Begin typing your search above and press return to search.

జీఎస్టీ దాడులు జరగలేదన్న అనసూయ ట్వీట్ లో నిజమెంత?

By:  Tupaki Desk   |   23 Dec 2019 5:12 AM
జీఎస్టీ దాడులు జరగలేదన్న అనసూయ ట్వీట్ లో నిజమెంత?
X
యాంకర్ గా పేరు ప్రఖ్యాతులు.. నటిగా మంచిపేరును.. సెలబ్రిటీగా చక్కటి ఇమేజ్ ఉన్న అనసూయకు సంబంధించిన జీఎస్టీ ఎగవేత అంశం గడిచిన మూడు రోజులుగా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. నటి లావణ్య త్రిపాఠి.. యాంకర్ అనసూయతో పాటు పలువురి ఇళ్లపైన జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారని.. ఈ సందర్భంగా పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ తనిఖీల ఎపిసోడ్ లో ప్రముఖ యాంకర్ సుమ పేరు మీడియాలో రావటం.. ఆమె ఖండించటం జరిగింది. ఇది జరిగిన తర్వాత అనసూయ సైతం ట్వీట్ చేశారు. తన ఇంట్లో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహించలేదని.. మీడియా కాస్త నిజాల్ని రాయాలంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఈ అంశంపై తాజాగా ఒక ఆంగ్ల మీడియా సంస్థ ఆసక్తికర కథనాన్ని పబ్లిష్ చేసింది.

దీని ప్రకారం తన ఇంటిపై జీఎస్టీ అధికారులు ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదన్న అనయసూ ట్వీట్ లో నిజం కొంత ఉందనే చెప్పాలి. ఎందుకంటే.. ఆమె ఇంట్లో తనిఖీలు నిర్వహించింది ఈ మేలో అన్న విషయాన్ని అనసూయ సదరు మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడినట్లుగా తమ కథనంలో పేర్కొంది. ఆ సమయంలో తాను చేసిన అగ్రిమెంట్ల కాపీలను అధికారులు తీసుకెళ్లినట్లుగా అనసూయ పేర్కొన్నారు.

మేలో తనిఖీలు జరిగితే..ఇప్పుడే జరిగినట్లుగా మీడియా రాసిన వార్తల్లో నిజం లేకున్నా.. పూర్తిగా అబద్ధమని చెప్పక తప్పదు. మీడియా తప్పు ఏమైనా ఉందంటే.. తనిఖీలు చేసిన సమయాన్ని సరిగ్గా చెప్పకపోవటమేనని చెప్పాలి. ఇంతకీ మేలో అధికారుల తనిఖీల తర్వాతేం జరిగిందన్న విషయాన్ని జీఎస్టీ అధికారి మాటల్లోనే సదరు మీడియా సంస్థ తన కథనాన్ని నడిపించింది.

జీఎస్టీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎం. బాలాజీ అనసూయ జీఎస్టీ కేసుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. తమ విచారణలో అనసూయ దాదాపు రూ.35లక్షల మేర సర్వీసు ట్యాక్స్ ను చెల్లించలేదన్న విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆ మొత్తానికి సంబందించిన వడ్డీని.. అపరాధ సొమ్మును కూడా చెల్లించలేదని తేల్చారు. ఈ మొత్తం కలిపితే దగ్గర దగ్గర రూ.80 లక్షల వరకూ అనసూయ చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ ఆమె రూ.25లక్షల వరకూ చెల్లించారని.. మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందంటున్నారు.

ఇదంతా చూసినప్పుడు తమ ఇంట్లో తాజాగా తనిఖీలు జరగలేదన్న అర్థసత్యాన్ని నిరూపించే ప్రయత్నంలో ట్వీట్ చేసి.. ఆమె పన్ను ఎగవేతకు సంబంధించిన మొత్తం లెక్కలు బయటకు వచ్చేలా చేసుకున్నారన్న మాట వినిపిస్తోంది. అనసూయ కానీ ట్వీట్ చేయకుంటే.. ఆమె ఇంట్లో జరిగిన జీఎస్టీ తనిఖీల లోతుల్లోకి మీడియా వెళ్లేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మీడియా చేసిన చిన్న పొరపాటును హైలెట్ చేయాలనుకున్న అనసూయ.. తన పన్ను చెల్లింపుల బాకీ మొత్తం ఎంతన్న విషయాన్ని అందరికి తెలిసేలా చేసుకున్నారని చెప్పక తప్పదు. ఎదుటోళ్ల మీద వేలెత్తి చూపించే ముందు.. మనవైపు ఉన్న తప్పుల లెక్క చూసుకొని రియాక్ట్ అయితే బాగుండన్న విషయం అనసూయకు ఇప్పటికైనా అర్థమవుతుందంటారా?