ఉత్కంఠతో ఎదురు చూసే బలమైన పాయింట్‌ తో ‘పుష్ప: ది రైజ్‌’ కు ముగింపు ఇవ్వలేదు. మరి రెండో భాగం 'ది రూల్' కోసం సుకుమార్ ఎలాంటి కథ ప్లాన్ చేసుకున్నారో చూడాలి.