Begin typing your search above and press return to search.

సాహో శ్ర‌ద్ధ‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

By:  Tupaki Desk   |   2 Sep 2019 12:10 PM GMT
సాహో శ్ర‌ద్ధ‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
X
ఓవైపు సాహో ప్ర‌చారం.. మ‌రోవైపు ముంబై రోడ్ల‌పై నిర‌స‌న‌లు.. అస‌లేమిటి శ్ర‌ద్ధా డ‌బుల్ గేమ్? ఏమిటో అంతా కొత్త కొత్త‌గా ఉంది. సంవ‌త్స‌రం అంతా క్ష‌ణం తీరిక లేకుండా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఊపిరి తీసుకోవ‌డానికైనా స‌మ‌యం లేదు. కెరీర్ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం సాహో కోసం ఏడాది పాటు శ్ర‌మించింది. ప్ర‌చారంలో భాగంగా నెల‌రోజులుగా నిద్రాహారాలు మాని మెట్రో న‌గ‌రాల్లో ప‌ర్య‌టించింది. ఇంత బిజీ షెడ్యూల్స్ లో ఉండీ అల‌స‌ట అన్న‌దే లేకుండా ఇలా ఓ సోష‌ల్ కాజ్ కోసం రోడ్ల‌పై నిర‌స‌న‌లకు దిగుతుందా? హ్యాట్సాఫ్ చెప్ప‌కుండా ఉండ‌గ‌ల‌రా?

అయితే శ్ర‌ద్ధా నిర‌స‌న‌లు ఎందుకు? అంటే.. దానికి ఓ స‌హేతుక కార‌ణం ఉంది. ముంబై ప‌శ్చిమ ఎక్స్ ప్రెస్ హైవే స‌మీపంలో సంజ‌య్ గాంధీ నేష‌న‌ల్ పార్క్ ఉన్న చోట‌ యారీ ఏరియా అడ‌విలో 300 చెట్లు న‌రికేస్తున్నారట‌. అక్క‌డ మెట్రో లైన్ వేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌పోజ‌ల్ పెట్టింది. దీంతో అధికారులు చెట్లు న‌రికించేందుకు స‌న్నాహకాల్లో ఉన్నారు. అయితే దీనిపై ప‌బ్లిక్ నుంచి నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. జ‌నాల‌కు మ‌ద్ధ‌తుగా నిలుస్తూ .. శ్ర‌ద్ధా క‌పూర్ సైతం యారీ ఏరియాలో నిర‌స‌న‌లు చేప‌ట్టింది. ప్ల‌కార్డులు ప‌ట్టుకుని వీధివీధినా తిరిగి త‌న మ‌ద్ధ‌తును తెలిపింది. శ్ర‌ద్ధాతో పాటుగా భారీగా ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు కూడా నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ఓవైపు భారీ వ‌ర్షాలు ప‌డుతున్నా వేటినీ ఖాత‌రు చేయ‌కుండా ప్ర‌జ‌లు శ్ర‌ద్ధాకు అండ‌గా నిలుస్తున్నారు. యారీ ఫారెస్ట్ ను సంరక్షించేందుకు ఓ ప్ర‌య‌త్న‌మిది. ఈ యారీ ఫారెస్ట్ హిస్ట‌రీ కూడా చాలా పురాత‌న‌మైన‌ది. అక్క‌డ 1977లోనే ఫిలింసిటీ ఏర్పాటు చేయాల‌ని అనుకున్నారు. దానికోసం భారీగా అడ‌విని ధ్వంశం చేశారు. ఆ త‌ర్వాత‌ అక్క‌డ ఓ కాల‌నీ కూడా ఏర్ప‌డింది. వేలాది ఎక‌రాల్లో ఉన్న‌ భారీ ఫారెస్టులో 490 ఎక‌రాల అడ‌విని అప్ప‌ట్లోనే న‌రికేశారు. ఇక ఈ చోటు చోటా క‌శ్మీర్ త‌ర‌హాలో ఉంటుంద‌ట‌. అక్క‌డ ఓ అంద‌మైన స‌ర‌స్సు కూడా ఉంది. అడ‌వుల విధ్వంశంతో ఇవ‌న్నీ నాశ‌న‌మ‌వుతాయ‌ని ఆందోళ‌న చేస్తున్నార‌ట‌.

తాజాగా అక్క‌డ మెట్రో మార్గం వేసేందుకు అడ‌వులు న‌రికేయాల‌ని ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని శ్ర‌ద్ధా తీవ్రంగానే వ్య‌తిరేకిస్తోంది. అయితే నిర‌స‌న‌ల్లో ఎక్క‌డా హింసాత్మ‌కంగా ప్ర‌వ‌ర్తించ లేదు. ఎంతో శాంతియుతంగా నిర‌స‌న‌లు తెలియజేస్తోంది. అడ‌వుల సంర‌క్ష‌ణ మ‌న అంద‌రి బాధ్య‌త.. సేవ్ యారీ అంటూ రాసిన ప్ల‌కార్డ్ ను ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇంత మంచి ప‌ని చేస్తున్నందుకు శ్ర‌ద్ధాని ప్ర‌జ‌లంతా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అభిమానుల్లోనూ త‌న చ‌ర్య‌ల‌కు అద్భుత స్పంద‌న వ‌స్తోంది.