Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీ మ్యాన్ 3' అసలు కథ ఏమిటంటే..?

By:  Tupaki Desk   |   11 Jun 2021 1:30 AM GMT
ఫ్యామిలీ మ్యాన్ 3 అసలు కథ ఏమిటంటే..?
X
దర్శకద్వయం రాజ్‌ & డీకే రూపొందించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్ ఎన్నో అంచనాలతో అమెజాన్ ప్రైమ్ లో విడుదలై దేశవ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకుంటోంది. మొదటి సీజన్ కు ధీటుగా తీర్చిదిద్దబడిన ఈ సిరీస్ తో సమంత అక్కినేని ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టింది. ఇందులో టాస్క్ ఆఫీసర్ శ్రీకాంత్‌ తివారిగా మనోజ్‌ బాజ్‌ పాయ్‌ మరోసారి ఆకట్టుకోగా.. రాజీ అలియాస్‌ రాజ్యలక్ష్మి అనే తమిళ ఈలం సోల్జర్ పాత్రలో సామ్ జీవించింది. ఇక ఈ సిరీస్ చివర్లో 'ఫ్యామిలీ మ్యాన్‌ 3' ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు.

మొదటి భాగంలో పాకిస్థాన్ ఉగ్రవాదంతో ఆకట్టుకోగా.. 'ఫ్యామిలీ మ్యాన్' రెండో భాగంలో తమిళ రెబల్స్‌ - శ్రీలంక నేపథ్యంలో కథాంశాన్ని తీసుకున్నారు. 'ప్రాజెక్ట్‌ గువాన్‌ యు' అంటూ మూడో సీజన్ లో డ్రాగన్ దేశం నుంచి వచ్చే ముప్పును శ్రీకాంత్‌ తివారీ అండ్‌ టీమ్‌ ఎలా నిర్వీర్యం చేస్తారో చూపించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే ఇందులో కూడా ఫ్యామిలీ డ్రామా ఉండేలా రాజ్ - డీకే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. శ్రీకాంత్ తివారి పాత్ర‌కి సంబంధించిన గ‌తాన్ని చూపించ‌బోతున్నార‌ట‌.

శ్రీకాంత్ తివారి పాత్ర గత రెండు సీజన్లలో ఓవైపు వృత్తి ధర్మం పాటిస్తూ మరోవైపు ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించడానికి సతమతమవుతుంటాడు. ఇప్పుడు 'ఫ్యామిలీ మ్యాన్‌ 3' లో అసలు అతను 'టాస్క్' ఏజెంట్ గా ఎలా తయారయ్యాడు.. ప్రియ‌మ‌ణితో పెళ్లి త‌దిత‌ర అంశాల్ని చ‌ర్చించ‌బోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఫస్ట్ సీజన్ లో సందీప్ కిషన్.. రెండో భాగంలో సమంత మాదిరిగా మూడో సీజన్ లో మరో టాలీవుడ్ స్టార్ నటించే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా తెలుగు దర్శకద్వయం రాజ్-డీకే రూపొందిస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' మూడో భాగంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.