Begin typing your search above and press return to search.

నైజాం లో టికెట్ రేట్ల ప‌రిస్థితి ఏంటీ?

By:  Tupaki Desk   |   1 Aug 2022 12:14 PM GMT
నైజాం లో టికెట్ రేట్ల ప‌రిస్థితి ఏంటీ?
X
తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో నైజాంలో టికెట్ రేట్లు ఏవిధంగా మార‌బోతున్నాయి అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. క‌రోనా త‌రువాత గ‌డిచిన గ‌త కొన్ని నెల‌లుగా టికెట్ రేట్ల కార‌ణంగా ప్రేక్ష‌కులు చాలా వ‌ర‌కు థియేట‌ర్ల ముఖం చూడాలంటే భ‌య‌ప‌డుతున్నారు. ఫ్యామిలీతో రావాలంటే జేబు గుల్ల‌యిపోతోంది. ఇంటిలో న‌లుగురు సినిమాకు వెళితే టికెట్ రేట్లు, స్నాక్స్ క‌లిసి రూ.2000 ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్తితి. ఈ భ‌యం వ‌ల్లే స‌గ‌టు ప్రేక్ష‌కుడు సినిమా థియేట‌ర్లకు రావ‌డానికి పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌డం లేదు.

RRR, కేజీఎఫ్ 2 వంటి సినిమాల‌కు బ‌డ్జెట్ ని బ‌ట్టి టికెట్ రేట్ల‌ని పెంచారు. అయితే ఆ సినిమాల‌పై వున్న క్రేజ్ కార‌ణంగా భారీగా టికెట్ ధ‌ర‌లు పెంచినా జ‌నం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఎంత టికెట్ రేటు పెంచినా ఆన్ లైన్ లో, క్యూలైన్ లో నిల‌బ‌డి కొన్నారు. భారీ స్థాయిలో ఆయా సినిమాల కోసం భారీగా ఖ‌ర్చు చేశారు. అయితే ఆ త‌రువాత వ‌చ్చిన సినిమాల‌కు కూడా భారీగా టికెట్ రేట్లు పెంచ‌డం జ‌నాల‌కు పెద్ద‌గా న‌చ్చ‌లేదు. దీంతో చాలా వ‌ర‌కు సినిమాల‌ని తిర‌స్క‌రించ‌డం మొద‌లు పెట్టారు.

దీంతో క్రేజీ స్టార్ లు న‌టించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని చేపించ‌లేక‌పోయాయి. థియేట‌ర్లలోకి వ‌చ్చిన రెండు మూడు వారాల‌కే చాలా వ‌ర‌కు సినిమాలు చేతులు ఎత్తేసి ఓటీటీ బాట ప‌ట్టాయి. ఈ నేప‌థ్యంలో టికెట్ రేట్ల విష‌యంలో మార్పులు తీసుకురావాల‌ని టాలీవుడ్ నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల షూటింగ్ ల బంద్ ప్ర‌క‌టించిన నిర్మాత‌లు టికెట్ రేట్ల విష‌యంలోనూ త‌గు నిర్ణ‌యం తీసుకోనున్నామంటూ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే త్వ‌ర‌లో విడుద‌ల కానున్న సినిమాల టికెట్ రేట్లు నైజాంలో ఏవిధంగా వుండ‌బోతున్నాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌తంలో కాకుండా కొన్ని సినిమాల‌కు పెంచి మ‌రి కొన్ని సినిమాల‌కు త‌గ్గించ‌కుండా ఒకే త‌ర‌హాలో ఫిక్డ్స్ గా టికెట్ రేట్లు వుండ‌నున్న‌ట్టుగా చెబుతున్నారు. నైజాం ఏరియాలో హ‌య్య‌ర్ క్లాస్ టికెట్ రేట్ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ. 150, మ‌ల్టీప్లెక్స్ ల‌తో రూ. 195 గా ఇక పై వుండ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఏపీలో ఇప్ప‌టికే ప్ర‌తి సినిమాకు ఒక‌టే రేటు గా ఫిక్స్ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ. 147, మ‌ల్టీప్లెక్స్ ల‌తో రూ. 177 గా ఫిక్స్ చేశారు. ఆగ‌స్టు 5న విడుద‌ల కానున్న క‌ల్యాణ్ రామ్ `బింబిసార‌`, దుల్క‌ర్ స‌ల్మాన్ `సీతారామం`, నిఖిల్ కార్తికేయ 2, నితిన్ మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం చిత్రాల‌కు ఇవే రేట్లు ఫిక్స్ చేసిన‌ట్టుగా తెలిసింది. `లైగ‌ర్‌` ప‌రిస్థితి ఎలా వుంటుందో ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టం.