Begin typing your search above and press return to search.

అందరికీ తెలిసిన రామాయణాన్ని 3డీ లో చూపిస్తారా...?

By:  Tupaki Desk   |   4 Sep 2020 2:30 AM GMT
అందరికీ తెలిసిన రామాయణాన్ని 3డీ లో చూపిస్తారా...?
X
ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు విన్నా.. ఎన్నిసార్లు చూసినా తనవీ తీరని మహాకావ్యం 'రామాయణం'. అందుకే 'వింటే రామాయణం వినాలి.. తింటే గారెలు తినాలి' అంటుంటారు పెద్దలు. ఈ ఇతిహాసం గురించి ఇప్పుడు కొత్త‌గా తెలుసుకోవాల్సింది ఏం లేదు. గ్రంధాల రూపంలోనే కాకుండా ఆడియోల రూపంలో సినిమాల రూపంలో 'రామాయణం' మనకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే 'రామాయణం' ని ఆధారంగా చేసుకుని అనేక భాషల్లో సినిమాలు సీరియల్స్ రూపొందాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిసార్లు రామాయ‌ణ గాథ చూపించినా కూడా ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఇటీవల లాక్ డౌన్ సమయంలో 30 ఏళ్ల క్రితం వచ్చిన 'రామాయణం' సీరియల్‌ ని పునఃప్రసారం చేస్తే అత్యధికంగా వ్యూయర్ షిప్ సంపాదించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. రామాయణానికి ఎంతటి ఆదరణ ఉంటుందనడానికి ఇదొక ఉదాహరణ. ఇక మన తెలుగులో సైతం 'రామాయణం' మీద తెరకెక్కిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ ఇతిహాసం ఆధారంగా 'ఆదిపురుష్' అనే సినిమాతో రాబోతున్నాడు.

కాగా 'బాహుబలి'తో వచ్చిన ఇమేజ్ ని నిలబెట్టుకునే క్రమంలో ప్రభాస్ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీలో నటించడానికి రెడీ అయ్యాడు. ఇందుకు బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్‌ రౌత్ ని ఎంచుకున్నాడు ప్రభాస్. 'చెడుపై మంచి సాధించిన విజ‌యం' అనే థీమ్‌ తో తెరకెక్కనున్న 'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీఖాన్ రావణుడుగా కనిపించనున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అయితే ఇప్పుడు 'ఆదిపురుష్' లో కొత్తగా ఏమి చూపిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకముందు రామాయణంపై తీసిన సినిమాలన్నీ అప్పటి పరిస్థితులు బట్టి అందుబాటులో ఉన్న టెక్నాల‌జీని వాడుకొని తీసేశారు. ఇప్పుడు టెక్నాలజీని వాడుకొని 3డీ లో అందరికి తెలిసిన రామాయణాన్నే చూపిస్తారా? లేదా ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకొని 'ఆదిపురుష్' లో కొత్త‌గా ఏమైనా చెప్తారా? అని అందరూ ఆలోచిస్తున్నారు. మరి కొత్తగా ఏమి చూపిస్తారో తెలియాలంటే 2022లో మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని తెలుగు హిందీ భాషల్లో నిర్మించి తమిళం - మలయాళం - కన్నడ భాషలలో పాటు అనేక విదేశీ భాషల్లోకి అనువదించనున్నారు. తెలుగులో కూడా టీ సిరీస్ వారే రిలీజ్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ డిస్ట్రీబ్యూష‌న్ చేస్తారని తెలుస్తోంది.